కేసీఆర్‌పై కేటీఆర్‌ ఒత్తిడి

ABN , First Publish Date - 2022-04-09T07:40:02+05:30 IST

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో సఖ్యత లేని విషయాన్ని

కేసీఆర్‌పై కేటీఆర్‌ ఒత్తిడి

  • తనను సీఎం చేయాలని కేటీఆర్‌ అడుగుతున్నారు
  • గవర్నర్‌తో సఖ్యత లేదని కేసీఆర్‌ సాకులు: రేవంత్‌రెడ్డి


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): గవర్నర్‌  తమిళిసై సౌందరరాజన్‌తో సఖ్యత లేని విషయాన్ని సాకుగా చూపించి కుటుంబ సమస్యల నుంచి సీఎం కేసీఆర్‌ తప్పించుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి తనను సీఎం చేయాలంటూ కేసీఆర్‌పై ఆయన కొడుకు, మంత్రి కేటీఆర్‌ ఒత్తిడి తెస్తుంటే.. గవర్నర్‌తో సఖ్యత లేనప్పుడు కేటీఆర్‌ను సీఎం చేయడం కష్టమవుతుందంటూ కుటుంబసభ్యులకు కేసీఆర్‌ చెబుతున్నారని అన్నారు.


గాంధీ భవన్‌లో శుక్రవారం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. పంటి వైద్యం కోసం సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లారంటే.. రాష్ట్రంలో వైద్యం పడకేసినట్లేనని రేవంత్‌ రెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రంలోని వర్సిటీల్లో పోస్టుల ఖాళీలు ఉన్నట్లుగా కేంద్రానికి గవర్నర్‌ తమిళిసై అధికారికంగా నివేదిక ఇచ్చారు. ఏ రాష్ట్ర గవర్నర్‌కూ లేని అధికారాలు రాష్ట్ర విభజన చట్టం ద్వారా తెలంగాణ గవర్నర్‌కు వచ్చాయి. విద్య, వైద్యం, శాంతి భద్రతల సమస్యలపై గవర్నర్‌ సమీక్ష జరిపి చర్యలు చేపట్టవచ్చు. ఈ అధికారాలను గవర్నర్‌ తమిళిసై వెంటనే ఉపయోగించుకుని రాష్ట్రంలోని సమస్యలు పరిష్కరించాలి’’ అని రేవంత్‌రెడ్డి సూచించారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎవరిని సిఫార్సు చేసిందో అందరికీ తెలుసని అన్నారు. ఆ సమయంలోనే గవర్నర్‌తో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి విభేదాలు వచ్చాయని గుర్తుచేశారు.


కాగా.. సీఎం కేసీఆర్‌కు కోపం వస్తుందనే రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హాజరు కాలేదని రేవంత్‌ ఆరోపించారు. ఆ రోజు వారు నగరంలో ఉండి కూడా రాజ్‌భవన్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని రేవంత్‌ అన్నారు. రైతులు తమ ఇళ్లపై నల్లజెండా ఎగుర వేయకుంటే ‘రైతుబంధు’ ఇవ్వబోమంటూ తెలంగాణ మంత్రి ఒకరు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని రేవంత్‌ ట్విటర్‌లో ఆరోపించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఈ నెలాఖరున రాష్ట్రంలో పర్యటిస్తారని వెల్లడించారు. 



అసోం సీఎం వస్తున్నారు.. అరెస్టు చేయండి: మధుయాష్కీ

రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మను అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు బిశ్వశర్మపై తెలంగాణలోనూ కేసు నమోదయిందని గుర్తు చేసింది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బిశ్వశర్మను అరెస్టుచేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సర్కారుని డిమాండ్‌ చేశారు. మరోవైపు, రాష్ట్ర డీజీపీకి ఓ వినతిపత్రం సమర్పించేందుకు గాంధీభవన్‌ నుంచి ర్యాలీగా బయలుదేరిన మహిళా కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో వాగ్వాదం జరగడంతో మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావుకు ఫిట్స్‌ వచ్చాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.


అసైన్డ్‌ భూములు గుంజుకుంటే ఊరుకోం: భట్టి 

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం పేద రైతుల నుంచి అసైన్డ్‌ భూములు గుంజుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. దళితులు, పేద, వెనుకబడిన వర్గాల వారు వ్యవసాయం చేసుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన భూములతో టీఆర్‌ఎస్‌ సర్కారు వ్యాపారం చేయాలనుకోవడం దుర్మార్గమని ఓ ప్రకటనలో శుక్రవారం ఆయన పేర్కొన్నారు. కాగా, మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన వెనుక రహస్య అజెండా ఉందని కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు.



తెలంగాణలో ముగిసిన ‘సర్వోదయ సంకల్ప యాత్ర’

రాజీవ్‌ గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ మీనాక్షీ నటరాజన్‌ ప్రారంభించిన సర్వోదయ సంకల్ప యాత్ర తెలంగాణలో శుక్రవారం ముగిసింది. భూదానోద్యమ స్ఫూర్తితో పేదల భూ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణలో ఆమె మార్చి 14న భూదాన్‌ పోచంపల్లి నుంచి ఈ యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మీనాక్షీ నటరాజన్‌ యాత్ర ముగుస్తోన్న సందర్భంగా శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దుల వద్ద ఆమెను ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కలిశారు. అనంతరం మీనాక్షీ నటరాజన్‌కు మహారాష్ట్రలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌ స్వాగతం పలికారు.


Updated Date - 2022-04-09T07:40:02+05:30 IST