ప్రగతి భవన్‌కు కేసీఆర్

ABN , First Publish Date - 2020-07-11T21:46:20+05:30 IST

సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రగతిభవన్ చేరుకున్నారు. రెండు వారాలుగా ఆయన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉన్నారు. కేసీఆర్ కనబడలేదనే వార్తలు కొన్ని

ప్రగతి భవన్‌కు కేసీఆర్

హైద్రాబాద్: సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రగతి భవన్ చేరుకున్నారు. రెండు వారాలుగా ఆయన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉన్నారు. కేసీఆర్ కనబడలేదనే వార్తలు కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ‘కేసీఆర్ ఎక్కడ’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నించారు. అంతేకాదు ఏకంగా ఇద్దరు యువకులు ప్రగతిభవన్‌లోకి దూసుకుపోయి నిరసన తెలిపారు.  ‘‘ సీఎం కేసీఆర్ ఎక్కడ?.. ఆయన మా సీఎం. ఆయన ఎక్కడ ఉన్నడో తెలుసుకోవడం మా హక్కు’’ అంటూ ఇంగ్లీష్‌లో రాసిన ప్లేకార్డును ప్రదర్శించి వెళ్లిపోయారు. ఈ ఘటన మెరుపు వేగంతో జరగడం వల్ల పోలీసులు ఆ యువకులను పట్టుకోలేకపోయారు. సీసీఫుటేజ్‌ ఆధారంగా యువకులను అరెస్ట్ చేశారు. చివరకు ఆ ఇద్దరు యువకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా గుర్తించారు. నిరసనకారులపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 


మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎక్కడ? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నిస్తూ తీన్మార్‌ మల్లన్న (నవీన్) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బుధవారం దాఖలు చేసిన ఈ వ్యాజ్యం శుక్రవారం కూడా బెంచ్‌పైకి విచారణకు రాలేదని తీన్మార్‌ మల్లన్న తరఫున న్యాయవాది ఉమేశ్‌ చంద్ర ప్రస్తావించారు.  ‘‘ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఏదైనా తెలియజేయాలనుకుంటే, సంబంధిత యంత్రాంగం సరైన సమయానికి తెలియజేస్తుంది’’అని సీజే రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు. రాజకీయపరమైన గిమ్మిక్కులు ఉన్నందువల్లే లంచ్‌ మోషన్‌ పిటిషన్‌కు అనుమతించలేదని సీజే పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-11T21:46:20+05:30 IST