సర్వమంగళ – సంక్రాంతి కళ్యాణి

ABN , First Publish Date - 2022-01-15T06:30:43+05:30 IST

బంగరు తెలుగుతల్లి పచ్చని గుమ్మం ముంగిట తెలుగు వెలుగుల రంగవల్లులు తళతళలాడ;....

సర్వమంగళ – సంక్రాంతి కళ్యాణి

బంగరు తెలుగుతల్లి పచ్చని గుమ్మం ముంగిట

తెలుగు వెలుగుల రంగవల్లులు తళతళలాడ;

సమత–మమతల గొబ్బెమ్మలు ముద్దులొలుక

స్వర్ణరథంలో వస్తోంది ‘విశ్వకళ్యాణ సంక్రాంతిలక్ష్మి’!


బుడబుక్కలవాని డమరుక ధ్వనులు

హరిదాసుల భక్తి కీర్తన సుధల భువిరంజిల్ల;

‘సర్వేజనాః సుఖినోభవంతు!’ అని దీవిస్తూ

పసిడి పూల బాటలో – వస్తోంది – ‘రమ్యసౌభాగ్యలక్ష్మి’!


‘హరిః – ఓం – రంగహరి!’ అంటూ నాట్యమాడుతూ,

భక్తిగీతాలు పాడే – ‘హరిదాసు అక్షయపాత్ర’ను

‘అత్తా–కోడళ్ళు’ భక్తి దోసిళ్ళతో ధాన్యాలతో నింప–

‘శుభమస్తు’ అని దీవించుమో – ‘అష్టైశ్యర్వ మహాలక్ష్మి!’


‘శ్రీరస్తు – శుభమస్తు – జయోస్తు!’ అనే మూడున్నర –

కోట్ల – దేవతల దివ్యాశీస్సుల వెన్నెలలు –

నీ చల్లని చూపులతో ప్రసరిల్ల – భారతావనిలో –

స్వర్ణపథంలో విచ్చేయుచూ – ‘సంక్రాంతి మహాగౌరీ!’


అన్నదాతలైన రైతన్నలకు – భాగ్యాల పాలవెల్లివై,

సుకవి, పండిత – కళామూర్తుల కీర్తి కల్పవల్లివై,

తెలుగు నేల పసిడి వెలుగులీన – అడుగుమోపగ –

విచ్చేయుమమ్మా ‘సర్వమంగళ – సంక్రాంతి కళ్యాణి!’



– ‘కళ్యాణశ్రీ’ జంధ్యాల వేంకటరామశాస్ర్తి

Updated Date - 2022-01-15T06:30:43+05:30 IST