Advertisement
Advertisement
Abn logo
Advertisement

జనంలోకి వెళ్లేందుకు జంకు!

సీఎం జగన్‌కు దుర్భేద్య రక్షణ 

వెనుక అసలు కారణం ఇదేనా?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో..

ముఖ్యమంత్రి అయ్యాక ఇంట్లోనే..

ప్రజల్లోకి వెళ్తే నిలదీస్తారనేనా?

మాట.. మడమ తిప్పిన ఫలితమే

జనంలో సీఎంపై వ్యతిరేకత!

పసిగట్టిన నిఘా వర్గాలు

అందుకే ఎక్కడికక్కడ బారికేడ్లు

పరదాలు కూడా కడుతున్న వైనం

ప్రజలను దరికి రానివ్వని పోలీసులు

ఉగ్రవాద ముప్పు లేకున్నా

ముఖ్యమంత్రికి పటిష్ఠ భద్రత

300 మంది పోలీసులతో రక్షణ

‘పోస్టుల’ భయంతో ఉన్నతాధికారుల ముందు జాగ్రత్త?


ప్రతిపక్షంలో ఉండగా నిత్యం ప్రజల్లోనే ఉన్నారు.. అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలంటూ బుగ్గలు రుద్ది మరీ ముద్దులు పెట్టారు.. మీ అందరి దీవెనలతో అధికారంలోకి వస్తే అన్నీ చేస్తానని మాటిచ్చారు.. అఖండ మెజారిటీతో గెలిచి గద్దెనెక్కాక..  వారికి పూర్తిగా ముఖం చాటేశారు.. పెన్షన్లు కోసేశారు.. చదువుకున్నోళ్లకు ఉద్యోగ నోటిఫికేషన్‌ మరిచారు.. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం కూడా గ్యారెంటీ లేకుండా చేశారు.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు.. ఇప్పుడు జగన్‌ జనంలోకి వెళ్లడానికే జంకుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వరదలతో అతలాకుతలమైన రాయలసీమలో.. అందునా తన సొంత జిల్లాలో బాధితులను పరామర్శించినా.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటితో పోల్చితే.. స్పష్టమైన తేడా కనిపిస్తోంది. చుట్టూ పోలీసులు, రోప్‌ పార్టీలను పెట్టుకోవడం.. నెల్లూరులో మురుగు మేటలు కనిపించకుండా పరదాలు కట్టడం.. అసలైన బాధితుల బదులు ‘సుశిక్షిత’ వైసీపీ కార్యకర్తలతో మాట్లాడడం వంటివి చూస్తే.. సీఎం ప్రజలకు భయపడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఏ నాయకుడూ జగన్మోహన్‌రెడ్డిలాగా ప్రజల్లోకి వెళ్లింది లేదు.. సీఎం అయ్యాక ఆయనలా దూరమైందీ లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా పూర్తిగా జనంలోనే ఉన్న ఆయన.. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు బారికేడ్లు అడ్డు పెట్టుకుని.. అల్లంత దూరం నుంచే చేయి ఊపుతున్నారంటే ప్రజల్లో ఆయనపై ఉన్న వ్యతిరేకతను నిఘా వర్గాలు పసిగట్టినట్లు స్పష్టమవుతోందని చెబుతున్నాయి. దేశంలో తీవ్రవాదులు, మావోయిస్టులు, సంఘవిద్రోహ శక్తుల నుంచి ముప్పున్న ప్రజాప్రతినిధుల్లో మాజీ ఉపప్రధాని ఎల్‌కే ఆడ్వాణీకి, టీడీపీ అధినేత చంద్రబాబుకు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లాంటివారికి జడ్‌ ప్లస్‌ భద్రత కల్పిస్తున్నారు. కానీ జగన్‌కు అత్యంత దుర్భేద్య రక్షణ ఎందుకు కల్పిస్తున్నట్లు? ప్రజలు, సొంత పార్టీ నేతలు కూడా ఆయన సమీపానికి రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? బారికేడ్లు, పరదాలు ఎందుకు కడుతున్నట్లు..? ‘జగన్‌ సీఎం అయ్యాక ప్రవేశపెట్టిన పథకాలతో మావోయిస్టులు కనుమరుగయ్యారని సాక్షాత్తూ డీజీపీ గౌతమ్‌ సవాంగే ప్రకటించారు. పోనీ.. రాష్ట్రానికి ఉగ్రవాదుల ముప్పుందా..? ఎర్రచందనం స్మగ్లర్లను జగన్‌ హయాంలో ఎన్‌కౌంటర్‌ చేశారా..? ఉత్తరాంధ్రలో గంజాయి స్మగ్లర్లను కాల్చిచంపారా..? ఇటువంటివేమీ లేవు కదా! అయినా జగన్‌ కాలు బయట పెడితే చాలు.. బెజవాడలో రోడ్లు, ఫ్లై ఓవర్లను బ్లాక్‌ చేయడం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంక్షల వరకూ అడుగడుగునా పోలీసులు అతిజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు’ అని ఆక్షేపిస్తున్నారు.


