Work Visa ల జారీని మరింత సులభతరం చేసే దిశగా కువైత్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రవాసులు

ABN , First Publish Date - 2021-11-27T18:19:57+05:30 IST

వీసాల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా గల్ఫ్ దేశం కువైత్ అడుగులేస్తోంది. తాజాగా ఆ దేశ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) చేపట్టిన చర్యలే దీనికి నిదర్శనం.

Work Visa ల జారీని మరింత సులభతరం చేసే దిశగా కువైత్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రవాసులు

కువైత్ సిటీ: వీసాల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా గల్ఫ్ దేశం కువైత్ అడుగులేస్తోంది. తాజాగా ఆ దేశ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) చేపట్టిన చర్యలే దీనికి నిదర్శనం. వలసదారులకు ఇచ్చే వర్క్ పర్మిట్లకు సంబంధించి వీసాలను త్వరలో ఆన్‌లైన్ ద్వారా జారీ చేయనున్నట్లు పీఏఎం వెల్లడించింది. వర్క్ పర్మిట్ వీసాలు తీసుకోవడానికి దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టు తిరగుతూ ఇబ్బందులు పడుతుండడంతో ఈ సమస్య పరిష్కారంపై దృష్టిసారించిన పీఏఎం ఆన్‌లైన్ ద్వారా వీసాల జారీ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. 


వర్క్ పర్మిట్లను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ చేయడం, ఫ్యామిలీ వీసా నుంచి కంపెనీ వీసాగా మార్చుకోవడం, ఒకే స్పాన్సర్‌ కింది ఉద్యోగుల మార్పిడి(ఆర్టికల్ 24), విద్యార్థి వీసాను వర్క్ పర్మిట్‌(ఆర్టికల్ 23)గా మార్చుకునేందుకు కూడా ఆన్‌లైన్ సేవలు వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. దీనికి అనుగుణంగా త్వరలోనే పీఏఎం అధికారిక వెబ్‌సైట్‌లో మార్పులు కూడా చేయనున్నారని తెలిసింది. ఇక ఆన్‌లైన్ వీసా జారీ ప్రక్రియ అందుబాటులోకి వస్తే ప్రవాసులకు భారీ ఉపశమనం కలుగుతుంది. గంటలతరబడి వీసాల దరఖాస్తు కోసం క్యూలో ఉండాల్సిన అవసరం ఉండదు. అలాగే ఆఫీసుల చుట్టు తిరగాల్సిన పని కూడా ఉండదు. ఎంచక్కా ఇంటి నుంచే వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కువైత్ నిర్ణయం పట్ల ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-11-27T18:19:57+05:30 IST