Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెత్తుటి జ్ఞాపకం.. ‘కొయ్యూరు’

హైదరాబాద్‌లో మావోలు ఏర్పాటు చేసిన కొయ్యూరు ఎన్‌కౌంటర్‌ మృతుల తాత్కాలిక స్మారకస్థూపం (ఫైల్‌)

ముగ్గురు మావోయిస్టు అగ్రనేతల ఎన్‌కౌంటర్‌ ఘటనకు 21 ఏళ్లు
నేటి నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలు
అమరులను స్మరించుకోవాలని అజ్ఞాత నేతల పిలుపు
పోలీసుల విస్తృత తనిఖీలతో అటవీ గ్రామాల్లో ఉద్రిక్తత


భూపాలపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
కొయ్యూరు ఎన్‌కౌంటర్‌ నెత్తుటి జ్ఞాపకానికి 21 ఏళ్లు.  పీపుల్స్‌వార్‌ ఉద్యమంలో కొయ్యూరు ఎన్‌కౌంటర్‌ భారీ ఎదురుదెబ్బగా నిలిచింది. ముగ్గురు అగ్రనేతలను కోల్పోయిన పీపుల్స్‌వార్‌ వీరి జ్ఞాపకార్థం పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీని ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా డిసెంబరు 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పీఎల్‌జీఏ వారోత్సవాలను జరుపుకుంటు, ఉద్యమంలో అమరులైన సహచరులను మావోయిస్టు పార్టీ స్మరించుకుంటుంది. ఈ క్రమంలోనే సభలు, సమావేశాలతో పాటు కొత్తగా రిక్రూట్‌మెంట్‌లతో పీఎల్‌జీఏను బలోపేతం చేసేందుకు మావోయిస్టులు ప్రణాళిక రూపొందించటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా పెంచటంతో పీఎల్‌జీఏ వారోత్సవాలు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉద్రిక్తతను పెంచుతున్నాయి.  

కొయ్యూరు దెబ్బ..
ప్రస్తుత భూపాలపల్లి జిల్లా (అప్పటి కరీంనగర్‌ జిల్లా) మల్హర్‌ మండలం కొయ్యూరులో 1999 డిసెంబరు 2న భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అప్పటి పీపుల్స్‌వార్‌ కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రం సంతో్‌షరెడ్డి, ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి శీలం నరేష్‌ మృతి చెందారు. ఈ క్రమంలో వారి స్మారకార్థం  2000వ సంవత్సరం డిసెంబరు 2న పీపుల్స్‌వార్‌ గ్రూపు పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ(పీజీఏ)ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ప్రతి ఏటా డిసెంబరు 2 నుంచి 8 వరకు పీజీఏ వారోత్సవాలను నిర్వహిస్తోంది. చర్చల సమయంలో 2004లో హైదరాబాద్‌లోని బేగంపేట వద్ద కొయ్యూరు ఎన్‌కౌంటర్‌ మృతులు నల్లా ఆదిరెడ్డి, సంతో్‌షరెడ్డి, శీలం నరేష్‌  జ్ఞాపకార్థం భారీ స్థూపాన్ని నిర్మించింది.  

ఈ క్రమంలో పీపుల్స్‌వార్‌తో పాటు దేశంలో మరో అతిపెద్ద నక్సల్‌ గ్రూపు ఎంసీసీఐలు 2004 సెప్టెంబరు 21న ఐక్యమై సీపీ ఐ (మావోయిస్టు) పార్టీగా ఏర్పడ్డాయి. అప్పటి నుంచి పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ (పీజీఏ)ని పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీజీఎల్‌ఏ)గా మార్చారు.  21 ఏళ్లుగా మావోయిస్టు పార్టీ కొయ్యూరు నెత్తుటి జ్ఞాపకాన్ని పీఎల్‌జీఏ వారోత్సవాల్లో స్మరించుకుంటోంది.  పీఎల్‌జీఏను బలోపేతం చేయటంతో పాటు ఇటీవల జరుగుతున్న దాడుల వెనుక పీఎల్‌జీఏ కీలకంగా ఉంటోంది. యువతను ఆకట్టుకునేందుకు పీఎల్‌జీఏ రిక్రూట్‌మెంట్లను ప్రోత్సహిస్తోంది. డిసెంబరు 2 నుంచిగ్రామగ్రామానా పీఎల్‌జీఏ వారోత్సవాలు జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ జేఎండబ్లూపీ డివిజన్‌ కమిటీ కార్యదర్శి కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేశ్‌ పత్రిక ప్రకటనలో కోరారు. ప్రజలు, ప్రజాసంఘాలు సభల్లో అమరులను స్మరించుకోవాలని, యువత పీఎల్‌జీఏలోకి రిక్రూట్‌ కావాలని కోరటంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు.

వారోత్సవాలపై పోలీసుల నజర్‌
మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో పోలీసుల హై అలర్ట్‌ అయ్యారు. పీఎల్‌జీఏ వారోత్సవాల్లో మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలని వ్యూహరచన చేశారు. ఇప్పటికే అడవి ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్న పోలీసులు వారోత్సవాల నేపథ్యంలో భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. వరంగల్‌ నగరంపై మావోయిసు సానుభూతిపరుల కార్యకలాపాలపై నిఘా పెట్టినట్లుగా సమాచారం.

గొత్తికోయ గూడెల్లో తనిఖీలతో పాటు నిరంతరం నిఘా పెడుతున్నారు. మావోయిస్టులకు ఎవరు సహకరించవద్దని హెచ్చరిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలను గ్రామాల నుంచి సురక్షత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. ఏటూరునాగారం సమీపంలోని ముళ్లకట్ట వంతెన, కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన, మేడిగడ్డ బ్యారేజీ వంతెన, తుపాకులగూడెం బ్యారేజీ వంతెనల నుంచి రాకపోకలపై పోలీసులు నజర్‌ పెట్టారు. పొరుగు రాష్ర్టాలకు సరిహద్దులో ఉన్న వాజెడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, తాడ్వాయి, భూపాలపల్లి జిల్లా పలిమెల, మహముత్తారం, మహదేవపూర్‌, భూపాలపల్లి మండలాల్లో ప్రత్యేక బలగాలతో తనిఖీలు చేస్తున్నారు. మొత్తానికి 21ఏళ్ల పీఎల్‌జీఏ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు వేస్తున్న ఎత్తులతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Advertisement
Advertisement