Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారీ జీతాలు ఉన్న వలసదారులకు.. షాకిచ్చేందుకు రెడీ అవుతున్న Kuwait..!

కువైత్ సిటీ: కువైత్‌లో పెద్ద సాలరీలు ఉన్న ప్రవాస ఉద్యగులకు ఇది నిజంగా చేదువార్తే. ఎందుకంటే రాబోయే రోజుల్లో వారికి ఉద్వాసన తప్పకపోవచ్చు. కువైటైజేషన్‌లో భాగంగా ఇప్పటికే ప్రవాస ఉద్యోగుల విషయంలో గల్ఫ్ దేశం కువైత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రవాసుల రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల జారీ, పునరుద్ధరణ విషయాలలో గత కొన్నాళ్లుగా కువైత్ కఠినంగా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.


ప్రవాస ఉద్యోగులు ఎవరైతే భారీ మొత్తంలో జీతాలు అందుకుంటున్నారో వారికి వర్క్ పర్మిట్లు ఇవ్వకూడదనే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వారి స్థానంలో కువైటీలకు అవకాశం కల్పించాలని చూస్తోంది. ప్రైవేట్ సెక్టార్‌లో అధిక సంఖ్యలో దేశీయ కార్మికులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో కువైత్ ఈ ఆలోచన చేస్తుందట. ఇలా చేయడం వల్ల ప్రైవేట్ సెక్టార్‌లో రాబోయే రెండేళ్లలో సుమారు 12వేల మంది దేశ పౌరులకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని మానవ వనరుల విభాగంలోని జాతీయ కార్మిక వ్యవహారాల శాఖ అధికారి సుల్తాన్ అల్ షలానీ తెలిపారు. కువైత్ చేస్తున్న ఈ ఆలోచన కనుక కార్యరూపం దాల్చితే భారీ జీతాలు అందుకుంటున్న ప్రవాస ఉద్యోగులు మూటలు సర్దుకోవాల్సిందే. 


ఇదిలాఉంటే.. ఇప్పటికే కువైత్ సర్కార్ 60 ఏళ్లకు పైబడిన ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్ల రెన్యువల్ విషయంలో పలు కీలక మార్పులు చేసింది. మొదట యూనివర్శిటీ డిగ్రీలేని, 60 ఏళ్లకు పైబడిన ప్రవాసులకు రెసిడెన్సీ పర్మిట్లు ఇవ్వకూడదని నిర్ణయించింది. ఆ తర్వాత రెసిడెన్సీ పర్మిట్‌ను రెన్యువల్ చేసుకునేందుకు ఏకంగా 2వేల కువైటీ దినార్లు(రూ.4.87లక్షలు) చెల్లించాల్సిందిగా పేర్కొంది. ఈ నిర్ణయం పట్ల వ్యతిరేకత రావడంతో కువైత్ మంత్రిమండలి కొత్త ప్రతిపాదన చేసింది. రెన్యువల్ ఫీజును వెయ్యి కువైటీ దినార్లకు(రూ.2.43లక్షలు) తగ్గించాలని ప్రతిపాదించింది. ఇందులో ఇన్సూరెన్స్ పాలసీ 500 దినార్లుగా మంత్రిమండలి పేర్కొంది. త్వరలోనే ఈ ప్రతిపాదనపై కువైత్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.            

  

Advertisement
Advertisement