ఆ వలసదారులు Kuwait కు ప్రమాదమే.. దేశం నుంచి బహిష్కరించండి.. ఓ MP డిమాండ్
ABN , First Publish Date - 2021-09-15T20:19:40+05:30 IST
కువైటైజేషన్‌లో భాగంగా ఇప్పటికే గల్ఫ్ దేశం కువైత్ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
కువైత్ సిటీ: కువైటైజేషన్‌లో భాగంగా ఇప్పటికే గల్ఫ్ దేశం కువైత్ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడి ఓ పార్లమెంట్ సభ్యుడు వలసదారుల విషయమై చేసిన డిమాండ్ ఇప్పుడు సంచలనంగా మారింది. మానసిక పరిస్థితి సరిగాలేని వలసదారులను దేశం నుంచి బహిష్కరించాలనేది ఆ ఎంపీ డిమాండ్. మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్న వలసదారులు కువైత్‌కు ప్రమాదకరం అని కూడా ఆయన అంటున్నారు. అందుకే వెంటనే వారిని దేశం నుంచి పంపించివేయాలని ఎంపీ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
70 దేశాల వారికి Dubai బంపరాఫర్.. కానీ భారత్‌కు మాత్రం..
ఈ 28 వస్తువులను మనోళ్ల దగ్గరే కొనండి.. Saudi రాజు సంచలన ఆదేశాలు
ఇలా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వలసదారుల విషయమై కువైత్ ఎంపీ బదర్ అల్ హమైదీ సోమవారం మీడియాతో తన డిమాండ్‌ను వినిపించారు. కొన్ని నెలల కిందటే ఈ సమస్యను తెరపై తెచ్చినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 37వేల మంది వలసదారులు మానసిక రుగ్మతలతో చికిత్స పొందుతున్నట్లు వివిధ ఆస్పత్రుల వద్ద రికార్డులు ఉన్నట్లు ఎంపీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వలసదారులు దేశానికి ప్రమాదకరమని, వెంటనే వారిని దేశం నుంచి బహిష్కరించాలని బదర్ అల్ హమైదీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంతర్గత మంత్రిత్వశాఖకు ఆయన నేరుగా ఓ ప్రశ్న కూడా సంధించారు.
ఇప్పటివరకు ఇలా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతమంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించారో లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. ఒకవేళ సంబంధిత శాఖ అధికారుల సమాధానం నెగెటివ్ అయితే, ఎందుకు ఇలాంటి వలసదారులను దేశం నుంచి బహిష్కరించలేదో కారణం చెప్పాలన్నారు. ఇలా మానసిక రుగ్మతలతో ఉన్న వలసదారుల వల్ల సమాజానికి డేంజర్ అని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఎంపీ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు కువైత్ వ్యాప్తంగా ఎంపీ బదర్ అల్ హమైదీ తెరపైకి తెచ్చిన ఈ సమస్యపై చర్చ మొదలైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మానసిక పరిస్థితి సరిగాలేని వలసదారులు కువైత్‌ను వదిలిపెట్టడం తప్పకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.