టీడీపీకి ఎల్.రమణ రాజీనామా
ABN , First Publish Date - 2021-07-09T17:38:06+05:30 IST
తెలంగాణ టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి పంపినట్లు తెలిసింది. మూడు వాఖ్యాలతో లేఖను ముగించారు
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. మూడంటే మూడే వాఖ్యాలతో తన రాజీనామా లేఖను ముగించారు. 30 ఏళ్లుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు ధన్యవాదాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎల్లుండి టీఆర్‌ఎస్‌లో రమణ చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరింత చేరువగా.. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్ పార్టీలో చేరాలని తను నిర్ణయించుకున్నట్లు రమణ తెలిపారు.
కాగా.. గురువారం నాడు టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో ఎల్ రమణ భేటీ అయిన విషయం విదితమే. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఆయన ప్రగతిభవన్‌కు వచ్చి కేసీఆర్‌ను కలిసారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో గంటకు పైగా వీరి మధ్య చర్చలు జరిగాయి. గత ఏడేండ్లలో స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించినట్టు వివరించారు. దేశంలో వివిధ రాష్ర్టాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ర్టాల్లో జరిగిన పరిణామాలు.. తెలంగాణలో జరుగుతున్న ప్రగతిపై సీఎం కేసీఆర్ విడమరచి చెప్పారని ఆయన తెలిపారు.
రమణ రండి.. నేను చూసుకుంటా
గురువారం నాడు సుమారు అరగంటపాటు కేసీఆర్‌తో రమణ భేటీ అయ్యారు. అప్పట్నుంచి రమణకు ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వచ్చని ప్రచారం జరుగుతోంది. సామాజిక తెలంగాణ కోసం కలిసి ముందుకు వెళ్దామని కేసీఆర్ ఆహ్వానించారని ఎల్. రమణ కూడా మీడియా ముందు తెలిపారు. సీఎంతో భేటీ అనంతరం రమణ మాట్లాడుతూ ‘మీరు పార్టీలోకి రండి, తగిన గౌరవమిస్తాం.. నాకు వదలిపెట్టు, నేను చూసుకుంటా’ అని కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు కూడా చెప్పారు. ‘మనం రమణను వాడుకోవాలి.. అన్ని సామాజికవర్గాలకు ఎంతో కొంత న్యాయం చేశాం. పద్మశాలి సామాజికవర్గానికి పార్టీలో రాష్ట్రస్థాయి నాయకుడు లేరు. ఆ లోటును రమణతో భర్తీ చేసుకుందాం. ఆయన్ను బాగా వాడుకోవాలి’ అని కేసీఆర్ నేతలతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది.