పలుకుబడులకు పట్టం కట్టిన కాళన్న

ABN , First Publish Date - 2021-09-09T06:20:04+05:30 IST

ప్రపంచభాషగా ఆంగ్లం రాజ్యమేలుతున్న ఈ సాంకేతిక యుగంలో తెలుగుభాష మాధ్యమానికీ దాని ఉనికికీ సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. తెలుగు విద్యార్థులకు అందునా తెలుగు నేలమీద ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తున్నారు....

పలుకుబడులకు పట్టం కట్టిన కాళన్న

నేడు కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం


ప్రపంచభాషగా ఆంగ్లం రాజ్యమేలుతున్న ఈ సాంకేతిక యుగంలో తెలుగుభాష మాధ్యమానికీ దాని ఉనికికీ సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. తెలుగు విద్యార్థులకు అందునా తెలుగు నేలమీద ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల దగ్గర నుంచి తెలుగుభాషా ప్రేమికుల వరకూ భాషామాధ్యమంగా తెలుగును కాపాడుకోవాలనే తపన కనిపిస్తుండడం పత్రికల్లో ప్రతిరోజూ చూస్తున్నాం. మరోవైపు ఆంగ్లమాధ్యమాన్ని స్వాగతిస్తూ కొన్నివర్గాలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కోవాల్సిన సంక్లిష్ట సందర్భంలో తెలుగు భాషోద్యమం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగును ఈ రకమైన సందిగ్ధస్థితికి నెట్టేసిన ప్రభుత్వాలే తెలుగు వైతాళికుల జయంతులను ‘భాషాదినోత్సవా’ల పేరుతో నిర్వహిస్తుండటం మరో వైరుధ్యం. ఆనాడు మాధ్యమభాషగా ఉన్న గ్రాంథికం స్థానంలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టడానికి తన జీవిత పర్యంతం శ్రమించినవారు గిడుగు రామమూర్తి పంతులు. ఈయన ‘బడిపలుకుల’ భాష కోసం తద్వారా విద్యావ్యాప్తి కోసం ఎంతో కృషి చేశారు. ఉమ్మడిపాలనలో ప్రాంతేతరులు తెలంగాణ ప్రాంత తెలుగుపై చూపిన వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించిన వ్యక్తి కాళోజి నారాయణరావు. ఈయన ‘పలుకుబడుల’ భాషకు సామాజిక గౌరవం దక్కాలని కోరుకున్నారు. ఈ ఇద్దరూ సాధ్యమైనంతవరకు వాళ్ళ వాళ్ళస్థాయిల్లో తెలుగు భాషను ప్రజాస్వామీకరించేందుకు కృషి చేసినవారే. వారిద్దరూ ప్రతిపాదించిన ‘బడిపలుకుల’ భాష, ‘పలుకుబడుల’ భాష ఉనికికి ప్రమాదం ముంచుకొస్తున్న తరుణంలో తెలుగు భాషాపరిరక్షణకు ‘ఆచరణాత్మక’మైన ప్రణాళికల్ని రచించుకోవాల్సి ఉంది.


