సెమీస్‌లో భారత్‌

ABN , First Publish Date - 2021-12-02T08:03:48+05:30 IST

జూనియర్‌ హాకీ వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ టైటిల్‌ నిలబెట్టుకునేందుకు మరింత చేరువవుతూ సెమీస్‌కు దూసుకెళ్లింది.

సెమీస్‌లో భారత్‌

బెల్జియంపై 1-0తో గెలుపు

జూనియర్‌ హాకీ వరల్డ్‌కప్‌

భువనేశ్వర్‌: జూనియర్‌ హాకీ వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ టైటిల్‌ నిలబెట్టుకునేందుకు మరింత చేరువవుతూ   సెమీస్‌కు దూసుకెళ్లింది. శర్దానంద్‌ తివారీ ఏకైక గోల్‌తోపాటు డిఫెండర్లు రాణించడంతో క్వార్టర్స్‌పోరులో టీమిండియా గట్టెక్కింది. బుధవారం జరిగిన ఈ పోరులో భారత్‌ 1-0తో బెల్జియంపై ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. గత టోర్నీ ఫైనల్లో రెడ్‌ లయన్స్‌ను ఓడించి విజేతగా నిలిచిన భారత్‌.. మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్‌ గోల్‌ లేకుండా ముగిసినా.. రెండో క్వార్టర్‌లో టీమిండియా ఖాతా తెరిచింది. 21వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను శర్దానంద్‌ తివారీ గోల్‌గా మలచడంతో భారత్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. 26వ నిమిషంలో బెల్జియంకు పెనాల్టీ కార్నర్‌ లభించినా వృథా చేసింది. మూడో క్వార్టర్‌లో రెడ్‌ లయన్స్‌ పదేపదే దాడులు చేసినా.. భారత రక్షణపంక్తిని ఛేదించలేకపోయింది. 50వ నిమిషంలో రోమన్‌ డివెక్టో కొట్టిన షాట్‌ను భారత గోల్‌ కీపర్‌ పవన్‌ అద్భుతంగా కాపాడాడు. 52వ నిమిషంలో బెల్జియంకు మరో పెనాల్టీ కార్నర్‌ లభించినా భారత డిఫెండర్లు సమర్ధంగా అడ్డుకున్నారు.  ఫైనల్లో చోటు కోసం శుక్రవారం జరిగే సెమీఫైనల్లో జర్మనీతో భారత్‌ తలపడనుంది. ఆతిథ్య భారత్‌తోపాటు ఆరుసార్లు చాంపియన్‌ జర్మనీ, అర్జెంటీనా, ఫ్రాన్స్‌ కూడా ఫైనల్‌ ఫోర్‌కు చేరుకున్నాయి.  


షూటౌట్‌లో నెగ్గిన జర్మనీ

హోరాహోరీగా సాగిన తొలి క్వార్టర్స్‌ మ్యాచ్‌లో జర్మనీ విజయం సాధించింది. పెనాల్టీ షూటౌట్‌లో జర్మనీ 2-2(3-1)తో స్పెయిన్‌పై గెలిచింది. రెండో క్వార్టర్స్‌లో అర్జెంటీనా 2-1తో నెదర్లాండ్స్‌పై నెగ్గింది. మరో పోరులో క్లెమెంట్‌ తిమోతి (14వ, 24వ, 60వ) హ్యాట్రిక్‌ గోల్స్‌తో చెలరేగడంతో ఫ్రాన్స్‌ 4-0తో మలేసియాను చిత్తుచేసింది.


శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో.. 

ఫ్రాన్స్‌ గీ అర్జెంటీనా (సా. 4.30 నుంచి)

భారత్‌ గీ జర్మనీ (రాత్రి 7.30 నుంచి)

Updated Date - 2021-12-02T08:03:48+05:30 IST