రూ.2 లక్షల లోపు బంగారానికి కేవైసీ అక్కర్లేదు

ABN , First Publish Date - 2021-01-09T06:47:23+05:30 IST

బంగారం కొనుగోళ్లలో రూ.2 లక్షల లోపు నగదు లావాదేవీలకు కేవైసీ (వినియోగదారు ధ్రువీకరణ) వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్ర

రూ.2 లక్షల లోపు బంగారానికి కేవైసీ అక్కర్లేదు

 కొనుగోళ్లపై ఆర్థిక శాఖ వివరణ 


న్యూఢిల్లీ: బంగారం కొనుగోళ్లలో రూ.2 లక్షల లోపు నగదు లావాదేవీలకు కేవైసీ (వినియోగదారు ధ్రువీకరణ) వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. నగదుతో రూ.2 లక్షలు, అంతకుపైగా విలువ చేసే బంగారం, వెండి, విలువైన రాళ్ల కొనుగోలుకు మాత్రమే ఆధార్‌, పాన్‌ కార్డ్‌ తదితర కేవైసీ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.


మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) 2002లో భాగంగా గత ఏడాది డిసెంబరు 28న రెవెన్యూ శాఖ జారీ చేసిన ఓ నోటిఫికేషన్‌కు సంబంధించి ఆర్థిక శాఖ ఈ వివరణ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రూ.10 లక్షలు, అంతకుపైగా విలువ చేసే బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలు లేదా రాళ్ల కొనుగోలుకు నగదు చెల్లింపులు జరిపే వ్యక్తులు లేదా సంస్థలకు మాత్రమే కేవైసీ తప్పనిసరి చేసినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 


రూ.50 వేల దిగువకు బంగారం :

బంగారం ధర రూ.50 వేల దిగువకు చేరింది. ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో శుక్రవారం నాడు 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) రూ.614 తగ్గి రూ.49,763గా నమోదైంది. కిలో వెండి రేటు రూ.1,609 తగ్గి రూ.67,518కి చేరుకుంది. అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ఒక దశలో 1,889 డాలర్లు, వెండి 26.68 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. 


ప్రీ-కొవిడ్‌ స్థాయికి ఆభరణ ఎగుమతులు:

గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో దేశం నుంచి బంగారం, వజ్రాభరణాల ఎగుమతులు ప్రీ-కొవిడ్‌ స్థాయికి చేరుకున్నాయని జెమ్స్‌ అండ్‌ జువెలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (జీజేఈపీసీ) తెలిపింది. అమెరికా సహా ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ పెరగడం ఇందుకు దోహదపడిందని అసోసియేషన్‌ పేర్కొంది. 



గ్రాముకు రూ.5,104 మరో విడత గోల్డ్‌ బాండ్ల జారీ 

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) పదో విడత ప్రభుత్వ పసిడి బాండ్ల జారీ ప్రక్రియ వచ్చే వారంలో ప్రారంభం కానుంది. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 11న మొదలై 15న ముగియనుంది. ఈసారి గ్రాము (యూనిట్‌) ధరను రూ.5,104గా నిర్ణయించినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. పసిడి బాండ్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడంతో పాటు డిజిటల్‌ చెల్లింపులు జరిపేవారికి గ్రాముకు రూ.50 రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 


Updated Date - 2021-01-09T06:47:23+05:30 IST