విద్యావ్యవస్థలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టే కాలంలో గ్రాంథికవాదుల నుంచి గిడుగుకు చాలా వ్యతిరేకత వచ్చింది. ఆనాటి గ్రాంథికవాద పండితులు వ్యావహారికోద్యమాన్ని మరీ ముఖ్యంగా గిడుగువారిని నానాదూర్భాషలాడేవారని ఆచార్య తూమాటి దొణప్ప రాసారు. గిడుగు కాలంనాటికి కావ్యభాషగా గ్రాంథికం ఉండేది. అంతేకాక అది విద్యార్థుల అధ్యయన, అధ్యాపనల్లోనూ పాలనాభాషగానూ వ్యవహారంలో ఉండేది. ఇందుకు భిన్నమైన వ్యావహారిక భాష, వాడుకభాష ప్రజల వాడుకలో ఉండేది. వేదం వెంకటరాయ శాస్త్రి, వీరేశలింగం పంతులు, కొమర్రాజు లక్ష్మణరావు వంటి మహామహా పండితవర్యులకే కొరకరానికొయ్యగా గ్రాంథిక భాష ఉండేదని ఆనాటి వ్యావహారికవాదుల అభిప్రాయం. వ్యావహారిక భాషావాదాన్ని కించపరచడం, వ్యక్తిగత దూషణలకు దిగడం గ్రాంథికవాదులకు పరిపాటిగా మారింది. అప్పుడప్పుడే విద్యావ్యవస్థలోకి అడుగెడుతున్న విస్తృత ప్రజారాసుల ఆలోచనలు వ్యావహారిక భాషావాదానికే మొగ్గుచూపడం వల్ల కొంత ఆలస్యమైనా గ్రాంథికవాదంపై గిడుగు పైచేయి సాధించగలిగాడు. విద్యావ్యవస్థలో గిడుగు లక్ష్యించిన భాషామాధ్యమమూ అప్పటి ప్రజల కోరికా ఒకటే కావడం వల్ల గిడుగు వాదానికి క్షేత్రస్థాయిలో సులువుగా మద్దతు దొరికింది. కానీ, మారిన వాస్తవ పరిస్థితులూ, సమాజం తెలుగు మాధ్యమానికి అనుకూలంగా ఉన్నాయా? ఆంగ్లమాధ్యమానికి విద్యార్థులు/ప్రజలు 73శాతం మొగ్గుచూపుతున్నారని తెలిపే ‘యు-డైస్- 2019-–20’ అధ్యయనాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. ఈ అధ్యయనాన్ని గమనంలో ఉంచుకుని తెలుగును పరిమితుల్లోనైనా బలంగా నేర్పించటానికి గల విద్యావకాశాలపై దృష్టి పెట్టాలి. 


గిడుగుతో పోల్చినప్పుడు భాష విషయంలో కాళోజీ దృక్పథమూ ఆయన కృషీ భిన్నమైనవి. ‘ఎవని వాడుక భాషల వాడు రాయాలె. ఇట్ల రాస్తె అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. అసలు రాసేటోడు తెలుగోడయి చదివేటోడు కూడ తెలుగోడయితే సహృదయత ఉంటే తెలుగు అర్ధమయితది. నాకు అర్థం కాలేదంటే నువ్వు తెలుగోనివి కాదన్నమాట. లేకపోతే సహృదయత లేదన్న మాట’ అని నిర్మొహమాటంగా మాట్లాడిన భాషా ప్రజాస్వామికవేత్త కాళోజీ. కాళోజీ ప్రాథమికంగా హక్కుల కార్యకర్త. ప్రజాస్వామికవాది. తెలంగాణ తెలుగు అస్తిత్వానికీ ఆత్మగౌరవానికీ భంగం వాటిల్లినప్పుడు ఆ భాషా ప్రాధాన్యతనూ, గొప్పదనాన్నీ తన ప్రసంగాల ద్వారా, రచనా వ్యాసంగం ద్వారా ఎంతో ప్రచారంలోకి తీసుకొచ్చాడు. విస్తృతార్థంలో చెప్పాలంటే ఆయన భాషాదృక్పథం ‘వ్యావహారిక’ భాషోద్యమ కొనసాగింపు. సమాజంలో కొంతమందికే పరిమితమైన విద్యను వ్యాప్తిలోకి తీసుకురావడానికి ఆ కాలంనాటి వ్యావహారిక భాష (చదువుకున్నవారు మాట్లాడే భాష)ను గిడుగు వాడితే, తెలంగాణ ప్రాంత తెలుగుకు సామాజికంగా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని బలంగా ప్రకటించిన వ్యక్తి కాళోజి. ఇద్దరి లక్ష్యం వ్యావహారిక భాషా వినియోగమే. కాళోజీ తెలంగాణ కేంద్రంగా పనిచేసినా భాష విషయంలో ఆయన చేసిన ఆలోచనలు ఒక దృక్పథంగా ఇతర తెలుగు ప్రాంతాలకూ వర్తిస్తాయి. ఈ దృక్పథాన్ని కనీసంగానైనా గౌరవించి ఆనాటి విద్య, పత్రిక, ప్రసార మాధ్యమాల్లో అన్ని ప్రాంతాల తెలుగుకూ సమప్రాధాన్యం దక్కి ఉంటే తెలుగు భాషాభివృద్ధి ఇప్పటికంటే మెరుగ్గా ఉండేదేమో. దాని రక్షణ కోసం జరుగుతున్న ఉద్యమాలు మరింత బలంగా జమిలిగా సాగేవేమో. గిడుగువారి ‘బడిపలుకుల’ భాషోద్యమం ప్రజాస్వామికమైంది. కాళోజీ ‘పలుకుబడుల’ భాషోద్యమం అత్యంత ప్రజాస్వామికమైంది. 


