జాతీయ పార్టీలకు.. రాష్ట్రంలో కోతి అధ్యక్షులు

ABN , First Publish Date - 2021-10-23T07:52:36+05:30 IST

రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలకు కోతీయ అధ్యక్షులు వచ్చారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. వారిద్దరూ కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. గాంధీభవన్‌లో గాడ్సే దూరాడని, హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు..

జాతీయ పార్టీలకు.. రాష్ట్రంలో  కోతి అధ్యక్షులు

  • గాంధీభవన్‌లో గాడ్సే దూరిండు..
  • తప్పుడు పనులు చేసినవారు బీజేపీలోకి
  • బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఈటల
  • గోల్కొండ రిసార్ట్స్‌లో ఈటల, రేవంత్‌ రహస్య భేటీ
  • బీజేపీ పన్నాగంలో ప్రవీణ్‌కుమార్‌, షర్మిల పాచికలు
  • ఎన్నికల కమిషన్‌ తన పరిధిని అతిక్రమించింది
  • ప్రధానమంత్రి మా పథకాలనే కాపీ కొడుతున్నారు
  • ఏపీలో సీఎంను పట్టుకొని బూతులు తిట్టడమేంటి?
  • అర్జెంటుగా అధికారం కోసం ఆరాటమెందుకు?
  • ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో కేటీఆర్‌ వ్యాఖ్యలు


రెండు జాతీయ పార్టీలకు కోతీయ అధ్యక్షులు వచ్చిండ్రు. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు ఎగిరెగిరి పడుతున్నరు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ రాదు. కరీంనగర్‌, నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లోలాగే కాంగ్రెస్‌, బీజేపీ చీకటి ఒప్పందాలతో పని చేస్తున్నాయి. ఎన్ని చేసుకున్నా ఈటల ఓటమి ఖాయం. ఏడాదిన్నర లోపు ఆయన కాంగ్రెస్‌లో చేరుతరు. 


హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలకు కోతీయ అధ్యక్షులు వచ్చారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. వారిద్దరూ కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. గాంధీభవన్‌లో గాడ్సే దూరాడని, హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా రాదని అన్నారు. ఈటల రాజేందర్‌.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అని ఆరోపించారు. గోల్కొండ రిసార్ట్స్‌లో రేవంత్‌, ఈటల రహస్యంగా సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఏడాదిన్నర తరువాత ఈటల కాంగ్రెస్‌లో చేరతారన్నారు. టీఆర్‌ఎస్‌ ఓటుబ్యాంకును చీల్చేందుకు కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, వైఎస్‌ షర్మిల.. బీజేపీ పన్నాగంలో పాచికలని ఆరోపించారు. తాము ఇకపై ప్రభుత్వాన్ని, పార్టీని సమపాళ్లలో నడుపుతామని ప్రభుత్వ పరంగా చేస్తున్న పనులను, పార్టీ పరంగా చెప్పిన విషయాలను పరిశీలనలోకి తీసుకుని ప్రజల వద్దకు సన్నిహితంగా వెళతామని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలను యాంత్రికంగా అమలు చేయడం కాకుండా కార్యకర్తలు, ప్రజలతో భావోద్వేగంతో పెనవేసుకుపోయే బంధం ఉండేలా పార్టీని డ్రైవ్‌ చేస్తామన్నారు. శుక్రవారం కేటీఆర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. 


రాష్ట్రంలో జాతీయ పార్టీల కార్యక్రమాలు ఊపందుకున్నయి. టీఆర్‌ఎస్‌వీ జోరందుకుంటాయా? 

రెండు జాతీయ పార్టీలకు రెండు కోతీయ అధ్యక్షులు వచ్చిండ్రు. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు ఎగిరెగిరి పడుతున్నరు. ఓ పార్టీ సాగర్‌లో రాజకీయ ఉద్ధండుడైన జానారెడ్డిని నిలబెట్టినా ఓటమి తప్పలేదు. చేతనయితే హుజురాబాద్‌లో డిపాజిట్‌ తెచ్చుకోవాలని సవాల్‌ చేస్తున్నా. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ రాదు. అనామకుడిని నిలబెట్టారు. ఈటల బీజేపీ అభ్యర్థి కాదు. ఆయన కాంగ్రెస్‌, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి. కరీంనగర్‌, నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లోలాగే ఇద్దరు చీకటి ఒప్పందాలు చేసుకుని పని చేస్తున్నరు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కీకి, కరీంనగర్‌లో పొన్నం ప్రభాకర్‌కు డిపాజిట్‌ దక్కలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా వందశాతం ఈటల ఓటమి ఖాయం. ఏడాదిన్నర లోపు ఈటల రాజేందర్‌ కాంగ్రెస్‌లో చేరుతరు. గోల్కొండ రిసార్ట్స్‌లో ఈటల, రేవంత్‌ రహస్యంగా కలుసుకున్నరు. 


