ఏ1, ఏ2ల కక్ష సాధింపుల పర్వం పరాకాష్టకు చేరింది : పట్టాభి

ABN , First Publish Date - 2020-10-24T17:07:38+05:30 IST

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్‌కి చెందిన గీతం సంస్థ కట్టడాల కూల్చివేతలపై

ఏ1, ఏ2ల కక్ష సాధింపుల పర్వం పరాకాష్టకు చేరింది : పట్టాభి

అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్‌కి చెందిన గీతం సంస్థ కట్టడాల కూల్చివేతలపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయమై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ మీడియా మీట్ నిర్వహించి వైసీపీ సర్కార్ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఏపీలో ఏ1, ఏ2ల కక్ష సాధింపుల పర్వం పరాకాష్టకు చేరిందని ఆరోపించారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గీతం విశ్వవిద్యాలయంపై దాడికి జగన్ సర్కారు తెరలేపిందన్నారు. వారికి ప్రజాసమస్యలు, ప్రజా క్షేమం పట్టడం లేదు లేదని ఎంతసేపూ కూల్చివేతలపైనే దృష్టి సారించారన్నారు. వరదల కారణంగా ప్రజలంతా తీవ్రంగా నష్టపోయి, విలపిస్తుంటే, వారిని పట్టించుకోకుండా కక్షసాధింపులకే ముఖ్యమంత్రి తమ సమయం వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. జగన్ సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత దోచుకుందాం.. ఎవరిపై కక్షసాధిద్దామనే ఆలోచనలే చేస్తున్నారన్నారు.


దొంగ జీవోలివ్వడం అలవాటైంది..!

ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన గీతం విశ్వవిద్యాలయంపై దొంగల ముఠా అర్థరాత్రి దాడికి దిగింది. దొంగలముఠాకు చీకట్లో పనిచేయడం, చీకటి వ్యాపారాలుచేయడం, అర్థరాత్రి దొంగజీవోలు ఇవ్వడం అలవాటైంది. దొంగలముఠా నాయకుడికి తప్పుడు జీవోలు, ఆర్డినెన్స్‌లు ఇవ్వడం నిత్యకృత్యమైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గీతం విశ్వవిద్యాలయంలో 23వేలమంది విద్యనభ్యసిస్తున్నారు. విశాఖ క్యాంపస్‌లోనే 13 వేలమంది ఉన్నారు. 400 మంది విదేశీ విద్యార్థులున్నారు. 1980లో స్థాపించబడి, లాభాపేక్షలేకుండా నాలుగుదశాబ్దాలుగా కొన్నిలక్షల మందికి గీతం సంస్థ విద్యనందిస్తోంది. విశాఖపట్నంలో తొలి కోవిడ్ కేంద్రాన్ని ప్రారంభించింది గీతం మెడికల్ కాలేజ్, ఆసుపత్రి.  కోవిడ్ సమయంలో 3వేలమంది పేదలకు  వైద్యసేవలందించిన ఘనత గీతం సంస్థకే దక్కుతుంది. అటువంటి గొప్ప సంస్థను తమ కక్షసాధింపులకు బలిచేయాలని జగన్ చూడటం దారుణం అని పట్టాభి ఆరోపించారు.


విజయసాయికి ఇష్టం లేదు..!

విద్య అన్నా.. విద్యాసంస్థలన్నా అతనికి గౌరవముందా?. సగంలోనే చదువులు ఆపేసిన వ్యక్తి ఈ రాష్ట్రానికి మ ఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం. స్టాన్ ఫోర్డ్, సెంట్రల్ మిషిగన్ యూనివర్శిటీలతో ఒప్పందం చేసుకున్న సంస్థ గీతం. గీతం వంటి విద్యాసంస్థలు విశాఖపట్నంలో ఉండటం విజయసాయికి ఇష్టంలేదు. పేదల నుంచి 6వేలఎకరాల అసైన్డ్ భూములు కబ్జా చేసి, పులివెందుల బ్యాచ్‌తో విశాఖలో బెదిరింపులకు పాల్పడుతున్న విజయసాయికి  గీతం విద్యాసంస్థతో పనేంటి?. గీతం సంస్థకు ప్రభుత్వ భూమితో పనిలేదు. సదరు సంస్థ సొంత నిధులతో భూములు కొని, ఇతర రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ఏర్పాటుచేసింది. విజయసాయి తన కబ్జాలకోసమే విశాఖలో పాగా వేశాడు. 420 మంత్రులంతా పక్కనే ఉంటేవారిపై చర్యలు తీసుకోకుండా గీతం సంస్థను తప్పుపడతారా?. బెయిల్‌పై బయట తిరుగుతూ, ఢిల్లీవాళ్లకు వంగి వంగి దండాలు పెడుతూ, తనను ఎవరూ అడ్డుకోరన్నట్లు విజయసాయి ప్రవర్తిస్తున్నాడు. భరత్‌పై ఉన్న రాజకీయకక్షతోనే గీతం విద్యాసంస్థపై దాడికి దిగారు. భరత్, ఆయన కుటుంబానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూడలేకే, కడుపుమంటతో గీతం సంస్థపై దాడికి దిగారు. మొన్న సబ్బంహరి ఇంటిపై, నిన్న విజయవాడలో నాఇంటిపై, ఇప్పుడేమో భరత్ విద్యాసంస్థలపై దాడి చేశారు. ప్రజలంతా ముఖ్యమంత్రి దాడులను గమనిస్తూనే ఉన్నారు. ప్రజలపక్షాన నిలబడకుండా చేయడం కోసం, ప్రభుత్వం తమపై ఇటువంటి దాడులుచేస్తే ఆగేది లేదు. రాష్టప్రభుత్వం ఇకనుంచైనా ఇటువంటి కక్షసాధింపులు మానుకొని, ప్రజల గురించి ఆలోచిస్తే మంచిది అని పట్టాభి హితవు పలికారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ విషయంపై స్పందిస్తూ.. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఎవ్వర్నీ వదిలే ప్రసక్తేలేదని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2020-10-24T17:07:38+05:30 IST