నిచ్చెన మెట్లూ, గదులే కాదు; ఇది వర్గ సమాజం కూడా!

ABN , First Publish Date - 2021-05-03T06:29:41+05:30 IST

‘సాహిత్యంలోనూ గదులేనా?’ (ఏప్రిల్‌ 19, 2021 -వివిధ) పేరుతో పి. రామకృష్ణగారు రాసిన వ్యాసం చదివి రాస్తున్నాను. స్త్రీలను గురించి స్త్రీలూ, ముస్లింల గురించి ముస్లింలూ....

నిచ్చెన మెట్లూ, గదులే కాదు; ఇది వర్గ సమాజం కూడా!

‘సాహిత్యంలోనూ గదులేనా?’ (ఏప్రిల్‌ 19, 2021 -వివిధ) పేరుతో పి. రామకృష్ణగారు రాసిన వ్యాసం చదివి రాస్తున్నాను. స్త్రీలను గురించి స్త్రీలూ, ముస్లింల గురించి ముస్లింలూ, దళితుల గురించి దళితులూ రాయాలనడం ఇటీవల కాలంలో బాగా ఎక్కువైంది. నిజమే, ఎవరి గురించి వాళ్ళు రాసుకుంటేనే ఆ రచనలు వాస్తవికంగానూ, బలంగానూ ఉంటాయి. అవి ఇతరులు రాస్తే అంత బలంగానూ, సహజత్వంతోనూ వుండకపోవచ్చు. ఎవరి జీవితాలు వాళ్ళకే కదా తెలిసేది. ఎవరి కాల్లోనో, కంట్లోనో ముల్లు గుచ్చుకుంటే వాళ్ళకే కదా బాధ! ఆ బాధని వాళ్ళే సరిగా వ్యక్తపరచగలరు. ఇతరులు సానుభూతిని మాత్రమే తెలుపుతారు. 


అయితే ఆ పీడితులు, వాళ్ళని గురించి వాళ్ళు మాత్రమే రాయాలనడం సమంజసం కాదు. ఇది చాలా తప్పుడు ధోరణి. పీడితుల పక్షం వహించి, వాళ్ళకి అండగా నిలబడుతూ ఎవరైనా రాయవచ్చు. అలా రాయకూడదూ అనడం సంకు చితత్వం, నిరంకుశత్వమే అవుతుంది. 


రెండు నెలల క్రితం తెలంగాణకి చెందిన ఇద్దరు రచయితలు 2020లో ప్రచురితమైన దళిత కథలతో ఒక కథా సంకలనం తెస్తున్నామనీ, ఆ ఏడాది ప్రచురణ అయిన దళిత కథల్ని పంపమనీ ప్రకటన ఇచ్చారు. నేను 2020లో రాసిన ఒక దళిత కథని పంపిద్దామని, వాళ్ళు ఇచ్చిన నంబర్‌కి ఫోన్‌ చేశాను. వాళ్ళు కథ పేరూ, ప్రచురణ అయిన పత్రిక పేరూ అడిగారు. చెప్పాను. ‘‘మీరు దళితులేనా?’’ అని ప్రశ్నించారు. కాదన్నాను. ‘‘సారీ అయితే! మేము దళిత రచయితలు మాత్రమే రాసిన దళిత కథలను వేస్తున్నాం. మీ రచన అనర్హం అవుతుంది. మా నియమ నిబంధనల మేరకు ప్రచురించలేం!’’ అన్నారు (అచ్చం ఇవే మాటలు కాదు). 


మహిళలూ, ముస్లిములూ, దళితులూ వాళ్ళని గురించి వాళ్ళే రాసుకున్నంత మాత్రాన అవి గొప్ప రచనలు, నిజంగా ఆ పక్షాలకి మేలు చేసే రచనలూ అవుతాయా? అలా అనుకోవడానికి లేదు. 


