సీజేఐకి న్యాయమూర్తుల సన్మానం

ABN , First Publish Date - 2021-06-13T08:43:23+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ శనివారం తేనీటి విందు ఇచ్చారు.

సీజేఐకి న్యాయమూర్తుల సన్మానం

  • తెలంగాణ సీజే నివాసంలో తేనీటి విందు... 
  • ఇరు హైకోర్టుల న్యాయమూర్తులు హాజరుఠి

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ శనివారం తేనీటి విందు ఇచ్చారు. శనివారం సాయంత్రం హైకోర్టు సీజే బంగ్లాలో జరిగిన ఈ కార్యక్రమలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎ్‌స.రామచంద్రరావు, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ చల్లా కోదండరాం, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, జస్టిస్‌ జి.శ్రీదేవి, జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ టి.అమరనాథ్‌గౌడ్‌, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి, జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌లు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు సీజే, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రమణను ఘనంగా సన్మానించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ జీవన్‌రెడ్డి, జస్టిస్‌ ఖాద్రి, జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, జస్టిస్‌ పి.వెంకట్రామిరెడ్డి, జస్టిస్‌ ఎం.జగన్నాథరావులు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరుప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌, జస్టిస్‌ భట్టు దేవానంద్‌, జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి, జస్టిస్‌ లలితలు భారత ప్రధాన న్యాయమూర్తిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వరెరెడ్డి, పలువురు రిజిస్ట్రార్లు, పలువురు బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సభ్యులు సీజేఐని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. తెలంగాణ హైకోర్టు జడ్జీల సంఖ్య 70 శాతం అంటే 24 నుంచి 42 పెంచినందుకు జస్టిస్‌ రమణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని కోర్టుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ‘జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పోరేషన్‌’ ఏర్పాటు చేయాలని పలువురు న్యాయమూర్తులు సీజేఐ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అందుకు సానుకూలంగా స్పందించిన సీజేఐ రమణ తనశాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న జడ్జిల ఎంపికలో సామాజిక న్యాయానికి, వైవిధ్యానికి పెద్దపీట వేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఆయన సూచించినట్లు సమాచారం. సుప్రీంకోర్టు, జస్టిస్‌ రమణలతో కూడిన ఫొటోపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులంతా సంతకాలు చేసి, ఆయనకు జ్ఞాపికగా సమర్పించారు.




సీజేను సన్మానించిన బార్‌ కౌన్సిల్‌ 

తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డి, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు పి.విష్ణువర్దన్‌రెడ్డి శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణను మర్యాద పూర్వకంగా కలిశారు. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 42కు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు. హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆయన్ను అభినందించారు. 

Updated Date - 2021-06-13T08:43:23+05:30 IST