Abn logo
Oct 24 2020 @ 10:56AM

కర్నూలు వైసీపీలో కుమ్ములాట.. జగన్ జాప్యం చేశారో..!

Kaakateeya

కర్నూలు జిల్లాలో కుడా ఛైర్మెన్ పీఠం కోసం వైసీపీలో కుమ్ములాటలు మొదలయ్యాయా? చైర్మన్‌గిరి తమకే దక్కాలంటూ నేతలు ఎవరికి వారుగా చేస్తున్న ప్రయత్నాలు కోల్డ్ వార్‌కు దారితీస్తున్నాయా? ఛైర్మెన్ కుర్చీ కోసం జరుగుతున్న గొడవలు బీసీ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య చీలిక తెచ్చిందా...? వైసీపీ ముఖ్యనేతల ఆశీస్సులు ఆశావహులకు ఏ మేరకు ఉన్నాయి...? కుడా చైర్మన్‌ రేసులో ముందున్న నాయకుడు ఎవరు? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే.


కుడా పరధి పెరగడంతో...

కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్ పీఠం కోసం అధికార వైసీపీలో రచ్చ మొదలైంది. ఛైర్మెన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వైసీపీ నేతలు వర్గాలుగా విడిపోయారు. ముఖ్యంగా కర్నూలు నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డిల మధ్య పంచాయతీ ప్రారంభమైంది. కుడా చైర్మన్‌ రేసులో వీరితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన సుబ్బయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకానొక దశలో అధిష్టానం సుబ్బయ్యకే ‘కుడా ఛైర్మెన్’ పదవి కట్టబెట్టబోతుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇటీవల కుడా పరిధి పెరగడంతో ఆశావహుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. కల్లూరు మండలం కృష్ణానగర్ మాజీ కార్పోరేటర్ తోట కృష్ణారెడ్డి, నంద్యాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మెన్ పురుషోత్తమ్ రెడ్డి, నందికొట్కూరు నియోజక వర్గం వైసీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి పేర్లు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. అయితే బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి మాత్రం కుడా ఛైర్మెన్ పదవిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు 20 మంది చోట మోటా నాయకులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు.

భగ్గుమన్న వర్గపోరు..

అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు తెర్నెకల్ సురేందర్ రెడ్డి, రాజా విష్ణువర్ధన్ రెడ్డిలకు మద్దతుగా నిలిస్తే... ఇతర వర్గాలకు చెందిన కొంతమంది నేతలు బీసీ వర్గానికి చెందిన సుబ్బయ్యకు సపోర్ట్‌గా నిలిచారట. దీంతో రెండు సామాజిక వర్గాల మధ్య వర్గపోరు భగ్గుమంటోంది. కొన్నాళ్ల  క్రితం వరకు వైసీపీ ముఖ్యనేతల్లో కొందరు సుబ్బయ్య పేరును అధినాయకత్వం దాకా తీసుకెళ్లారట. కర్నూలు కార్పొరేషన్ మేయర్ పదవి బీసీలకు... కుడా చైర్మెన్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించేందుకు హైకమాండ్‌ ఆలోచిస్తోందని ప్రచారం జరిగింది. ఆ లెక్కల ప్రకారం కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్ పదవి రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వాలని..ఆ వర్గానికి చెందిన నేతలు అధిష్టాన పెద్దల ఎదుట డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.


అధినేత మనసులో ఏముందో...

మరోవైపు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న నాయకుడికే కుడా ఛైర్మన్‌ పదవి ఇవ్వాలని కొందరు సీనియర్లు ప్రతిపాదిస్తున్నారు. అయితే చైర్మెన్ పీఠంపై కన్నేసిన ఆశావహులు అగ్రనేతలతో లాబీయింగ్‌ చేయిస్తున్నారట. కుడా చైర్మెన్ రేసులో ఎంతమంది ఉన్నా.. సీఎం జగన్ సీల్డ్ కవర్లో పంపిన నాయకుడి పేరే ఫైనల్‌ అవుతుందంటున్నారు. ఈ విషయంపై సీఎం జగన్‌ మరింత జాప్యం చేయకుండా.. వెంటనే చైర్మన్‌ పేరును ప్రకటించాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ వర్గపోరు మరింత పెరిగి పార్టీకి మరింత నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. పోటీలో ఎంతమంది ఉన్నా చివరకు ఎవరిని కుడా చైర్మన్‌గిరి వరిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారా? లేక బీసీ సామాజిక వర్గానికి ఇస్తారా? అన్న చర్చలు సాగుతున్నాయి. మొత్తంగా అధినేత మనసులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement
Advertisement