బార్టీ x ప్లిస్కోవా

ABN , First Publish Date - 2021-07-09T08:33:55+05:30 IST

వింబుల్డన్‌కు కొత్త చాంపియన్‌ రానుంది. గ్రాస్‌కోర్ట్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరిన టాప్‌ సీడ్‌ బార్టీ, చెక్‌ ప్లేయర్‌ కరోలినా ప్లిస్కో వా టైటిల్‌ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు.

బార్టీ x ప్లిస్కోవా

టైటిల్‌ ఫైట్‌

సెమీస్‌లో ఓడిన కెర్బర్‌, సబలెంక

 లండన్‌: వింబుల్డన్‌కు కొత్త చాంపియన్‌ రానుంది. గ్రాస్‌కోర్ట్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరిన టాప్‌ సీడ్‌ బార్టీ, చెక్‌ ప్లేయర్‌ కరోలినా ప్లిస్కో వా టైటిల్‌ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు. సెమీ్‌సలో 2018 చాంపియన్‌ ఏంజెలిక్‌ కెర్బన్‌ను బార్టీ ఓడించగా.. 2వ సీడ్‌ అరియానా సబలెంకపై ప్లిస్కోవా పోరాడి నెగ్గింది. 


ఆష్లే ఆధిపత్యం..:

ఏస్‌లతో అదరగొట్టిన బార్టీ గుర్తుండిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ్‌సలో ఆస్ట్రేలియా ప్లేయర్‌ ఆష్లే బార్టీ 6-3, 7-6(3)తో 25వ సీడ్‌ కెర్బర్‌ (జర్మనీ)ను వరుస సెట్లలో ఓడించింది. తొలి సెట్‌ రెండో గేమ్‌లోనే కెర్బర్‌ సర్వీ్‌సను బ్రేక్‌ చేసి బార్టీ 6-3తో సునాయాసంగా నెగ్గింది. అయితే, రెండో గేమ్‌లోనే బార్టీ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 3-0తో పైచేయిగా నిలిచింది. 3-5తో వెనుకంజలో ఉన్న సమయంలో జర్మన్‌ ప్లేయర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన బార్టీ 5-5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ చెరో గేమ్‌ నెగ్గడంతో సెట్‌ ఫలితం టైబ్రేక్‌కు దారి తీసింది. ఇందులో కెర్బర్‌ పూర్తిగా చేతులెత్తేయడంతో బార్టీ 6-3తో మ్యాచ్‌ పాయింట్‌పై నిలిచింది. కెర్బర్‌ బ్యాక్‌ హ్యాండ్‌ తప్పిదంతో 7-3తో టైబ్రేక్‌లో నెగ్గి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో బార్టీ 8 ఏస్‌లు సంధించగా.. కెర్బర్‌ ఒక్కటి కూడా కొట్టలేక పోయింది. ఆష్లే 38 విన్నర్లు కొట్టగా.. కెర్బర్‌ 16 మాత్రమే సంధించింది. 23 అనవసర తప్పిదాలతో మాజీ చాంపియన్‌ మ్యాచ్‌ను చేజార్చుకుంది. 2011లో జూనియర్‌ టైటిల్‌ సాధించిన బార్టీ.. 1980లో ఎవన్నీ గూలగాంగ్‌ తర్వాత గ్రాస్‌కోర్టు ఫైనల్‌కు చేరిన తొలి ఆస్ట్రేలియన్‌గా నిలిచింది. 


పోరాడిన ప్లిస్కోవా:

తొలి సెట్‌ కోల్పోయినా అద్భుతంగా పుంజుకున్న 8వ సీడ్‌ ప్లిస్కోవా 5-7, 6-4, 6-4తో సబలెంక (బెలార్‌స)ను ఓడించింది. సబలెంక ఏకంగా 18 ఏస్‌లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. ప్లిస్కోవా 13 ఏస్‌లు మాత్రమే సంధించింది. తొలి సెట్‌లో ఇద్దరూ దీటుగా తలపడినా.. కీలక సమయంలో ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన సబలెంక 7-5తో గెలిచింది. కానీ, రెండో సెట్‌లో పుంజుకున్న ప్లిస్కోవా ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేసి 3-2తో ముందంజ వేసింది. అదే జోరులో 6-4తో సెట్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో సెట్‌ తొలి గేమ్‌లోనే సబలెంక సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన కరోలినా 6-4తో నెగ్గి తుదిపోరుకు చేరుకుంది.

Updated Date - 2021-07-09T08:33:55+05:30 IST