అన్నీ లాక్‌.. ఉమ్మడి ఖమ్మంలో రెండోరోజూ ప్రశాంతంగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-14T05:45:53+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పట్టణాలు, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లోనూ ఉదయం ఆరు గంటలనుంచి 10 గంటల వరకు అధికారులు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేస్తున్నారు.

అన్నీ లాక్‌.. ఉమ్మడి ఖమ్మంలో రెండోరోజూ ప్రశాంతంగా లాక్‌డౌన్‌
ఖమ్మంలో నిర్మానుష్యంగా మయూరిసెంటర్‌ రైల్వేఓవర్‌బ్రిడ్జి, కొత్తగూడెం ఎంజీరోడ్‌లో ఉదయం 9గంటల ప్రాంతంలో రద్దీ

రోడ్లన్ని నిర్మానుష్యం.. 

ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలు

ఖమ్మం (ఆంధ్రజ్యోతిప్రతినిధి) /కొత్తగూడెం, మార్చి 13 : కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ రెండోరోజూ ప్రశాంతంగా సాగింది. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో అవగాహన లేక చాలామంది నిబంధనలు ఉల్లంఘించి.. రోడ్లపైకి తిరిగిన పరిస్థితి ఉండగా, ఈ సారి మాత్రం కరోనా ఉధృతిని చూసి భయపడుతున్న జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పట్టణాలు, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లోనూ ఉదయం ఆరు గంటలనుంచి 10 గంటల వరకు అధికారులు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. రైతుబజార్లు, షాపులను 10గంటల తరువాత మూతపడుతున్నాయి. ఇక ఆర్టీసీ బస్సులు ఉదయం 6 గంటలనుంచి 10గంటలలోపు మాత్రమే రోడ్లపైకి వచ్చాయి. ఖమ్మం జిల్లానుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు వెళ్లే సర్వీసులను మాత్రం నిలిపేశారు. రెండురోజులు కలిపుకొని ఖమ్మం రీజియన్‌ ఆర్టీసీకి సుమారురూ.1.80కోట్ల ఆదాయానికి గండిపడింది. ఖమ్మం నగరంలో వ్యాపారాలు నిలిపివేయటంతో రూ.కోట్ల టర్నోవర్‌ నిలిచిపోయింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావడంలేదు. ఆస్పత్రులు, మెడికల్‌ షాపులవద్ద జనం రద్దీ కనిపించింది. ఉదయం సడలింపు సమయంలో నిత్యావసరాలు, కూరగాయల దుకాణాల వద్ద జనం గుంపులుగా చేరగా.. ఇదే అదనుగా కొన్నిప్రాంతాల్లో వ్యాపారులు ధరలుపెంచి అమ్మకాలు సాగించారు. సింగరేణి కార్మికులు తమ గుర్తింపు కార్డులతో విధులకు హాజరయ్యారు. ఏపీ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన అశ్వారావుపేట, మధిర, బోనకల్‌ తదితర మండలాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి ఏపీ నుంచి వచ్చే వాహనాలను అనుమతి ఉంటేనే రానిచ్చారు. ఇప్పటికే భద్రాచలం  రామయ్య దర్శనాలను నిలిపేయగా.. రామాలయం పరిసరప్రాంతాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. కొత్తగూడెంలోని వాణిజ్య ప్రాంతమైన ఎంజీ రోడ్డులో వ్యాపార సముదాయాలు మూసేయడంతో కళతప్పింది. రెండు రోజుల లాక్‌డౌన్‌తో  భద్రాద్రి జిలాలో అన్నిరంగాల్లో సుమారు రూ.200 కోట్ల వరకు లావాదేవీలు పడిపోయాయని అంచనా. 

Updated Date - 2021-05-14T05:45:53+05:30 IST