అమెరికాలో జాత్యహంకారం ఉంది.. దీనిపై మౌనం వీడాలి: కమలా హ్యారిస్

ABN , First Publish Date - 2021-03-20T17:57:39+05:30 IST

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అగ్రరాజ్యంలో రోజురోజుకీ పెచ్చుమీరుతున్న జాత్యహంకారంపై మౌనం వీడాలని అన్నారు.

అమెరికాలో జాత్యహంకారం ఉంది.. దీనిపై మౌనం వీడాలి: కమలా హ్యారిస్

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అగ్రరాజ్యంలో రోజురోజుకీ పెచ్చుమీరుతున్న జాత్యహంకారంపై మౌనం వీడాలని అన్నారు. జాతివిద్వేషం ఎంతమాత్రం మంచిది కాదని, దీనిపై గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మంగళవారం అట్లాంటాలో ఆసియన్ అమెరికన్ మసాజ్ పార్లర్లే లక్ష్యంగా దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో ఎనిమిది మంది మృతిచెందగా.. వీరిలో ఆరుగురు ఆసియా మహిళలు ఉన్నారు. ఈ జాత్యహంకార దాడులను కమల తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి ఉపాధ్యక్షురాలు శుక్రవారం ఆసియా కమ్యూనిటీతో అట్లాంటాలో భేటీ అయ్యారు. 


ఈ సందర్భంగా కమలా మాట్లాడుతూ.." అమెరికాలో జాత్యహంకారం ఉన్న మాట వాస్తవం. ఇది ఎప్పుడు ఉంటుంది. ఇకపై నేను, అధ్యక్షుడు దీనిపై మౌనం వహించబోయేది లేదు. హింస, జాతివిద్వేషం, వివక్షత ఎక్కడైనా, ఎప్పుడు జరిగినా మేము ఎల్లప్పుడూ మాట్లాడతాము." అని అన్నారు. ఇక ఇదే సమావేశంలో ఉపాధ్యక్షురాలి కంటే ముందు అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ జాత్యహంకారం ఏమాత్రం సహించేది కాదని, దీనిపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. హింస, వివక్షత ఘటనలు దేశంలో తరచూ చోటుచేసుకుంటున్నప్పటికీ మనం మౌనం వహించడం సరియైన పద్దతి కాదన్నారు. దీనిలో మార్పు రావాలని కోరారు. జాత్యహంకార ఘటనలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, అప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తుందని అధ్యక్షుడు పేర్కొన్నారు.  


Updated Date - 2021-03-20T17:57:39+05:30 IST