జీఎస్టీపై ప్రతిపక్షాల ఉమ్మడి పోరు

ABN , First Publish Date - 2022-07-21T10:13:01+05:30 IST

పలు నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపు, పెట్రో ధరలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అగ్నిపథ్‌ తదితర అంశాలపై నిరసనగా కాంగ్రెస్‌తో సహా పలు ప్రతిపక్ష పార్టీలు బుధవారం ఢిల్లీలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశాయి.

జీఎస్టీపై ప్రతిపక్షాల ఉమ్మడి పోరు

  • ఢిల్లీలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా
  • కాంగ్రెస్‌తో గొంతు కలిపిన టీఆర్‌ఎస్‌ 
  • పార్లమెంటులోనూ నిరసనలు.. వాయిదా
  • రాష్ట్రంలోనూ టీఆర్‌ఎస్‌ ఆందోళనలు పాలు, బియ్యంపై జీఎస్టీతో భారం: కేటీఆర్‌


న్యూఢిల్లీ, హైదరాబాద్‌ సిటీ, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): పలు నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపు, పెట్రో ధరలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అగ్నిపథ్‌ తదితర అంశాలపై నిరసనగా కాంగ్రెస్‌తో సహా పలు ప్రతిపక్ష పార్టీలు బుధవారం ఢిల్లీలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశాయి. కాంగ్రెస్‌, డీఎంకే, ఎన్సీపీ, టీఆర్‌ఎస్‌, వామపక్షాలతో పాటు పలు పార్టీల ఎంపీలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. పాలు, పెరుగు పాకెట్లు, గ్యాస్‌ సిలిండర్లతో పాటు పలు నిత్యావసర వస్తువులను ధర్నాలో ప్రదర్శించారు. ప్లకార్డులు పట్టుకుని పెంచిన ధరలను వెనక్కు తీసుకోవాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీతో పాటు ఆ పార్టీ ఎంపీలు పాల్గొన్న ఈ ధర్నాలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు పూర్తి బలాన్ని ప్రదర్శించారు. రాహుల్‌ గాంధీకి ఇరువైపులా, వెనుకా నిలబడి నినాదాలు చేశారు.


 ధర్నా అనంతరం ఉభయ సభల్లోనూ నిరసన కొనసాగించారు. ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై తక్షణమే చర్చ చేపట్టాల ని లోక్‌సభలో ప్రతిపక్షాల సభ్యులు డిమాండ్‌ చేశారు. జీవో అవర్‌లో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని స్పీకర్‌ ఓం బిర్లా చెప్పినా వారు వినలేదు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో మూడో రోజైన బుధవారం పార్లమెంటు సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే ముగిశాయి. గందరగోళం మధ్య గురువారానికి వాయిదా పడ్డాయి. కాగా, నిత్యావసరాలపై జీఎస్టీ విధింపునకు నిరసనగా టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యాన హైదరాబాద్‌లో ప్రధాని మోదీ దిష్ఠిబొమ్మలను దహనం చేశారు. మేడ్చల్‌ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గేదెల మెడలో నిత్యావసరాల దండలు వేసి నిరసన తెలుపుతూ ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించాలని కోరుతూ మహబూబ్‌నగర్‌ జడ్పీ సమావేశంలో తీర్మానం చేశారు. 


కేంద్రానిది మొండి వైఖరి: జైరాం రమేశ్‌

ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాల గురించి చర్చించకుండా, కేంద్ర ప్రభుత్వం చూపుతున్న మొండి వైఖరి కారణంగానే పార్లమెంటు సమావేశాలకు అంతరాయం కలుగుతోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ చీఫ్‌ విప్‌ జైరాం రమేశ్‌ అన్నారు. ద్రవ్యోల్బణం, జీఎస్టీ ధరల పెంపుపై వెంటనే సభలో చర్చించాలని డిమాం డ్‌ చేశారు. ‘‘ఆహార ఉత్పత్తులపై అనాలోచితంగా పెంచిన జీఎస్టీపై రాజ్యసభలో చర్చించాలని ఈరోజు ఉదయం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు. మోదీ ప్రభుత్వ మొండివైఖరి కొనసాగుతోంది. పార్లమెంటు సమావేశాల నిర్వహణ దెబ్బతింటోంది’’ అని బుధవారం ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు.  


సభ సాఫీగా సాగేందుకైనా

రాహుల్‌ ఉపయోగపడాలి: స్మృతి ఇరానీ

రాహుల్‌ గాంధీ రాజకీయాల్లో పనికిరాని వ్యక్తి కావచ్చు కానీ లోక్‌సభలో సమావేశాలు సాఫీగా సాగేందుకైనా ఉపయోగపడాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. సభ బుధవారం వాయిదా పడిన తర్వాత విలేకరులతో ఆమె మాట్లాడారు. పార్లమెంటు విధానాలు, సంప్రదాయాలను అగౌరవపరిచిన వ్యక్తిగా రాహుల్‌ రాజకీయ జీవితం సాగుతోందని విమర్శించారు.. 

Updated Date - 2022-07-21T10:13:01+05:30 IST