ఇక ఖమ్మం బరి..

ABN , First Publish Date - 2020-12-05T05:17:19+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో పార్టీల చూపు ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలపై పడింది. గ్రేటర్‌ ఫలితాలతో టీఆర్‌ఎస్‌, బీజేపీల్లో ఉత్సాహం కన్పిస్తుండగా.. కాంగ్రెస్‌, వామపక్షాలు, టీడీపీల్లో నిరుత్సాహం నెలకొంది.

ఇక ఖమ్మం బరి..

‘గ్రేటర్‌’ ముగియడంతో ఖిల్లా పోరుపై పార్టీల దృష్టి 

అభిృవృద్ధి అజెండాగా సిద్ధమవుతున్న టీఆర్‌ఎస్‌

నిరుద్యోగ శంఖారావ దీక్షలతో కాంగ్రెస్‌

కార్యాచరణలో వామపక్షాలు, టీడీపీ

ఖమ్మం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో పార్టీల చూపు ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలపై పడింది. గ్రేటర్‌ ఫలితాలతో టీఆర్‌ఎస్‌, బీజేపీల్లో ఉత్సాహం కన్పిస్తుండగా.. కాంగ్రెస్‌, వామపక్షాలు, టీడీపీల్లో నిరుత్సాహం నెలకొంది. ఈ క్రమంలో త్వరలో జరిగే ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని పార్టీలు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ఖమ్మం కార్పొరేషన్‌లోని 50డివిజన్లను 60కు పెంచేందుకు డివిజన్ల పునర్విభజన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ జనవరిలో వెలువడుతుందన్న ప్రచారం జరుగుతుండగా.. ఎన్నికలకు ముందుగానే నగరంలో జరుగుతున్న అభివృద్ధిపనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 7న మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డితో ప్రారంభోత్సవాలు చేయించేందుకు రవాణాశాఖ మంత్రి అజయ్‌కమార్‌ ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఖమ్మం ఐటీహబ్‌, ధంసలాపురం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, పోలీస్‌ కమిషనరేట్‌, వైకుంఠధామం, ఎన్నెస్పీ వాకింగ్‌ ట్రాక్‌, కేఎంసీ పార్కు తదితర పనులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. అభివృద్ధి నినాదంతో.. ఖమ్మం ఎన్నికలకు వెళ్లి.. కార్పొరేషన్‌ను సొంతం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. గత ఎన్నికల్లో 50డివజన్లకు గాను 34 టీఆర్‌ఎస్‌ గెలుచుకోగా అ తరువాత కాంగ్రెస్‌నుంచి గెలుపొందిన 10 మందిలో ఏడుగురు, వైసీపీ తరపున గెలిచిన ఇద్దరు టీఆర్‌ఎస్‌లో చేరారు. 

దీక్షలతో నగర ప్రజల వద్దకు కాంగ్రెస్‌...

హైదరాబాద్‌ గ్రేటర్‌ ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్‌ ఖమ్మంలో ఉనికిని చూపేందుకు వ్యూహరచన చేస్తోంది. ఈనెల 7న అన్నిడివిజన్లలో నిరుద్యోగ శంఖారావం పేరుతో నిరసనదీక్షలు చేపట్టబోతున్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చి, అమలు కాని హామీలను ఎజెండాగా తీసుకొని ఎన్నికల్లో నిలబడతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం కార్పొరేషన్‌పై భట్టి ప్రత్యేక దృష్టి పెట్టారు. డబుల్‌ బెబ్‌రూం ఇళ్లు, అర్హులైన వారికి పింఛన్లు, ఎల్‌ఆర్‌ఎస్‌ భారం తదితర సమస్యలను ఎజెండాగా తీసుకొని నగరంలో కాంగ్రెస్‌ ఆందోళనకు సిద్ధమవుతోంది. గతంలో 10 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌కు కార్పొరేషన్‌ ఎన్నికలు సవాల్‌ కాబోతున్నాయి.

పట్టుకోసం బీజేపీ..

దుబ్బాకలో గెలుపు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో పుంజుకున్న బీజేపీ.. ఖమ్మం కార్పొరేషన్‌లో పట్టు సాధించాలన్న ఉత్సాహంతో ఉంది. ఈ దిశగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల పోరు కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గోళ్లపాడుఛానెల్‌ నిర్వాసితుల సమస్యతో పాటు నగరంలోని పలు సమస్యలను అజెండాగా తీసుకొని ఆందోళనలు సాగిస్తున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి, పార్టీ రాష్ట్ర నేతలతో కార్యక్రమాలు రూపకల్పన చేయబోతున్నారు. 

వ్యూహంలో వామపక్షాలు, టీడీపీ..

ఖమ్మం నగరంలో బలమైన పార్టీలుగా ఉండి, రాష్ట్ర విభజన తరువాత వామపక్షాలు, టీడీపీలు తీవ్రంగా బలహీనపడ్డాయి. గత ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ చెరో రెండు స్థానాలు గెలుచుకోగా టీడీపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఈ సారి ఎన్నికల్లో బలమున్న డివిజన్లలో పట్టు చూపించాలని నగర సమస్యలపై కొంత కాలంగా ధర్నాలు. ఆందోళనలు సాగిస్తున్నారు. వామపక్షాలు ఉమ్మడిగా పోటీచేసే పరిస్థితి ఉండగా, టీడీపీ కూడా కాంగ్రెస్‌, వామపక్షాలతో మిత్రపక్షంగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం, మొత్తం మీద గ్రేటర్‌ పోరు ముగియటంతో ప్రధాన రాజకీయ పక్షాల పోరుకు ఖమ్మం గుమ్మం కాబోతోంది. 

Updated Date - 2020-12-05T05:17:19+05:30 IST