కొంచెం అటుయిటుగా 1970 నుంచీ 90 వరకూ దాదాపు రెండు దశాబ్దాలు లేదా ఒకటిన్నర దశాబ్దం తెలుగు సాహి త్యంలో మహిళలు పుంఖానుపుంఖాలుగా నవలలు రాశారు. 40, 50 నవలలు రాసిన రచయిత్రులు కూడా ఉన్నారు. ఆ రెండు దశాబ్దాలలోనూ మహిళల నుంచి కొన్ని వేల నవలలు వచ్చాయి. అయితే వాటిలో నిజంగా మహిళలకి మేలు చేసే రచనలు ఎన్ని ఉంటాయి? కృత్రిమ, కాల్పనిక, అసహజ సమస్యలు కాకుండా నిజంగా మహిళలు ఎదుర్కొం టున్న సమస్యలు- కుటుంబ హింస, పురుషాధిక్యత, మహిళల కష్టాలు, కన్నీళ్ళూ, వేదనలూ, రోదనలూ చిత్రించినవెన్ని?


అలాంటి రచనలను వేళ్ళ మీద లెక్కించవచ్చేమో! పురుషుడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా తప్పులేదనీ, ఎంతమంది భార్యలున్నా తోటి భార్యలు సర్దుకుపో వచ్చనీ రాసిన రచయిత్రులు వున్నారు. భార్యనీ, ప్రియురాలినీ కలిసిపొమ్మని చెప్పిన రచయిత్రు లున్నారు. ఇవి స్త్రీలకు మేలు చేసేవేనా?


అలాగే ముస్లింల గురించి ఒక ముస్లిం రచయిత రాసిన కథని నాలుగైదేళ్ళ క్రితం ఏదో పత్రికలో చదివి ఆశ్చర్యపోయాను. అది కాశ్మీర్‌ రాష్ట్రం. అక్కడ ముస్లిం యువకులు మిలిటెంట్లుగా పోరాడుతున్నారు. ఆ మిలిటెంట్లని ఎదు ర్కొనడానికి భారత సైనికులు ప్రతి ఊళ్ళోనూ మోహరించారు. వాళ్ళు వీర జవాన్లు. ఒక ముస్లిం యువతి భర్త కూడా మిలిటెంట్లతో కలిసిపోయాడు. ఆ యువతికి మిలిటెంట్లు అంటే వ్యతిరేకత. ఆమెకి పిల్లల్లేరు. తను ఒక బిడ్డని కని, మిలిటెంట్లకి వ్యతిరేకంగా వీర సైనికుడిగా తీర్చిదిద్దాలనీ, వీర మాతగా గుర్తింపు పొందాలనీ ఆమె భావించింది. బిడ్డని కనడానికి ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న ఒక హిందూ సైనికుడితో జత కలుస్తుంది. కేవలం పిల్లవాడ్ని కనడం కోసమే ఆ సైనికుడిని ఆమె రమ్మంటుంది. పిల్ల వాడిని కంటుంది. ఇది కథ! ఒక ముస్లిం రచయిత రాసిన కథ. ఎంత దుర్మార్గమైన కథో వేరేగా చెప్పాల్సిన పని లేదు. 


అలాగే ఇటీవల ‘వృద్ధి’ అనే కథను కూడా ఈ కోవలో చెప్పుకోవచ్చు. దళిత స్త్రీలను చాలా దారుణంగా, క్రూరంగా అవమానిస్తూ, అవహే ళన చేస్తూ, కించపరుస్తూ, వారిని పరమ అసహ్యంగా చిత్రిస్తూ రాసిన కథ. ఈ కథ రాసింది దళిత రచయితే మరి! 


మహిళలూ, ముస్లింలూ, దళితులూ వాళ్ళ గురించి వాళ్ళు రాసుకున్నంత మాత్రాన అవన్నీ ఉత్తమ రచనలుగా భావించటానికి వీల్లేదు. రాసుకుంటే మంచిదే. అయితే వాళ్ళకి వర్గ దృష్టి, వర్గ దృక్పథం, సమస్త ఉత్పత్తు లకీ మూలాధారమైన, సంపద సృష్టికర్తలైన శ్రామిక జనంమీద ప్రేమా వుండి తీరాలి. ఇది వర్గ సమాజమన్న స్పృహ ఉండాలి. తాము ఏ వర్గంలో ఉన్నామన్న విషయం తెలుసుకోవాలి. అప్పుడే వాళ్ళ నుంచి మంచి రచనలు వస్తాయి. లేకుంటే, తెలియకుండానే తమకే కీడు చేసే అభిప్రాయాలు వ్యక్తంచేసే అవకాశముంది.  

మొలకపల్లి కోటేశ్వరరావు

99892 224280


Updated Date - 2021-05-03T06:29:41+05:30 IST