Abn logo
Sep 16 2020 @ 03:12AM

అసైన్డ్‌ చట్టానికి తూట్లు

  • గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు అసైన్డ్‌ భూములు
  • చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌ 
  • సోలార్‌ పార్కులకు భారీ భూసేకరణ
  • తొలి అడుగుగా కార్పొరేషన్‌కు 
  • అసైన్డ్‌ భూములు లీజుకు
  • ఇప్పుడు గ్రీన్‌ ఎనర్జీ ..ఆ తర్వాత?
  • పేదల భూమికి ఇంకెక్కడ రక్షణ?
  • ఇది ఎంతవరకు దారితీస్తుందో? 
  • రెవెన్యూ వర్గాల్లోనే విస్మయం


అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూముల చట్టం నీరుగారిపోయింది. ఈ చట్టం ప్రధాన లక్ష్యానికే గండిపడింది. అసైన్డ్‌ భూములను ఎవరికీ లీజుకు ఇవ్వకూడదన్న కీలకమైన నిబంధనకే రాష్ట్రప్రభుత్వం మంగళం పాడేసింది. గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌  లిమిటెడ్‌కు అసైన్డ్‌ భూములను లీజుకు కట్టబెట్టింది. ఈ మేరకు అసైన్డ్‌ చట్టం-1977లో సవరణ తీసుకొస్తూ మంగళవారం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రభుత్వ రంగ సంస్థే అయినప్పటికీ అది చేసేపని వ్యాపారం పరిధిలోకి వస్తుంది. అది కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పరిధిలో ఉంది. నిరుపేదలు, అభాగ్యులకోసం కేటాయించే భూములు పరాధీనం కాకుండా, ప్రభుత్వం ఇష్టానుసారంగా ఆ భూములను తీసుకోకుండా 1977లో ఆంధ్రప్రదేశ్‌ అసైన్‌ ్డమెంట్‌ చట్టం తీసుకొచ్చారు. పేదలకిచ్చే అసైన్డ్‌ భూములను అమ్మడం, కొనడాన్ని నిషేధించారు. అంటే ఆ భూములను ఇతరులకు బదలాయించడానికి వీలులేదు. ఇంకా, లీజు, ఒప్పందం, ఇతర పేర్లతో కూడా హక్కులు ఇతరులకు ఇవ్వడానికి వీల్లేదని ఈ చట్టంలోని సెక్షన్‌ 2, సెక్షన్‌ 3లో స్పష్టంగా పొందుపరిచారు. ఈ నిబంధనలను తీసుకురావడంలో రిటైర్డు ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌ శంకరన్‌ పాత్ర ఉంది. వీటివల్ల గత 43 ఏళ్లకాలంలో అసైన్డ్‌ భూములను లీజులకు ఇవ్వలేదు. ఇతరులు కొనుగోలు చేయలేకపోయారు. అనధికారిక లావాదేవీలు జరిగినా అవి రిజిస్ట్రేషన్‌దాకా వెళ్లలేదు. ఎందుకంటే 1908నాటి రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకారం అసైన్డ్‌ భూములను రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. దీంతో ఈ భూములను నిషేధ జాబితా 22(ఏ)లో చేర్చారు. 


గ్రీన్‌ ఎనర్జీతో ఎసరు..

రాష్ట్రంలో సోలార్‌, విండ్‌ పవర్‌  ఉత్పత్తికోసం పెద్ద ఎత్తున పార్క్‌లను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం భారీగా భూములు కావాలి. ప్రైవేటు భూములను సేకరించే పరిస్థితి అంతగా లేదు. ఇక ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న భూములు తక్కువే. దీంతో అసైన్డ్‌ భూములపై సర్కారు కన్నుపడినట్లుగా ఉంది. ప్రజాప్రయోజనాలకోసం అసైన్డ్‌ భూములను సేకరించవచ్చన్న అంశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది. అయితే, గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా ఆ భూములు ఇవ్వాలి కాబట్టి చట్టం అందుకు సమ్మతించదు. దీంతో ఆ భూములను లీజుకు ఇవ్వడానికి అనుగుణంగా ఏపీ అసైన్డ్‌మెంట్‌ చట్టం-1977లో సవరణలు చేశారు. చట్టంలోని సెక్షన్‌2, సెక్షన్‌ 3లో లీజుకు ఇవ్వకూడదు అన్న అంశం దగ్గర ‘‘ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు వ్యవసాయేతర పనులకు మినహా’’ అన్నది చేర్చారు. వ్యవసాయేతర పనులు అంటే ఖచ్చితంగా లావాదేవీలతో ముడిపడినవే. వీటికి కీలకమైన అసైన్డ్‌ భూములను లీజుకు ఇవ్వొచ్చని చట్టంలో సవరణ చేసి ఆర్డినెన్స్‌ తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఈ ఒక్క క్లాజుతో  సర్కారుకు  అవసరం ఉన్న చోట అసైన్డ్‌ భూములను సేకరించి గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు లీజుకు ఇవ్వడానికి అవకాశం లభించింది. దీనిపై రెవెన్యూ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ఈ రోజు గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు అసైన్డ్‌ భూములు లీజుకు ఇవ్వాలని చట్టంలో చేర్చారు. రేపటి రోజు మరో పనికి అవసరం పడితే వాటిని కూడా చట్టంలో చేరుస్తారు. ఇది ఎంతదాకా వెళ్తుందో చెప్పగలరా? దీనికి ఇక నియంత్రణ ఉంటుందా? ’’ అని సీనియర్‌ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. అసైన్డ్‌ భూములను ఇంటిస్థలాలకు ఇచ్చేందుకే అంగీకరించని చట్టాలు వాణిజ్య అవసరాలకోసం కార్పొరేషన్‌లు, లిమిటెడ్‌ కంపెనీలకు ఇచ్చేందుకు ఆర్డినెన్స్‌లు తీసుకొస్తే అవి నిలబడుతాయా? అన్న సందేహం రెవెన్యూ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement
Advertisement