పరువు దక్కేనా?

ABN , First Publish Date - 2020-02-28T09:51:20+05:30 IST

టెస్తుల్లో నెం.1 జట్టు భారత్‌.. పరువు కోసం పోరాడుతోంది. తొలి టెస్ట్‌లో 10 వికెట్లతో చిత్తుగా ఓడిన టీమిండియా..

పరువు దక్కేనా?

 రేపటి నుంచి  కివీస్‌తో భారత్‌ రెండో టెస్ట్‌

 బ్యాట్స్‌మెన్‌కు పరీక్షా సమయం

 పృథ్వీ ఆడేది అనుమానమే


టెస్తుల్లో నెం.1 జట్టు భారత్‌.. పరువు కోసం పోరాడుతోంది. తొలి టెస్ట్‌లో 10 వికెట్లతో చిత్తుగా ఓడిన టీమిండియా.. శనివారం నుంచి న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్ట్‌లో 

విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అయితే, బ్యాటింగ్‌ వైఫల్యం భారత్‌ను తీవ్రంగా కలవరపరుస్తోంది. తొలి టెస్ట్‌లోని రెండు ఇన్నింగ్స్‌లోనూ 200 పరుగుల మార్క్‌ను కూడా చేరుకోలేకపోవడం టాప్‌ ర్యాంక్‌ జట్టుకు ఘోర అవమానం.  ఈ నేపథ్యంలో 

బలహీనతలకు చెక్‌ చెప్పి.. విజయంతో టూర్‌ను ముగించి సిరీ్‌సను సమం చేయాలని కోహ్లీ సేన భావిస్తోంది. 


క్రైస్ట్‌చర్చ్‌: సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటనలో ఆఖరి మ్యాచ్‌ను ఆడబోతున్న టీమిండియా ఘన విజయంతో స్వదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తోంది. రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా శనివారం నుంచి హాగ్లే ఓవల్‌లో కివీ్‌సతో జరిగే ఆఖరి టెస్ట్‌కు కోహ్లీసేన అస్ర్తాలను సిద్ధం చేసుకుంటోంది. అయితే వెల్లింగ్టన్‌ తరహాలోనే ఈ మ్యాచ్‌లో కూడా భారత బ్యాట్స్‌మెన్‌కు విషమ పరీక్ష ఎదురుకానుంది. మరోవైపు ఓపెనర్‌ సమస్యతోపాటు తుది జట్టు కూర్పు కూడా మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా తయారైంది. తొలి టెస్ట్‌లో కొత్త ఓపెనింగ్‌ జోడీ పృథ్వీ షా-మయాంక్‌ అగర్వాల్‌ను టీమిండియా పరీక్షించింది. అగర్వాల్‌ ఫర్వాలేదనిపించినా.. షా ఆకట్టుకోలేకపోయాడు. షార్ట్‌ బా ల్స్‌ను ఎదుర్కోవడంలో విఫలమైన పృథ్వీ 16, 14 పరుగులే చేశాడు. అయితే, ఎడమకాలు వాయడంతో గురువారం ప్రాక్టీస్‌ సెషన్‌కు పృథ్వీ హాజరుకాలేదు. 


అశ్విన్‌ స్థానంలో జడేజా..?

బౌలింగ్‌ విభాగానికొస్తే పేస్‌గన్‌ బుమ్రా.. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోతున్నాడు. సీనియర్‌ ఇషాంత్‌ శర్మ స్ఫూర్తిదాయక ప్రదర్శన ఒక్కటే తొలి టెస్ట్‌లో భారత్‌కు ఊరటనిచ్చే అంశం. స్పిన్నర్‌ అశ్విన్‌ కూడా పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలో జడేజావైపు మేనేజ్‌మెంట్‌ మొగ్గుచూపే అవకాశాలున్నాయి. ఒకవేళ ఐదుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగాలనుకుంటే పేసర్‌ ఉమే్‌షకు తుది జట్టులో చోటు దక్కవచ్చు. మరోవైపు తొలి టెస్ట్‌ విజయంతో న్యూజిలాండ్‌ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో  యాంగిల్డ్‌ డెలివరీలతో బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన పేసర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, సౌథీ, జేమిసన్‌ నుంచి మరోసారి ఆ ప్రదర్శనను జట్టు ఆశిస్తోంది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలుస్తున్నారు. వెల్లింగ్టన్‌ మ్యాచ్‌కు దూరమైన నీల్‌ వాగ్నర్‌ మళ్లీ జట్టులోకి రావడంతో సెలెక్షన్‌లో డైలమా నెలకొంది. ఈ నేపథ్యంలో స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ స్థానంలో వాగ్నర్‌ను తీసుకోవచ్చు. 


భయపెడుతున్నకోహ్లీ వైఫల్యం..

 వన్‌డౌన్‌లో నయా వాల్‌ పుజార ఆశించిన మేర రాణించకపోవడంతో భారత్‌పై పెనుభారమే పడుతోంది. అన్నింటికంటే జట్టును ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నది కోహ్లీ వైఫల్యం. రహానె మెరుగైన టెక్నిక్‌తో ఎదురు నిలిచినా.. జట్టును మాత్రం ఆదుకోలేక పోయాడు. ఇతడి నుంచి టీమ్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. కాగా, భారత్‌-ఎ టూర్‌లో ఇదే పిచ్‌పై విహారి (51, 100 నాటౌట్‌) రాణించడం అతడిపై అంచనాలను పెంచేసింది.

Updated Date - 2020-02-28T09:51:20+05:30 IST