ఇద్దరు గన్‌మెన్‌ నుంచి వందలాది మంది పోలీసుల వరకూ..

రాష్ట్రంలో ప్రస్తుతం అధికారపక్ష ప్రజాప్రతినిధులకు ఇద్దరు లేదా నలుగురు గన్‌మెన్‌ నుంచి వందలాది మంది సాయుధ పోలీసులతో భద్రత కల్పించాల్సి రావడం పోలీసుశాఖకు సైతం ఇబ్బందిగా మారింది. ఉమ్మడి రాష్ట్ర సీఎం జలగం వెంకట్రావుకు ముందు పనిచేసిన ముఖ్యమంత్రులకు నలుగురు గన్‌మెన్‌తో మాత్రమే భద్రత ఉండేది. నక్సల్స్‌ దేశభక్తులని ప్రకటించి నిషేధం ఎత్తివేసిన ఎన్టీఆర్‌కు కూడా భద్రత సాధారణంగా ఉండేది. మావోయిస్టులపై కఠినంగా వ్యవహరించిన చంద్రబాబుపై 2003లో అలిపిరి వద్ద బాంబుదాడి జరిగింది. దీంతో ఆయనకు కేంద్రం బ్లాక్‌ కమేండోలతో భద్రత కల్పించింది. మావోయిస్టులతో చర్చలు జరిపిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర విభజన ఉద్యమాన్ని ఎదుర్కొన్న రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలకు అలాంటి భద్రత లేదు. అయితే అత్యంత ప్రజాదరణ పొందిన జగన్‌ రెండున్నరేళ్లలోనే ఇంతటి అభద్రతలోకి వెళ్లడం చర్చనీయాంశమైందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.


మడమ తిప్పడమే కారణమా..?

ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి పాదయాత్రతో వెళ్లిన జగన్‌ హామీల వర్షం కురిపించారు. అందులో ప్రధానంగా నిరుద్యోగులకు ఉపాధి. ఏటా జనవరిలో నోటిఫికేషన్‌ ఇస్తానన్న హామీని అధికారంలోకి వచ్చాక పక్కనపెట్టేశారు. ఓటు బ్యాంకు పెంచుకోవడానికి వలంటీర్లను, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందినీ నియమించుకున్నారు. లక్షల్లో ఉద్యోగ భర్తీ అని చెప్పి.. తనకు భద్రత కల్పిస్తున్న పోలీసు శాఖలో సైతం ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. సామాజిక పింఛను 3వేలు ఇస్తానని మాటిచ్చారు. ఈ రెండున్నరేళ్లలో పెంచింది రూ.250 మాత్రమే. రకరకాల నిబంధనలు పెట్టి.. అర్హత లేదంటూ పెన్షన్లలో భారీ కోతపెట్టారు. అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాల అర్హుల జాబితా ఎప్పటికప్పుడు తగ్గిపోతోంది. గద్దెనెక్కిన వారంలోగా ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దుచేస్తానన్నారు. 30నెలలు గడచినా అతీగతీ లేదు. పెండింగ్‌లో ఉన్న 6 డీఏల సంగతి తర్వాత.. కనీసం ప్రతినెలా 1న జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి తెచ్చారు. పీఆర్‌సీపై సర్కారు ఆడుతున్న నాటకం రోజురోజుకూ రక్తి కడుతోంది. ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి.. కనీసం నివేదికను కూడా చూపడం లేదు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులూ జరగడం లేదు. బిల్లులు చెల్లించకపోవడంతో రోడ్ల పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకే రావడం లేదు. అమరావతి ఉద్యమానికి ప్రజల్లో స్పందన బాగుండడం.. హైకోర్టులో చుక్కెదురు ఖాయమన్న అంచనాతో మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుని.. జగన్‌ వెనకడుగు వేశారు. మంత్రివర్గ సమావేశం పెట్టినప్పుడో.. అసెంబ్లీ ఉన్నప్పుడు మాత్రమే సచివాలయం వైపు వెళ్లే ఆయనకు.. రాజధాని రైతుల ఆందోళన కూడా ఇబ్బందిగానే ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇది మరింత ముదిరి రాళ్లు, చెప్పులు వేసేదాకా వెళ్తే.. పరిస్థితేంటని వారు భయపడుతున్నారు. అందుకే ఆయనకు 300 మందితో భద్రత కల్పిస్తున్నారు.


భయంతోనే అతిజాగ్రత్త...

చంద్రబాబుపై రాజధాని గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలతో చెప్పులు, రాళ్లు వేయించిన సంగతి తెలిసిందే. అదేమని అడిగితే.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని డీజీపీ సవాంగ్‌ సెలవిచ్చారు. కానీ జగన్‌ విషయంలో మాత్రం ఆయన, పోలీసు ఉన్నతాధికారులు వణుకుతున్నారని ప్రచారం జరుగుతోంది. సెల్ఫీ కోసమంటూ కోడికత్తితో దాడిచేసింది ఆయన అభిమానే గనుక.. ఎవరైనా సీఎం వద్దకు వచ్చేందుకు ప్రయత్నిస్తే.. పొరపాటున కూడా రానివ్వొద్దని పోలీసులకు గట్టి ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. పొరపాటున ఎవరైనా ఇంకు జల్లినా, ఒక మాట గట్టిగా నిలదీసినా.. మన పోస్టులు ఉండవన్న భయం పోలీసు ఉన్నతాధికారుల్లో ఉంది. ఇటీవల చంద్రబాబు సతీమణిపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు, మంత్రికి పోలీసు శాఖ రక్షణ పెంచింది. ఆ వ్యాఖ్యలు చేసిన వారిని అనంతపురం, అమరావతి, విశాఖపట్నం లాంటి చోట్ల మహిళలు గట్టిగా తప్పుబట్టారు. అనంతపురంలో వైసీపీ నేతలను విమర్శించిన మహిళల ఇళ్లపై పోలీసులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సీఎం సాధారణ ప్రజలను కలిస్తే.. పొరపాటున ఎవరైనా మహిళ గట్టిగా మాట్లాడితే తమ నెత్తిపైకి వస్తుందని.. లేనిపోని గొడవ ఎందుకని పోలీసులు ఆయనకు భారీ భద్రత కల్పించి అతిజాగ్రత్త పడుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ భయంతోనే ఇటీవల వరద ప్రాంతాల్లో పర్యటించిన జగన్‌ వద్దకు బాధితులను రానివ్వలేదు. కొందరు ఎంపిక చేసిన వైసీపీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి మరీ ఆయన ముందుకు తీసుకొచ్చారు. అసలైన బాధితులు బయటకు వస్తే ఏ రకంగా నిలదీస్తారోనన్న భయంతో వారు బయటకు రాకుండా ఇళ్ల తలుపులు మూసివేశారు. ప్రతి ఇంటి ముందూ ఓ మహిళా కానిస్టేబుల్‌ను కాపలాగా పెట్టడం పోలీసుల అభద్రతను సూచిస్తోందని అంటున్నారు.

Advertisement
Advertisement