కోల్‌కతా.. కలిసికట్టుగా

ABN , First Publish Date - 2020-11-02T09:24:35+05:30 IST

పేలవ ఆటతీరుతో ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి రాజస్థాన్‌ నిష్క్రమించింది. అటు అన్ని విభాగాల్లో రాణించిన కోల్‌కతా నాకౌట్‌ బెర్త్‌పై ఆశలు

కోల్‌కతా.. కలిసికట్టుగా

ఆ ముగ్గురు ఎవరు?

ఈ సీజన్‌ ముగింపు దశకు చేరుకున్నా.. ప్లేఆఫ్స్‌లో చివరి మూడు బెర్త్‌లపై ఇంకా స్పష్టత రాకపోవడం చూస్తే...పోటీలు ఎంత హోరాహోరీగా సాగుతున్నాయో అర్ధమవుతుంది. ముంబై ప్లేఆఫ్స్‌కు చేరగా, చెన్నై, పంజాబ్‌, రాజస్థాన్‌ జట్లు 12 పాయింట్లతో టోర్నీనుంచి నిష్క్రమించాయి. ఇక మిగిలిన నాలుగు జట్లు మూడు బెర్త్‌ల కోసం పోటీపడుతున్నాయి. ఆ అవకాశాలేమిటో పరిశీలిద్దాం.


ముంబై

ప్లే ఆఫ్స్‌కు చేరి దర్జాగా టాప్‌లో కూర్చుంది. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గెల్చినా, ఓడినా ఆ జట్టుకేమీ కాదు. 


కోల్‌కతా 

14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌ బరిలోఉంది. ఒకవేళ ముంబై చేతిలో హైదరాబాద్‌ ఓడిపోతే.. కోల్‌కతా నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. సన్‌రైజర్స్‌ గెలిస్తే..బెంగళూరు/ఢిల్లీ జట్లలో ఒకటి ఘోరంగా ఓడిపోవడంపై  అవకాశాలు ఆధారపడి ఉంటాయి.


హైదరాబాద్‌ 

ముంబైతో మంగళవారం జరిగే మ్యాచ్‌లో ఓడితే మాత్రం హైదరాబాద్‌ ఇంటికే. సన్‌రైజర్స్‌కు రన్‌రేట్‌ అద్భుతంగా ఉన్నందున ఆ మ్యాచ్‌లో  గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరడం ఖాయమే. 


ఢిల్లీ/బెంగళూరు 

ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ విజేత  ప్లేఆఫ్స్‌లో రెండోస్థానంలో నిలుస్తుంది. ఓడిన జట్టుకూ చాన్స్‌ ఉంటుంది. అయితే రన్‌రేట్‌ విషయంలో హైదరాబాద్‌, కోల్‌కతాలతో పోటీపడాల్సి ఉంటుంది.


ప్లేఆ్‌ఫ్సపై ఏమాత్రమైనా ఆశలు పెట్టుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో కోల్‌కతా దుమ్ము రేపింది. కెప్టెన్‌ మోర్గాన్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌కు తోడు, ప్యాట్‌ కమిన్స్‌ నాలుగు వికెట్లతో చెలరేగి అసలైన మ్యాచ్‌లో తన విలువేంటో చూపాడు. మరోవైపు తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లను అద్భుతంగా ఛేదించిన రాజస్థాన్‌ అత్యంత కీలక మ్యాచ్‌లో దారుణంగా చతికిలపడింది. ఇక మంగళవారం మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓడితే కేకేఆర్‌ బెర్త్‌ దక్కినట్టే. 


