ఒలింపిక్‌ పతక స్ఫూర్తితో.. మరోమారు..కప్‌ మారో!

ABN , First Publish Date - 2021-11-24T08:44:35+05:30 IST

నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్‌ పతకం నెగ్గిన సీనియర్‌ హాకీ జట్టు స్ఫూర్తితో.. జూనియర్‌ వరల్డ్‌క్‌పలో భారత కుర్రాళ్లు బరిలోకి దిగనున్నారు.

ఒలింపిక్‌ పతక స్ఫూర్తితో.. మరోమారు..కప్‌ మారో!

  • ఫేవరెట్‌గా డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌
  • నేటి నుంచే జూనియర్‌ హాకీ వరల్డ్‌కప్‌


భువనేశ్వర్‌: నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్‌ పతకం నెగ్గిన సీనియర్‌ హాకీ జట్టు స్ఫూర్తితో.. జూనియర్‌ వరల్డ్‌క్‌పలో భారత కుర్రాళ్లు బరిలోకి దిగనున్నారు. బుధవారం ఆరంభమయ్యే మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో డిఫెండింగ్‌ చాంప్‌ టీమిండియా తలపడనుంది. 2001లో ఆస్ట్రేలియాలో జరిగిన టోర్నీలో తొలిసారి జూనియర్‌ వరల్డ్‌క్‌పను ముద్దాడిన భారత్‌.. 2016లో లఖ్‌నవూలో రెండోసారి విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో మంచి జోరుమీదున్న టీమిండియా.. సొంతగడ్డపై మరోసారి చాంపియన్లుగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. 2016లో ఆడిన తొమ్మిది మంది టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ నేతృత్వంలో జూనియర్లకు ఇదో సువర్ణావకాశం. సీనియర్లతో ఎక్కువగా ప్రాక్టీస్‌ చేసిన అనుభవం కూడా వీరికి ఎంతగానో ఉపయోగపడనుంది.


కుర్రాళ్లను టోర్నీకి సన్నద్ధం చేయడానికి చీఫ్‌ కోచ్‌ గ్రహమ్‌ రీడ్‌తోపాటు టాప్‌ ప్లేయర్లు మన్‌ప్రీత్‌ సింగ్‌, శ్రీజేష్‌ ఎంతగానో శ్రమించారు. కొవిడ్‌ సంబంధిత ఆంక్షల కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ తప్పుకోవడంతో భారత్‌తోపాటు బెల్జియం, నెదర్లాండ్స్‌, జర్మనీని హాట్‌ ఫేవరెట్స్‌గా భావిస్తున్నారు. బయోబబుల్‌లో నిర్వహిస్తున్న టోర్నీ కావడంతో.. స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించక పోవడం కొంత లోటుగా కనిపిస్తోంది.


నాలుగు గ్రూప్‌లుగా..: 16 జట్లు పాల్గొంటున్న మెగా ఈవెంట్‌లోని పూల్‌-బిలో భారత్‌తోపాటు ఫ్రాన్స్‌, కెనడా, పోలెండ్‌.. పూల్‌-ఎలో బెల్జియం, మలేసియా, చిలీ, దక్షిణాఫ్రికా.. పూల్‌-సిలో నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, కొరియా, అమెరికా.. పూల్‌-డిలో జర్మనీ, పాకిస్థాన్‌, ఈజిప్ట్‌, అర్జెంటీనా జట్లు ఉన్నాయి. ప్రతి పూల్‌నుంచి టాప్‌-2 టీమ్‌లు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. డిసెంబర్‌ 5న ఫైనల్‌ జరుగుతుంది.


ఈ టోర్నీలో అత్యధికంగా ఆరుసార్లు జర్మనీ చాంపియన్‌గా నిలిచింది. 


టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్‌

బుధవారం: భారత్‌ గీ ఫ్రాన్స్‌ (రాత్రి 8 గం.)

గురువారం: భారత్‌ గీ కెనడా (రాత్రి 7.30 గం.)

శనివారం: భారత్‌ గీ పోలెండ్‌ (రాత్రి 7.30 గం.)


వరల్డ్‌క్‌పలో భారత్‌

2001, 2016 - విజేత

1997- రన్నరప్‌

2005- నాలుగో స్థానం


జట్టుగా ఎదుర్కోండి: మన్‌ప్రీత్‌ సింగ్‌, టీమిండియా కెప్టెన్‌

కఠిన పరిస్థితుల్లో సంయమనం కోల్పోకుండా.. కలసికట్టుగా ఎదుర్కోవడం మెగా టోర్నీల్లో విజయానికి ప్రధాన సూత్రం. ఆటలో గెలుపోటములు సహజం. అందుకు ఎవరినీ నిందించొద్దు. జట్టుగా ఆడడంపైనే దృష్టి పెట్టండి. 


సీనియర్ల  సూచనలు

ఎంతో శ్రమించారు: శ్రీజేష్‌, గోల్‌కీపర్‌

గత రెండు నెలలుగా జాతీయ క్యాంప్‌లో కుర్రాళ్లు బాగా ప్రాక్టీస్‌ చేశారు. సీనియర్‌ జట్టుతో కూడా తలపడ్డారు. మెగా టోర్నీకి వారు సంసిద్ధులయ్యారు. అయితే, ఎంతో ప్రోత్సహించే అభిమానులు లేకపోవడం ఒకింత లోటు. 

Updated Date - 2021-11-24T08:44:35+05:30 IST