కీలక ప్రాజెక్టుల డీపీఆర్‌లకు తుదిరూపు!

ABN , First Publish Date - 2021-07-29T09:43:36+05:30 IST

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కీలక సాగునీటి పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు తుది రూపునకు

కీలక ప్రాజెక్టుల  డీపీఆర్‌లకు తుదిరూపు!

త్వరలో బోర్డులకు సమర్పించేందుకు సిద్ధం..

37 ప్రాజెక్టుల వివరాలు కోరిన కేఎంఆర్‌బీ

ఐదారింటి సమాచారం ఇవ్వనున్న ప్రభుత్వం


హైదరాబాద్‌, జూలై 28(ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కీలక సాగునీటి పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు తుది రూపునకు వచ్చాయి. నిర్మాణంలో ఉన్నవాటికి ఇప్పటికే డీపీఆర్‌ సిద్ధం కాగా.. ప్రతిపాదనల్లోని వాటి డీపీఆర్‌ల తయారీ ఓ దశకు వచ్చింది. అనుమతి లేని ప్రాజెక్టులకు 2022 జనవరి 14వ తేదీలోగా అనుమతి తెచ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16న గెజిట్‌ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. గెజిట్‌ ప్రచురితమైన రోజు నుంచే వీటి నిర్మాణం నిలిపివేయాలని పేర్కొంది. నిర్దేశిత గడువులోగా అనుమతులు తెచ్చుకోకపోతే ప్రాజెక్టులు రద్దయినట్లుగానే భావించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో అనుమతి లేనివాటి డీపీఆర్‌లను వెంటనే సమర్పించాలని ఈ నెల 15న గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ), ఈ నెల 26న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశాయి.


అనుమతులు లేనివి 24

కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుండగా, మరికొన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయి. దేనికి అనుమతి ఉందో, దేనికి లేదో గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. కృష్ణా నదిపై 13, గోదావరిపై 11 ప్రాజెక్టులకు అనుమతులు లేవని స్పష్టం చేసింది. సీడబ్ల్యూసీ, ఆపెక్స్‌ కౌన్సిల్‌, కేఆర్‌ఎంబీ అనుమతి లేకుండానే కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం 24 కొత్త ప్రాజెక్టులను కడుతోందని, మరో 17 చిన్న నీటి పారుదల ప్రాజెక్టులను కూడా నిర్మిస్తున్నందని ఏపీ ప్రభుత్వం ఈనెల 6న కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది. దీంతో 37 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌కు కేఆర్‌ఎంబీ సభ్యుడు హరికేష్‌ మీనా లేఖ రాశారు. కానీ, ఇందులో ఐదారు మాత్రమే కీలకమని, వాటి డీపీఆర్‌లే సమర్పించాలని తెలంగాణ అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బోర్డుల లేఖలను అనుసరించి డీపీఆర్‌లు సమర్పిస్తామని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఇటీవల తెలిపారు.


కాగా, అనుమతులు లేని ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వడానికి ఆర్థిక సంస్థలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి. నిధులు, రుణం లేకుండా నిర్మాణం చేపట్టలేమని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం కృష్ణా, గోదావరి బోర్డుల్లో డీపీఆర్‌లను సమర్పించాలని నిర్ణయించింది. దీనికితోడు తప్పనిసరి అయినందున.. డీపీఆర్‌లను బోర్డుల్లో సమర్పించేస్తే పనై పోతుందని ఆలోచిస్తోంది. వాస్తవానికి గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులపై పెద్దగా అభ్యంతరాల్లేవు. వీటికి అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.  కృష్ణా ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరే వీలుంది. కృష్ణాపై అనుమతి లేని ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని తెలంగాణ కోరితే.. తమ ప్రాజెక్టులకు అనుమతినివ్వాలని ఏపీ కూడా అపెక్స్‌ కౌన్సిల్‌లో పట్టుబట్టే అవకాశం ఉంది. ఈలోగా కృష్ణా ట్రైబ్యునల్‌ వేసి, జలాల పునర్‌ పంపిణీ చేపట్టాలని తెలంగాణ బలంగా కోరుతోంది.


ప్రస్తుతం ఈ ఫైలు కేంద్ర న్యాయశాఖ పరిశీలనలో ఉంది. కేంద్రం ట్రైబ్యునల్‌ను గనుక వేస్తే.. కృష్ణా జలాల తుది కేటాయింపు పూర్తయ్యాక దాన్ని అనుసరించి ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలని తెలంగాణ కోరే అవకాశాలున్నాయి. మరోవైపు బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌లో కూడా బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల నీటిని తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు పంచాలని తెలంగాణ పట్టుబడుతోంది. ఈ వివాదాలు తేలేలోపు   డీపీఆర్‌లు పంపి ప్రాజెక్టుల అనుమతిపై తుది నిర్ణయం తీసుకునే ప్రక్రియను బోర్డులకే వదిలేయాలని తెలంగాణ యోచిస్తోంది.

Updated Date - 2021-07-29T09:43:36+05:30 IST