బీజేపీ వారంతా కాంగ్రెస్‌లోకి వెళతారన్నారు?

రాష్ట్రంలో కొత్త కొత్త పార్టీలు పుడుతున్నయి. ఆ కొత్త పార్టీలు కేసీఆర్‌పై మాట్లాడతాయిగానీ బీజేపీ మీద మాట్లాడవు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అని ఒకాయన బయలుదేరిండు. ఆయన బీజేపీని పల్లెత్తు మాట అనరు. షర్మిల కూడా బీజేపీని ఒక్క మాట అనరు. ఓన్లీ కేసీఆర్‌ టార్గెట్‌. హుజూరాబాద్‌లో ఎందుకు పోటీ చేయట్లేదు? టీఆర్‌ఎస్‌ ఓటుబ్యాంకును చీల్చడానికి జాతీయ పార్టీ పన్నాగంలో పాచికలు వీళ్లు. 


ఇరవైఏళ్లలో పార్టీ పటిష్ఠం అయినట్లేనా ?

ఈరోజు ఉన్న పరిస్థితిలో ఇరవై ఏళ్లు అన్నది పెద్ద అచీవ్‌మెంట్‌. టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర సాధన లక్ష్యంగా పుట్టిన పార్టీ. ఒక దశలో పార్టీని కూడా త్యాగం చేస్తామని చెప్పిన నేత కేసీఆర్‌. కానీ, తెలంగాణకు అంటూ ఒక గొంతు ఉండాలని తెలంగాణ ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేసినయి. టీఆర్‌ఎస్‌ను దేశంలోనే ఒక మంచి నిర్మాణం కలిగిన సంస్థగా తీర్చిదిద్దాలనేదే కేసీఆర్‌ అభిమతం. దానికి తగ్గట్లుగా ఇంకా ఎఫర్ట్స్‌ పెడతాం.


బీజేపీతో కుమ్మక్కయ్యారని కాంగ్రెస్‌ అంటోంది? 

మొన్న అసెంబ్లీలో నన్ను రాజాసింగ్‌ అపాయింట్‌మెంట్‌ అడిగిండు. మంత్రిగా ఇచ్చిన. మాట్లాడిన. నేను, రాజాసింగ్‌ దోస్తులైపోయి తెల్లారి నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతామా? అలాగే ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్‌... ప్రధానమంత్రినో, హోంమంత్రినో కలిస్తే దానికి కూడా దురుద్దేశాలు ఆపాదిస్తారా ? ఈ రోజు రాష్ట్రంలో ఎవరి మీద క్రిమినల్‌ కేసులు పెట్టినా, తప్పుడు పనులు చేసినవారంతా బీజేపీలోకి ఉరుకుతున్నరు. ఒకాయన జర్నలిస్ట్‌గా తప్పుడు పనులు చేసిండని ఆరోపణలు వస్తే... ఆయన మీద బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీస్‌ శాఖ కేసులు పెట్టింది. ఆయన పోయి బీజేపీలో శరణుజొస్తున్నరు. అంటే అందరికీ షెల్టరా బీజేపీ?


బీజేపీలో చేరాడని ఈటలపై విచారణ ఆపేశారా?

ఈటల రాజేందర్‌ స్వయంగా తప్పులు ఒప్పుకొన్నరు. పాలమూరు ప్రాజెక్టుకు భూసేకరణ చేసుడు, పౌలీ్ట్ర ఫాంకు భూసేకరణ చేసుడు ఒకటేనా? చట్టం తన పని తాను చేసుకుపోతది. ఆశించినంత తొందరగా పనులు జరగకపోవచ్చు. డెఫినెట్‌గా జరిగేది జరుగుతది. ఈటల రాజేందర్‌కు టీఆర్‌ఎస్‌ చేసిన అన్యాయం ఏమిటి? పార్టీలో అడుగుపెట్టిన నాటి నుంచి పోయే వరకు పదవిలో ఉన్నాడు కదా! 


ముందస్తు ఎన్నికలు ఉంటాయంటున్నారు?

