తరలింపు వద్దు

ABN , First Publish Date - 2020-08-05T07:59:40+05:30 IST

మూడు రాజధానుల వ్యవహారంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల తరలింపులో రాష్ట్రప్రభుత్వ దూకుడుకు కళ్లెం వేసింది.

తరలింపు వద్దు

  • సర్కారు దూకుడుకు హైకోర్టు కళ్లెం
  • కార్యాలయాల తరలింపుపై ‘యథాతథ స్థితి’
  • త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు
  • పుడమితల్లిపై మమకారాన్ని చంపుకొని మరీ
  • రైతులు భూములిస్తే అన్యాయం చేస్తారా?
  • ప్రజల జీవనోపాధిని నాశనం చేస్తారా?
  • అలాంటి చట్టాలు చేస్తే చెల్లుబాటు కావు
  • కార్యాలయాలు తరలిస్తే అది ‘ఘోస్ట్‌ సిటీ’యే!
  • రాజధాని, హైకోర్టు కేంద్రం పరిధిలోవి
  • పిటిషనర్ల తరఫున శ్యాం దివాన్‌ వాదనలు
  • రాజధాని మార్చే అధికారం ప్రభుత్వానికి ఉంది
  • తరలింపును మాత్రం ఇప్పుడు అడ్డుకోవద్ద్దు
  • రాష్ట్రప్రభుత్వం అభ్యర్థన
  • పది రోజులు ఆగితే ఏమవుతుంది?
  • ప్రశ్నించిన ధర్మాసనం


రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం తొందరపాటు ప్రదర్శిస్తోంది. కార్యాలయాలను తరలించేందుకు హడావుడిగా చర్యలు చేపట్టింది. రాజధాని రైతుల శ్రేయస్సు దృష్ట్యా తరలింపును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి.

పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్యాం దివాన్

రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కార్యాలయాల తరలింపు చేపట్టబోమని హామీ ఇవ్వలేం. ఈ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దు.

 ప్రభుత్వం తరఫు న్యాయవాది రాకేశ్‌ ద్వివేది


పది రోజుల్లో కార్యాలయాలను తరలించేశాక.. ఒకవేళ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వస్తే అప్పుడు కార్యాలయాలను వెనక్కి తీసుకురావాలని మేం ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పటికి స్టేట్‌సకో విధిస్తాం.

 త్రిసభ్య ధర్మాసనం స్థానికం రద్దు?


అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల వ్యవహారంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల తరలింపులో రాష్ట్రప్రభుత్వ దూకుడుకు కళ్లెం వేసింది. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు విషయంలో యథాతథ స్థితి (స్టేట్‌సకో) పాటించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే విధంగా రాజధాని తరలింపునకు సంబంధించిన పిటిషన్లన్నిటినీ ప్రస్తుత పిటిషన్లతో జత చేయాలని రిజిస్ట్రీని నిర్దేశించింది. స్టేటస్‌ కో పాటించాలంటూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.


పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం గత నెల 31వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్లు, ఉత్తర్వులు, చట్టాలు, అంతకు ముందు అన్ని ప్రాంతాల అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, దాని పరిశీలనకు నియమించిన ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన నివేదికలను రాజ్యాంగ విరుద్ధమైనవని పేర్కొంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు బృందం, టి.శ్రీనివాసరావు, డి.సాంబశివరావు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాజభవన్‌, ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం, డీజీపీ కార్యాలయం, ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయాలను తరలించరాదని వారు అభ్యర్థించారు. ఈ నాలుగు పిటిషన్లపై మంగళవారం త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరిగింది. 


ఇవి కేంద్రం పరిధిలోవి..