రాజస్థాన్‌పై విజయం

ఆశలు సజీవం 

స్మిత్‌ సేన అవుట్‌


దుబాయ్‌: పేలవ ఆటతీరుతో ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి రాజస్థాన్‌ నిష్క్రమించింది. అటు అన్ని విభాగాల్లో రాణించిన కోల్‌కతా నాకౌట్‌ బెర్త్‌పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. తమ ఆఖరి మ్యాచ్‌లో 60 రన్స్‌తో గెలిచిన కోల్‌కతా 14 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరింది. స్మిత్‌సేన ఆఖరిస్థానంతో లీగ్‌ను ముగించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసింది. మోర్గాన్‌ (35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 నాటౌట్‌), త్రిపాఠి (39), గిల్‌ (36) రాణించారు. తెవాటియాకు 3, త్యాగికి 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసి ఓడింది. బట్లర్‌ (35), తెవాటియా (31) ఫర్వాలేదనిపించారు. కమిన్స్‌కు నాలుగు, మావి.. వరుణ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కమిన్స్‌ నిలిచాడు.


కమిన్స్‌ కమాల్‌: 192 పరుగుల ఛేదనలో రాజస్థాన్‌ తొలి నాలుగు బంతుల్లోనే 6,4,6తో ఆహా అనిపించింది. కానీ కట్‌ చేస్తే.. ఐదు ఓవర్లు ముగిసేసరికి ఊతప్ప (6), స్టోక్స్‌ (18), స్మిత్‌ (4), శాంసన్‌ (1), పరాగ్‌ (0) పెవిలియన్‌లో కూర్చున్నారు. నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడిన కమిన్స్‌ ఇందులో నలుగురిని అవుట్‌ చేయడం విశేషం. కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ కళ్లుచెదిరే క్యాచ్‌లతో ఆకట్టుకున్నాడు. 37/5తో రాజస్థాన్‌కు తమ పరిస్థితేమిటో అర్థమైంది. అయితే క్రీజులో బట్లర్‌, తెవాటియా ఉండడంతో ఆర్‌ఆర్‌ ఆశలు వదులుకోలేదు. దీనికి తగ్గట్టుగానే బట్లర్‌ బౌండరీలతో జోరు చూపించాడు. కానీ 11వ ఓవర్‌లో మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి దొరికిపోయాడు. భారీ షాట్‌కు వెళ్లి డీప్‌ మిడ్‌వికెట్‌లో కమిన్స్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో కేకేఆర్‌లో జోష్‌ పెరిగింది. ఆతర్వాత 15వ ఓవర్‌లో  తెవాటియాను కూడా వరుణ్‌ అవు ట్‌ చేసి రాజస్థాన్‌ పోటీని నామమాత్రం చేశాడు.



గిల్‌, త్రిపాఠి భాగస్వామ్యం: పవర్‌ప్లేలో జోరు.. మధ్య ఓవర్లలో తడబాటు.. ఆఖర్లో మోర్గాన్‌ తుఫాన్‌ ఆటతీరు. ఇదీ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఆటతీరు. ఆరంభ ఓవర్‌లోనే ఓపెనర్‌ రాణాను గోల్డెన్‌ డక్‌ చేసి ఆర్చర్‌ ఝలక్‌ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత ఐదు ఓవర్లపాటు గిల్‌, రాహుల్‌ త్రిపాఠి చెలరేగుతూ రెండో వికెట్‌కు 73 రన్స్‌ అందించారు. రెండో ఓవర్‌లో గిల్‌ 3 ఫోర్లతో వేగం పెంచగా.. నాలుగో ఓవర్‌లో గిల్‌, త్రిపాఠి జోడీ రెండేసి ఫోర్లతో 17 రన్స్‌ రాబట్టింది. వీరి ధాటికి పవర్‌ప్లేలో జట్టు 55 రన్స్‌ సాధించింది. అయితే 9వ ఓవర్‌లో గిల్‌, నరైన్‌ (0) వికెట్లను తెవాటియా పడగొట్టాడు. కాసేపటికే త్రిపాఠిని గోపాల్‌.. దినేశ్‌ కార్తీక్‌ (0)ను తెవాటియా వెనక్కి పంపడంతో 99/5తో జట్టు కష్టాల్లో పడింది.


