ఐటీ కారిడార్‌లో భూముల వేట!

ABN , First Publish Date - 2021-07-30T06:55:07+05:30 IST

కోకాపేట, హైటెక్‌ సిటీ ప్రాంతాల్లో భూముల వేలంలో దాదాపు రెండు వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే ఐటీ కారిడార్‌లోనే మరిన్ని భూములను రెండో విడత కింద

ఐటీ కారిడార్‌లో భూముల వేట!

వేల కోట్ల ఆదాయమే లక్ష్యం.. రెండో విడత వేలానికి చర్యలు

పరిశీలనలో వెయ్యి కోట్ల విలువ చేసే 12 ఎకరాలు గుర్తింపు


హైదరాబాద్‌ సిటీ,/ గచ్చిబౌలి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): కోకాపేట, హైటెక్‌ సిటీ ప్రాంతాల్లో భూముల వేలంలో దాదాపు రెండు వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే ఐటీ కారిడార్‌లోనే మరిన్ని భూములను రెండో విడత కింద వేలం వేసేందుకు సమాయత్తం అవుతోంది. విక్రయించడానికి వీలున్న భూములపై క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పరిశీలన చేస్తోంది. ఐటీ కారిడార్‌ పరిధిలో ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, గండిపేట మండలాలతో పాటు హైదరాబాద్‌ జిల్లాలోని షేక్‌పేట మండల పరిధిలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. కొన్ని భూములపై కోర్టు కేసులు ఉన్నాయి. వారసత్వ భూములని పలువురు కోర్టుకెక్కారు. రెవెన్యూ అధికారులతో పాటు హెచ్‌ఎండీఏ, టీఎ్‌సఐఐసీఏలు కోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నాయి. వీటిని తర్వితగతిన పరిష్కారమయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఉన్నత స్థాయిలో ఆదేశాలిచ్చిన్నట్లు తెలిసింది.


రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గురువారం శేరిలింగంపల్లి మండలంలో మూడు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, టీఎ్‌సఐఐసీఏ అధికారి నర్సింహారెడ్డి, శేరిలింగంపల్లి తహశీల్దార్‌ వంశీమోహన్‌తో కలిసి పరిశీలించారు. చందానగర్‌, నల్లగండ్ల, గోపన్‌పల్లి, నానక్‌రాంగూడలో పలు సర్వే నెంబర్లలో భూములతో పాటు టీఎ్‌సఐఐసీకు చెందిన ఓపెన్‌ ప్లాట్లు కూడా ఉండగా వాటిని సందర్శించారు. నాలుగు ప్రాంతాల్లో దాదాపు 12 ఎకరాల ప్రభుత్వ భూములకు ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. శుక్రవారం కూడా ఐటీ కారిడార్‌లోని పలు ప్రభుత్వ భూములను సందర్శించి విక్రయానికి అనువైన భూములపై త్వరలోనే ఉన్నతస్థాయిలో నివేదిక అందజేయనున్నట్లు తెలిసింది. ఐటీ కారిడార్‌లో భారీ ప్రాజెక్టులను చేపట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తుండడంతో అనువైన స్థలాలను విక్రయించి ఆదాయం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. చందానగర్‌, నల్లగండ్ల, గోపన్‌పల్లి, నానక్‌రాంగూడల్లో భూములు ఎకరం సుమారు వంద కోట్ల వరకు ధర పలుకవచ్చని అధికారులు అంచనాలు వేస్తున్నారు. 12 ఎకరాల భూమిని విక్రయిస్తే సుమారు వెయ్యి కోట్ల వరకు ఆదాయం రావచ్చని అధికారులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-07-30T06:55:07+05:30 IST