తెలంగాణ, ఏపీ నుంచి రావొద్దు
ABN , First Publish Date - 2021-05-07T10:06:38+05:30 IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ కేజ్రీవాల్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ విపత్తు నిర్వహణ చట్టం కింద ఉత్తర్వులు జారీ చేసింది. విస్తృతంగా వ్యాపించే లక్షణం ఉన్న కొత్త
వస్తే 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి
టీకా వేయించుకుంటే 7 రోజులు ఉండాలి
తెలుగు ప్రయాణికులపై ఢిల్లీ సర్కారు ఆంక్షలు
ఎన్440కే వేరియంట్ భయంతో నిర్ణయం
అది అంత ప్రమాదకరమైనది కాదు
నిరుడు జూన్‌లోనే గుర్తించారు: ఏపీ సర్కారు
న్యూఢిల్లీ, మే 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ కేజ్రీవాల్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ విపత్తు నిర్వహణ చట్టం కింద ఉత్తర్వులు జారీ చేసింది. విస్తృతంగా వ్యాపించే లక్షణం ఉన్న కొత్త కరోనా వేరియంట్‌ను ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో కనుగొన్నారని.. ఆ వేరియంట్ ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా తక్కువగా, వ్యాప్తి వేగం, ఇన్ఫెక్షన్ వేగం ఎక్కువగా ఉన్నాయని, అందుకే ముందు జాగ్రత్తచర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అందులో పేర్కొంది. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నవారు లేదా ఢిల్లీ చేరుకునే సమయానికి ముందు(72 గంటల్లోపు) ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుని, నెగెటివ్ సర్టిఫికెట్‌తో వచ్చేవారు ఏడు రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఇక.. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ (జాతీయ రాజధాని ప్రాంతం-ఎన్సీటీ) మీదుగా వేరే రాష్ట్రాలకు రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చు. కానీ, మధ్యలో ఢిల్లీలో దిగకూడదు. రాజ్యాంగ పదవుల్లో ఉండేవారు, ప్రభుత్వ విధులు నిర్వర్తించేవారు, వారి సిబ్బందికి ఎలాంటి లక్షణాలూ లేకుంటే.. ఈ నిబంధనలు వర్తించవు.
కాగా, ఏపీలో, ముఖ్యంగా విశాఖపట్నంలో ఎన్440కే అనే కొత్త స్ట్రెయిన్ వ్యాపిస్తోందన్న కథనాలను సీసీఎంబీ కొట్టిపారేసిన కొద్దిసేపటికే ఢిల్లీ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు.. ఎన్440కే స్ట్రెయిన్ విషయంలో ఆందోళన అవసరం లేదని ఏపీ సర్కారు స్పష్టం చేసింది. దాని ఉనికిని గత ఏడాది జూన్-జూలైలోనే గుర్తించారని, అది కొత్తగా పుట్టుకొచ్చింది కాదని ఏపీలోని కొవిడ్ నిరోధక కమాండ్ కంట్రోల్ చైర్మన్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. అది ప్రమాదకరమైన వేరియంట్ కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వైర్‌సకు సంబంధించిన పాజిటివ్ కేసుల సంఖ్య కనిష్ఠ స్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. గతనెల 25న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) విడుదల చేసిన వారంతపు నివేదికలోనూ ఈ వైరస్ రకం ప్రస్తావన లేదని జవహర్‌రెడ్డి గుర్తుచేశారు.