అమల్లోకి భూముల చట్టం

ABN , First Publish Date - 2020-09-23T09:03:10+05:30 IST

‘తెలంగాణ భూమి హక్కులు పట్టాదార్‌ పాస్‌పుస్తకం చట్టం-2020’ రాష్ట్రంలో అమల్లోకి వచ్చేసింది.

అమల్లోకి భూముల చట్టం

పెండింగ్‌ కేసులకు ప్రత్యేక ట్రైబ్యునళ్లు

పాస్‌పుస్తకం లేకుండానే రుణాలు

ధరణి కాపీకి ఇండియన్‌ ఎవిడెన్స్‌ 

యాక్ట్‌ ద్వారా చట్టబద్ధత


హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ భూమి హక్కులు పట్టాదార్‌ పాస్‌పుస్తకం చట్టం-2020’ రాష్ట్రంలో అమల్లోకి వచ్చేసింది. ఈ బిల్లును ప్రభుత్వం సెప్టెంబరు 7న శాసనసభలో ప్రవేశపెట్టగా.. 9న శాసనసభ, 14న శాసనమండలి ఆమోదించిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ బిల్లుపై గవర్నర్‌ తమిళిసై సంతకం చేశారు. ఈ నెల 19న అర్ధరాత్రి ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అప్పటి నుంచే చట్టం అమల్లోకి వచ్చింది. కాగా.. తెలంగాణ భూమి హక్కుల పట్టాదార్‌ పాస్‌పుస్తకం చట్టం-1971 కింద తహసీల్దార్‌, ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌ల వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ పరిష్కరించడానికి ప్రత్యేక ట్రైబ్యునళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ వాటికి బదలాయిస్తూ కొత్త చట్టాన్ని రూపొందించింది. ట్రైబ్యునళ్లు జారీ చేసే ఉత్తర్వులకు చట్టబద్ధత ఉంటుంది. ఆ ఉత్తర్వుల ఆధారంగా రికార్డులను సరిచేసి, పాస్‌పుస్తకాలు ఇవ్వాల్సిందే. తాజా చట్టం ప్రకారం..


ధరణి జారీ చేసే సర్టిఫైడ్‌ కాపీకి ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ -1872లోని సెక్షన్‌-76 ప్రకారం చట్టబద్ధత ఉంటుంది.


ఈ కాపీ ఆధారంగా బ్యాంకులు/సహకార సంస్థలు రుణాలు ఇవ్వాలి. పాస్‌పుస్తకం పెట్టుకోకుండా రుణం ఇవ్వాలి. రుణం జారీ చేసే క్రమంలో ఆన్‌లైన్‌లో(ధరణి)లో వివరాలు చేర్చాలి. 


కొత్త చట్టంలో తహసీల్దార్‌కు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ హోదా ఇచ్చారు. కేవలం వ్యవసాయ భూములను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసి, మ్యుటేషన్‌ చేయనున్నారు.


ఒకవేళ ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్‌ చేస్తే తహసీల్దార్‌ను విధుల నుంచి డిస్మిస్‌ చేసి, పాస్‌పుస్తకాలను రద్దు చేయడంతోపాటు క్రిమినల్‌ కేసులు దాఖలు చేస్తారు.


రైతు లేదా భూముల యాజమాని చనిపోతే ఆ రైతు కుటుంబ సభ్యులంతా సంయుక్తంగా భూముల పంపకంపై చేసే నిర్ణయాన్ని తహసీల్దార్‌ గౌరవించాలి. ఆ నిర్ణయం ఆధారంగా భూములను వారందరీ పేర్లపై మార్చాలి.


కొత్త చట్టం ప్రకారం ధరణిలోని రికార్డులనే రికార్డ్‌ ఆఫ్‌ రైట్‌గా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది.


తహసీల్దార్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తే దాన్ని సవాలు చేసే అధికారం లేదు. ఆర్డీవో లేదా కలెక్టర్‌ను కూడా ఆశ్రయించడానికి వీల్లేదు. జిల్లా కోర్టులు లేదా సివిల్‌ కోర్టు, హైకోర్టుల్లోనే సవాలు చేయాల్సి ఉంటుంది.


ఇప్పటిదాకా ఉన్న అన్ని ఆర్వోఆర్‌ చట్టాల్లో తహసీల్దార్‌ రికార్డుల్లో మ్యుటేషన్‌(వివరాలు చేర్చడం) చేస్తే.. తహసీల్దార్‌ వద్ద, ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌ల వద్ద అప్పీల్‌ కెళ్లే అధికారం రైతులు/భూయాజమానులకు ఉండగా దాన్ని ప్రభుత్వం తొలగించింది. 


మిగతా బిల్లులూ..

భూముల చట్టంతోపాటు.. తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టుల రద్దు చట్టం-2020, పంచాయతీరాజ్‌ సవరణ చట్టం-2020, తెలంగాణ పురపాలక సవరణ చట్టం-2020, తెలంగాణ భవన నిర్మాణ అనుమతుల స్వీయ ధ్రువీకరణ విధానం (టీఎస్‌ బీపాస్‌) చట్టం-2020, ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాట్ల చట్టం-2020, తెలంగాణ జీఎస్సీ రెండో సవరణ చట్టం-2020 కూడా ఆమోదం పొందాయి.

Updated Date - 2020-09-23T09:03:10+05:30 IST