రైతు పరిరక్షణ సమితి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ హైకోర్టు ముందు వాదనలు వినిపిస్తూ.. రాజధాని, హైకోర్టు అంశాలు కేంద్రం పరిధిలోనివని, రాష్ట్రం పరిధిలోనివి కాదని పేర్కొన్నారు. ‘ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసమని ప్రభుత్వం చెప్పిన మాటలు విని రైతులు 34 వేల ఎకరాలకు పైగా భూములు ఇచ్చారు. పుడమితల్లిపై మమకారాన్ని చంపుకొని మరీ రాజధాని కోసం భూములను అప్పగించారు. అలాంటిది రాజధాని మార్పుపై వారిని సంప్రదించలేదు. రాజధాని తరలిపోతే భూములిచ్చిన రైతులు రోడ్డునపడతారు. తీవ్రంగా నష్టపోతారు. ప్రజల జీవనోపాధిని నాశనం చేసే చట్టాలేవైనా చెల్లుబాటు కావు. రాజధాని వ్యవహారంలో ఈ ఏడాది జనవరి 20 వరకూ రైతుల అభ్యంతరాలు తెలుసుకోవాలని హైకోర్టు ఆదేశిస్తే.. ఉన్నతస్థాయి కమిటీ ఆ ఆదేశాలను బేఖాతరు చేసి అదే నెల 17వ తేదీనే ప్రభుత్వానికి నివేదిక అందించింది. రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం తొందరపాటు ప్రదర్శిస్తోంది.


కార్యాలయాలను తరలించేందుకు హడావుడిగా చర్యలు చేపట్టింది. రాజధాని రైతుల శ్రేయస్సు దృష్ట్యా కార్యాలయాల తరలింపును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి’ అని ఆయన అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేస్తామని, అందుకు పది రోజుల గడువు ఇవ్వాలని కోరారు. రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని.. అయితే కౌంటర్ల దాఖలు అనంతరం పూర్తిస్థాయి వాదనలు వినాలని విజ్ఞప్తి చేశారు. శ్యాం దివాన్‌ స్పందిస్తూ.. కౌంటర్ల దాఖలుకు ఎంత గడువు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని, కానీ ఈలోపు ప్రభుత్వ కార్యాలయాలను తరలించే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. అదే జరిగితే అమరావతి ‘ఘోస్ట్‌ సిటీ’గా మారిపోవడం ఖాయమన్నారు.


అందువల్ల కార్యాలయాల తరలింపుపై స్పష్టమైన హామీ తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. ద్వివేది ఈ వాదనతో విభేదించారు. తరలింపు చేపట్టబోమని హామీ ఇవ్వలేమని, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదని కోర్టును అభ్యర్థించారు. ధర్మాసనం స్పందిస్తూ.. కౌంటర్‌ దాఖలు చేసే వరకూ కార్యాలయాల తరలింపు ఆపితే ఏమవుతుందని ప్రశ్నించింది. పది రోజుల్లో కార్యాలయాలను తరలించేశాక.. ఒకవేళ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వస్తే అప్పుడు కార్యాలయాలను వెనక్కి తీసుకురావాలని తాము ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. అందువల్ల ఇప్పటికి స్టేట్‌సకో విధిస్తామని పేర్కొంది. ద్వివేది స్పందిస్తూ.. అప్పుడు అలాంటి ఉత్తర్వులిచ్చినా పర్వాలేదని.. కానీ ఇప్పుడు కార్యాలయాల తరలింపును నిలిపేస్తూ ఉత్తర్వులు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవచ్చని పిటిషనర్‌ తరఫు న్యాయవాదుల్లో ఒకరైన మురళీధరరావు పేర్కొన్నారు. సీఆర్‌డీఏ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల హక్కులకు భంగం కలుగనివ్వబోమని, అమరావతి అభివృద్ధి పనుల్ని కొనసాగిస్తామని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవద్దని అభ్యర్థించారు. 


మరికొన్ని పిటిషన్ల దాఖలు..

పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్లు రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంటూ రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, ఒంగోలుకు చెందిన ఆడిటర్‌ లంకా దినకర్‌ (బీజేపీ నేత) తదితరులు కూడా మంగళవారం హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

Updated Date - 2020-08-05T07:59:40+05:30 IST