మోర్గాన్‌ మోత: పరుగుల కోసం తపిస్తున్న వేళ చివరి ఆరు ఓవర్లలో మోర్గాన్‌ మోత మోగించాడు. 14వ ఓవర్‌లో అతడు వరుసగా 4,4,6,6తో కదం తొక్కుతూ 21 రన్స్‌ రాబట్టాడు. ఇక ఆండ్రీ రస్సెల్‌ (25) దడదడలాడించాడు. 15వ ఓవర్‌లో 4,6.. మరుసటి ఓవర్‌లో 6,6తో కీలక పరుగులు అందించాడు. అదే ఓవర్‌లో స్టోక్స్‌ క్యాచ్‌తో అతడి ఇన్నింగ్స్‌ ముగిసింది. 19వ ఓవర్‌లో మోర్గాన్‌ 6,6,4తో చెలరేగి 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కమిన్స్‌ ఓ సిక్సర్‌తో ఆ ఓవర్‌లో జట్టు 24 పరుగులు సాధించింది. ఆఖరి ఓవర్‌లో చివరి బంతిని మోర్గాన్‌ సిక్సర్‌గా మలవడంతో జట్టు 190 రన్స్‌ దాటింది. 


పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు (4) తీసిన బౌలర్‌గా అక్తర్‌, చండీల, ధావల్‌ కులకర్ణిలతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచిన కమిన్స్‌. తొలి స్థానంలో ఇషాంత్‌ (5) ఉన్నాడు. 


స్కోరుబోర్డు

కోల్‌కతా: గిల్‌ (సి) బట్లర్‌ (బి) తెవాటియా 36; రాణా (సి) శాంసన్‌ (బి) ఆర్చర్‌ 0; త్రిపాఠి (సి) ఊతప్ప (బి) గోపాల్‌ 39; నరైన్‌ (సి) స్టోక్స్‌ (బి) తెవాటియా 0; మోర్గాన్‌ (నాటౌట్‌) 68; కార్తీక్‌ (సి) స్మిత్‌ (బి) తెవాటియా 0; రస్సెల్‌ (సి) మిల్లర్‌ (బి) త్యాగి 25; కమిన్స్‌ (సి) శాంసన్‌ (బి) త్యాగి 15; నాగర్‌కోటి (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 191/7; వికెట్ల పతనం: 1-1, 2-73, 3-74, 4-94, 5-99, 6-144, 7-184; బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-19-1; ఆరోన్‌ 2-0-22-0; గోపాల్‌ 3-0-44-1; స్టోక్స్‌ 3-0-40-0; తెవాటియా 4-0-25-3; త్యాగి 4-0-36-2.


రాజస్థాన్‌: ఊతప్ప (సి) నాగర్‌కోటి (బి) కమిన్స్‌ 6; స్టోక్స్‌ (సి) కార్తీక్‌ (బి) కమిన్స్‌ 18; స్మిత్‌ (బి) కమిన్స్‌ 4; శాంసన్‌ (సి) కార్తీక్‌ (బి) శివమ్‌ మావి 1; బట్లర్‌ (సి) కమిన్స్‌ (బి) వరుణ్‌ చక్రవర్తి 35; పరాగ్‌ (సి) కార్తీక్‌ (బి) కమిన్స్‌ 0; తెవాటియా (సి) కార్తీక్‌ (బి) వరుణ్‌ చక్రవర్తి 31; శ్రేయాస్‌ గోపాల్‌ (నాటౌట్‌) 23; ఆర్చర్‌ (సి) శివమ్‌ మావి (బి) నాగర్‌కోటి 6; కార్తీక్‌ త్యాగి (సి అండ్‌ బి) శివమ్‌ మావి 2; వరుణ్‌ ఆరోన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 131/9; వికెట్ల పతనం: 1-19, 2-27, 3-32, 4-32, 5-37, 6-80, 7-105, 8-125, 9-129; బౌలింగ్‌: కమిన్స్‌ 4-0-34-4; శివమ్‌ మావి 4-1-15-2; వరుణ్‌ చక్రవర్తి 4-0-20-2; నరైన్‌ 4-0-37-0; నాగర్‌కోటి 4-0-24-1..

Updated Date - 2020-11-02T09:24:35+05:30 IST