క్వార్టర్స్‌లో కిడాంబి

ABN , First Publish Date - 2020-10-16T10:08:37+05:30 IST

భారత ఏస్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ డెన్మార్క్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. మరో ఆటగాడు లక్ష్య సేన్‌ ఓటమితో టోర్నీ

క్వార్టర్స్‌లో కిడాంబి

 లక్ష్య సేన్‌ అవుట్‌

 డెన్మార్క్‌ ఓపెన్‌

ఒడెన్స్‌: భారత ఏస్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ డెన్మార్క్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. మరో ఆటగాడు లక్ష్య సేన్‌ ఓటమితో టోర్నీ నుంచి  నిష్క్రమించాడు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో ఐదోసీడ్‌ శ్రీకాంత్‌ 21-15, 21-14తో జాసన్‌ ఆంథోని హొ షుయ్‌ (కెనడా)పై వరుస గేముల్లో నెగ్గాడు. క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ చో టిన్‌ చన్‌ (చైనీస్‌తైపీ)తో కిడాంబి తలపడనున్నాడు. మరో మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ 21-15, 7-21, 17-21తో హన్స్‌ క్రిస్టీన్‌ సోల్‌బర్గ్‌ (డెన్మార్క్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన శ్రీకాంత్‌.. కేవలం 33 నిమిషాల్లోనే ప్రత్యర్థిపై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో 4-2తో ఆధిక్యం సాధిం చిన కిడాంబి.. అదే జోరులో 9-4తో ముందంజ వేశాడు. తర్వాత మరింత దూకుడుగా ఆడి 21-15తో మొదటి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో జాసన్‌ గట్టిపోటీ ఇవ్వడంతో.. కిడాంబి 5-8తో వెనుకబడ్డాడు. కానీ, వరుసగా ఆరు పాయింట్లు సాధించిన శ్రీ.. బ్రేక్‌ సమయానికి 11-8తో పైచేయి సాధించాడు. తిరిగి వచ్చాక జాసన్‌ వరుసగా రెండు పాయింట్లు దక్కించుకొని 10-11తో స్కోరు సమం చేసే విధంగా కనిపించాడు. కానీ, ఆట వేగాన్ని ఒక్కసారిగా పెంచిన కిడాంబి..పదునైన స్మాష్‌లతో 15-10తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. వరుస ర్యాలీలతో ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా 21-14తో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘రెండు గేమ్‌ల్లో బ్రేక్‌ వరకు జాసన్‌ గట్టిపోటీ ఇచ్చాడు. ఎలా అటాకింగ్‌ చేయాలి, ఎప్పుడు డిఫెండ్‌ చేసుకోవాలో అతడికి బాగా తెలుసు. గట్టి ప్రత్యర్థితో తలపడి విజేతగా నిలిచినందుకు సంతోషంగా ఉంద’ని శ్రీకాంత్‌ చెప్పాడు. 

Updated Date - 2020-10-16T10:08:37+05:30 IST