లేఅవుట్‌ బాదుడు! పట్టణ మధ్యతరగతికి ఝలక్‌

ABN , First Publish Date - 2021-12-07T07:07:40+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయం పెంచుకోవడం కోసం పట్టణ మధ్యతరగతిని మరోసారి బాదేయనుంది......

లేఅవుట్‌ బాదుడు!  పట్టణ మధ్యతరగతికి ఝలక్‌

లేఅవుట్లలో అదనంగా 5% స్థలం

జగనన్న స్థలాలకు ఇవ్వాలని ఆదేశాలు

లేదంటే సమాన విలువ చెల్లించాలి

రియల్టర్ల నుంచి వసూలు చేస్తామన్నా

అంతిమంగా కొనే మధ్యతరగతికే దెబ్బ

ప్రస్తుతం 44ు నిర్మాణేతర పనులకు

ఇంకా అంటే స్థలం రేట్లు పెంచాల్సిందే

ఆ భారమంతా కొనుగోలుదారులపైనే

ఇప్పటికే చెత్త, ఆస్తి పన్ను పోట్లు

మరోసారి పరోక్ష బాదుడుకు సిద్ధం 

పేదల ఇళ్లపేరిట ఖజానా నింపుకొనే ఎత్తు

గత జీవోను సవరిస్తూ ఉత్తర్వులు


రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయం పెంచుకోవడం కోసం పట్టణ మధ్యతరగతిని మరోసారి బాదేయనుంది. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో విలువ ఆధారిత ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. అది చాలదన్నట్టు చెత్త పన్నూ వేశారు. ఇలా ఏది దొరికితే అది వడ్డిస్తూ సాధ్యమైనమేర ఆదాయం పెంచుకునే ఎత్తుగడలు వేస్తున్న జగన్‌ ప్రభుత్వం.. తాజాగా  లేఅవుట్లపై పడింది. 


అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక మాంద్యం, కరోనాతోపాటు రాష్ట్రంలో నెలకొని ఉన్న అనిశ్చితి కారణంగా ఇప్పటికే స్థిరాస్తి రంగం కుదేలయింది. ఈ రంగం నిలదొక్కుకోవడానికి చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం.. అక్కడనుంచి మరింతగా దండుకునేందుకు సిద్ధమవుతోంది. పట్టణ ప్రాంతాల్లో వేసే లేఅవుట్లలో ఐదుశాతం స్థలాన్ని లేదా దానికి సమానమైన మార్కెట్‌ విలువ మొత్తాన్ని కలెక్టర్‌కు చెల్లించాలంటూ మున్సిపల్‌శాఖ ఉత్తర్వులను జారీచేసింది. జగనన్న పేదల ఇళ్ల స్థలాల కోసం వాటిని వినియోగిస్తామని పేర్కొంది. అయితే, పేరుకే పేదల ఇళ్లస్థలాలు! తెర వెనుక ఉద్దేశం మాత్రం ప్రభుత్వ ఖజానాకు డబ్బు రాబట్టుకోవడమే! రియల్టర్లనుంచి ఆ సొమ్ము వసూలు చేస్తామని చెబుతున్నా.. ఏతావాతా ఆ లేఅవుట్లను కొనుగోలుచేసే మధ్యతరగతిపైనే ఆ భారమంతా పడనుంది. పట్టణాల్లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లలో 30ు రోడ్లకు, 10ు ఓపెన్‌ స్పేస్‌కు  పట్టణాభివృద్ధి సంస్థలకు, అభివృద్ధి అథారిటీలకు ఇప్పటివరకు అప్పగిస్తున్నారు. ఇవి కాకుండా ఐదు ఎకరాలు, అంతకంటే తక్కువ భూమి కలిగిన లేఅవుట్లలో ఏర్పాటుచేసిన వాటికి అదనంగా సౌకర్యాల (అమెనిటీస్‌) కోసం 2 శాతం, యుటిలీటీఎస్‌ కోసం మరో 0.5 శాతం వదిలిపెట్టాలి. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన లేఅవుట్లకు సంబంధించి సౌకర్యాల కోసం 3 శాతం, యుటిలిటీస్‌ కోసం 1 శాతం స్థలం స్థానికసంస్థలకు అప్పగించాలి.