క్రితంసారి ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోయామో చెబుతూ.. ఈసారి కూడా అలా పోతామని అనుకోవద్దని సీఎం కేసీఆర్‌ చెప్పారు. దానికి విపరీతార్థాలు తీస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఏమైనా చెప్పుకోనియ్యి. మా అధ్యక్షుడు చెబుతున్నమాట ముందస్తు ఉండదని.


ఎన్నికల సంఘం నిర్ణయాలపై అభిప్రాయం?

ఎలక్షన్‌ కమిషన్‌ తన పరిధిని అతిక్రమిస్తున్నది. దళితబంధు ఆన్‌ గోయింగ్‌ స్కీం. వాసాలమర్రిలో లాంచ్‌ అయింది. హుజూరాబాద్‌లో పైలట్‌గా నడుస్తున్నది. వేల మంది అకౌంట్లలో డబ్బులు పడినవి. మేమే ధీమాగా ఉన్నామంటే ఆపితే, గీపితే వారం రోజులు ఆపుతది. దేశంలో ఎక్కడా లేని ఖానూన్‌ ఇక్కడే ఎందుకు? ఉప ఎన్నిక జరిగే చోటే నిబంధనలు ఉంటాయి. పక్క జిల్లాలో కూడా ఉంటాయంటున్నారు. పక్క రాష్ట్రంలో కూడా పెట్టుమంటారేమో! కేసీఆర్‌ ప్రచారానికి వస్తే డిపాజిట్‌ కూడా రాదని వాళ్లు భయపడుతున్నారు. 


పార్టీ కేడర్‌కు ఎలాంటి మెసేజ్‌ ఇస్తారు?

ఇప్పటివరకు సాధించిన విజయాలు... అన్నిటికి మించి తెలంగాణ సాధన అనే విజయం. ఈరోజు తెలంగాణను అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలబెట్టుకున్నాం. మన లీడర్‌ కేసీఆర్‌ కార్యదక్షత వల్ల స్వల్ప కాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణకు అన్ని రంగాల్లో గుర్తింపు వచ్చింది. ఇదే ఒరవడి కొనసాగిస్తూ... పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం చేపడుతోన్న కార్యక్రమాలను ప్రజలకు పూర్తి స్థాయిలో చేరవేస్తూ... కొత్త కొత్త విధానాల రూపకల్పనలో కార్యకర్తలు మమేకం కావాలి. 


ఎమ్మెల్యేలపై ఏవైనా ఫిర్యాదులున్నాయా?

ఎమ్మెల్యేలను ఎదురుగా కూర్చోబెట్టుకుని ఫిర్యాదులు ఇవ్వరు కదా? మాది ఎమ్మెల్యే సెంట్రిక్‌ పార్టీ. డెఫినెట్‌గా పార్టీ యూనిట్‌గానే కనబడుతోంది. కొవిడ్‌ వల్ల కొంత స్తబ్ధత వచ్చింది. కేడర్‌కు లీడర్‌కు మధ్య కొంత గ్యాప్‌ వచ్చింది. ప్రభుత్వంపై కొంత ఎక్కువ దృష్టి పెట్టి, పార్టీపై పెట్టకపోవడం వల్ల కొంత గ్యాప్‌ ఉంది. ఆ స్తబ్ధతను వదిలించుకుని బయటకు రావాలి. 


ఎమ్మెల్యే టికెట్లలో యువతకు ప్రాధాన్యమిస్తారా?

ఇప్పుడే కాదు.. ఎప్పుడూ మేము యువతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. బెస్ట్‌ కేండిడేట్స్‌కే టికెట్‌ వచ్చింది. 


ఇక్కడ కూడా కొంత మంది సీఎంని తిడుతున్నారు?

మన దగ్గర కొంత ప్రజాస్వామ్యం ఎక్కువైందంటూ కొంత మంది మిత్రులు నాకు ట్విటర్‌లో పెడుతున్నారు. ఏపీలో ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ బూతులేంది? ఇక్కడ సీఎంను పట్టుకుని మాట్లాడుతున్న భాషేమిటి? తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై ఎవరు దాడి చేశారన్నది పక్కన పెడితే... దానికి మూలమేమిటి? రాజకీయాల్లో అంత అసహనం ఎందుకు? అంత అర్జెంటుగా అధికారంలోకి వచ్చేయాలన్న ఆరాటమెందుకు?

 

మా పథకాలను ప్రధాని కాపీ కొడుతున్నరు..