కాళోజీ ఆనాటి తెలుగు పత్రికల భాషా‘ప్రామాణిక’ దృక్పథాన్ని తీవ్రంగా తప్పుపట్టేవారు. ‘అన్ని రచనలను మేం, భాష ప్రామాణికంగా ఉండాల్నని తిరిగి సవరించి రాయాల్సి వస్తున్నది’ అని విపుల, చతురలకు పనిచేసిన చలసాని ప్రసాదరావు గారు అన్నారని కాళోజీ ప్రస్తావించారు. ఆనాటి పత్రికాభాషగా ‘ప్రామాణికేతర’ తెలుగుకు చోటివ్వకపోవడాన్ని ఎత్తిచూపారు. ఈ అభిప్రాయాలు ‘తెలంగాణ’ సందర్భంలోనే అన్నా తెలంగాణేతర తెలుగు ప్రాంతాల భాషకూ ఆనాటి ప్రధాన పత్రికల్లో చోటులేదని ఏ పత్రికను తిరిగేసినా మనకు అర్థమవుతుంది. ‘తన జీవిత చరిత్రో, ఆత్మకథో రాస్తూ-ఆనాడు తెలంగాణ రచయితలు చేసిన రచనలన్నింటినీ తాను తెలుగుచేసి రాయవలసి వచ్చేది భాష బాగలేక’ అని మీజాన్ పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేసిన రాంభట్ల కృష్ణమూర్తి అన్నట్టు కాళోజీ చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యల మీద తన పరిధిలో సామాజిక దృక్పథంలో స్పందించారు కాళోజీ. ఆనాటి వ్యావహారిక భాషను గ్రాంథికవాదులు గ్రామ్య భాషగా ముద్రవేసి విద్యామాధ్యమానికి దూరంచేయడానికి ప్రయత్నం చేసినప్పుడు గిడుగు ఉద్యమించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘ప్రామాణికేతర’ తెలుగు భాషపై, ముఖ్యంగా తెలంగాణ తెలుగుపై చూపిన వివక్షను కాళోజీ ఖండించారు. ‘నేను గట్లనే మాట్లడ్త, గిట్లనే రాస్త’ అని జిద్దుకు రాసిన మనిషి కాళోజీ. ‘నేనెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు. ఒకటి- బడిపలుకుల భాష, రెండోది-పలుకుబడుల భాష. పలుకుబడుల భాష గావాలె.’ అని ఘంటాపథంగా చెప్పడంలో భాషను ‘బడిపలుకుల’ స్థాయినుంచి ‘పలుకుబడుల’ స్థాయివరకు ప్రజాస్వామీకరించాలని కాళోజి ఉద్దేశం.


గిడుగు, కాళోజీల స్ఫూర్తితో ఈనాటి ఆంగ్లమాధ్యమాల్లో తెలుగు పాఠాలను పునఃనిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. నేడు ఒక సబ్జెక్టుకు మాత్రమే పరిమితమైన తెలుగును బోధించాల్సిన పద్ధతులను, ఉపకరణాలను సిద్ధంచేసుకోవాలి. తెలుగు బతకాలంటే అది ఆర్థిక స్వావలంభన దిశగా ఎదగాలి. ప్రపంచభాషగా ఆంగ్లం వర్ధిల్లుతోందనే భౌతిక వాస్తవాన్ని తృణీకరించకుండా దాన్ని ఈ కాలపు ‘ఆర్థికభాష’గా గుర్తించాల్సిన అనివార్యత నేడు నెలకొంది. గిడుగూ కాళోజీ ఎవరూ ఎవరికి పోలిక కాదు. వారిరువురూ భాష పట్ల చేసిన ప్రజాస్వామిక ఆలోనచనల జాడల్లో బడుల్లో ‘పలుకుబడుల’ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలి. మన పిల్లలు ఆంగ్లాన్ని గెల్వాలి. తెలుగునూ గెలవనివ్వాలి.

డా. చంద్రయ్య ఎస్

అసోసియేట్ ఫెలో, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం


Updated Date - 2021-09-09T06:20:04+05:30 IST