అంటే  మొత్తంగా 5 ఎకరాల పైబడిన లేవుట్లకు ఇప్పటికే 42.50ు స్థలం, 5 ఎకరాల పైబడిన లేవుట్లకు 44ు భూమి అదనంగా వదులుతున్నారు. తాజాగా వచ్చిన సవరణ ఉత్తర్వులు మరో ఐదుశాతం స్థలాన్ని అప్పగించాలని రియల్టర్లను ఆదేశిస్తోంది. ఆ భూమిని కలెక్టర్‌కు అప్పగించాలని కూడా స్పష్టం చేస్తోంది. ఈ మేరకు 2017 జూలై 18న ఇచ్చిన జీవో 275కు సవరణ చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఐదు ఎకరాల్లోపు లేఅవుట్లకు 47.50 శాతం, ఐదు ఎకరాల పైబడి లేఅవుట్లకు 49 శాతం భూమిని అదనంగా వదిలేయాల్సి వస్తుంది. 


ఇల్లు తర్వాత.. స్థలమైనా దక్కేనా?

సొంతిల్లు మధ్యతరగతి జీవితకాల కల. దాచుకున్న డబ్బులకు, బ్యాంకుల్లో చేసిన అప్పులను కలిపి పట్టణాల్లో ఇంటి స్థలాలను మధ్యతరగతి సగటు కుటుంబాలు కొంటుంటాయి. ప్రభుత్వ నిర్ణయంతో తనకు వచ్చే నష్టాన్ని రియల్టర్‌.. అమ్మకానికి పెట్టిన లేఅవుట్ల రేటును పెంచేసి కొంత పూడ్చుకుంటాడు. కానీ, పెరిగిన ఆ ధరలకు కొనడం మధ్యతరగతికి అంత తేలిక కాదు. చేసినవాటికి తోడు మరిన్ని అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. స్థలంకొని ఇల్టు కట్టుకోవాలనుకునే తలంపుతో దాచుకున్న బడ్జెట్‌ ఒక్క స్థలానికే బొటాబొటీగా సరిపోతోంది. 


‘ఆప్షన్‌’లో అసలు మతలబు.

ఒకవేళ లేవుట్‌లో ఐదు శాతం స్థలం ఇవ్వలేకపోతే దానికి మూడు కిలోమీటర్ల పరిధిలో అప్పగించవచ్చు. లేదంటే ఆ స్థలం బేసిక్‌ విలువ చెల్లించవచ్చునని ఆప్షన్‌ ఇచ్చారు. నిజానికి ఇది ఆప్షన్‌కాదు... పట్టణాలను బాదేసేందుకు వేరే మార్గంలో వేసిన ఎత్తుగడ కావచ్చునని అనుమానిస్తున్నారు. అప్పుచేయనిదే పూటగడవని ఆర్థిక పరిస్థితి రాష్ట్రానిది. ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, స్థలాలు తాకట్టులోకి పోతున్నాయి. ఇప్పుడిక జగనన్న పేదల స్థలాల పేరిట పెద్దఎత్తునే సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమయిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 


పేరుకేనా పేదలు.. అదనంగా కలెక్టర్‌కు అప్పగించిన 5 శాతం స్థలాలను పేదల కోసం రూపొందించిన  వైఎ్‌సఆర్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టుకు కేటాయించాలని ఆ సవరణలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. మధ్యతరగతి బడ్జెట్‌, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రియల్టర్లు లేఅవుట్లు వేస్తుంటారు. వీటిల్లో స్థలం వదిలిపెడితే దానిని పేదల ఇళ్ల స్థలాలకు వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. మధ్యతరగతి నివసించే చోట పేదలకు స్థలాలు కేటాయించడం సామాజిక వివాదాలకు దారితీయొచ్చుననే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాగూ తమ లేఅవుట్లలోకి పేదలను రియల్టర్లు రానివ్వరు. దానికి బదులుగా మార్కెట్‌ విలువను లెక్కకట్టి ఇవ్వడానికే మొగ్గు చూపవచ్చు. ఆ విధంగానూ ఇది ఖజానాను నింపుకునే ఎత్తుగడగానే భావించాల్సి ఉంటుందని సామాజిక వేత్తలు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2021-12-07T07:07:40+05:30 IST