‘‘ప్రధానమంత్రే మా పథకాలను కాపీ కొడుతున్నారు. ఏదో దురుద్దేశాన్ని ఆపాదించేందుకు నేను ఈ మాట చెప్పడం లేదు. మాకు అభినందనగా భావిస్తాం. పక్క రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే తమ ప్రాంతాన్ని తెలంగాణాలో కలపాలని డిమాండ్‌ చేస్తున్న విషయాన్ని ఈ రాష్ట్రంలో హడావుడి చేసే  బీజేపీ నాయకులు గుర్తించాలి. బండి సంజయ్‌ వంటి నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి ’’ అని అన్నారు.


టీఆర్‌ఎస్‌లో తిరుగుబాటు వస్తుందని కాంగ్రెస్‌ అంటోంది?

టీఆర్‌ఎస్‌లో ఏ కారణం చేత తిరుగుబాటు వస్తది? హుజురాబాద్‌లో బ్రహ్మాండంగా గెలిచిన తర్వాత తిరుగుబాటు ఎక్కడ వస్తదో చూద్దాం. కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ పొలిటికల్‌ అనలిస్ట్‌లాగా ఎక్కడ ఏం జరుగుతోందో చెప్పేకంటే ముందు హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కి డిపాజిట్‌ వస్తదా రాదా అది చెప్పు. మా నాయకుడు నీ లాగా దొంగ కేసులు ఎదుర్కొంటున్నడా? ఎప్పుడు జైలుకు పోతవో తెలువదు. అది గాంధీ భవన్‌ కాదు.. గాంధీ భవన్‌లో గాడ్సే దూరిండు. నేను చెప్పలే.. నిన్న పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ చెప్పిండు. 




పార్టీని జాతీయ స్థాయికి విస్తరించే చాన్స్‌ ఉందా?

ఫోకస్‌ వన్‌ అండ్‌ ఓన్లీ తెలంగాణ. రాష్ట్రానికి స్వీయ అస్థిత్వ శక్తి టీఆర్‌ఎస్‌ మాత్రమే. మేము గుజరాత్‌ గులాములం కాదు, ఢిల్లీ బానిసలం కాదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే తల వొగ్గుతాం, శిరస్సు వంచుతాం తప్ప... ఎవరి మందు తల వంచం. అది పక్కా. ఐదు రోజులుగా కార్యకర్తలతో మాట్లాడుతుంటే మంచి సూచనలు వచ్చాయి. వాటిని ప్రారంభించాల్సిందిగా చెప్పాను. మా బాస్‌ పెట్టిన పనితో నాకు నాలుగైదు రోజుల నుంచి పొట్టు పొట్టు అవుతోంది. ఇక్కడ ఒర్రి ఒర్రి గొంతు పోతోంది. నేను గత నాలుగైదు రోజులుగా ఫైళ్లు కూడా చూడడం లేదు. సభ వరకు ఇలాంటి పరిస్థితే ఉంటుంది. జిల్లా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాల తర్వాత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణను మొదలు పెట్టాలి. రాబోయే రెండు సంవత్సరాల పాటు పార్టీని మరింత పటిష్టంగా తయారు చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపే సంస్థాగతంగా బలపడతాం. నవంబరు 1 తర్వాత వరంగల్‌కు వెళతాం. ఖాళీగా ఉన్న కొన్ని కార్పొరేషన్ల పదవుల విషయాన్ని పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లి, సీనియర్‌ నాయకులకు న్యాయం చేస్తం.


కేసుల చిట్టా తమ దగ్గర ఉందని బండి సంజయ్‌ అంటున్నారు?

ఏ కేసుల చిట్టా? ఈటల రాజేందర్‌ అక్రమ కేసుల చిట్టానా? తీన్మార్‌ మల్లన్న అక్రమ కేసుల చిట్టానా? ధర్మపురి అర్వింద్‌ ఫేక్‌ డిగ్రీ కేసుల చిట్టానా? నువ్వేమైనా చిత్రగుప్తుడివా చిట్టా రాసుకుంటూ కూర్చోడానికి? పైనున్నోడో యమధర్మరాజా? వాళ్లు ఎట్లా ప్రవర్తిస్తున్నరో, ఈడీలను, సీబీఐలని ఎట్లా వాడుకుంటున్నరో దేశం మొత్తం చూస్తున్నది. ఇట్లా ఎగిరెగిరి పడ్డవారిని చూసి భయపడేటోడు ఎవడున్నడు ఇక్కడ? మేం తప్పులు చేసి ఉంటే ఇన్ని రోజులు ప్రజల్లో ఉంటామా?

Updated Date - 2021-10-23T07:52:36+05:30 IST