నమస్తే పత్రిక కాదు.. టీఆర్‌ఎస్‌ కరపత్రం

ABN , First Publish Date - 2020-07-29T08:11:20+05:30 IST

నిజాలను నిర్భయంగా రాసే ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై అభాండాలు వేస్తున్న

నమస్తే పత్రిక కాదు.. టీఆర్‌ఎస్‌ కరపత్రం

  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై అభాండాలా?
  • కరోనా కట్టడిలో సర్కారు తీరు సరికాదు: జీవన్‌రెడ్డి


జగిత్యాల/హైదరాబాద్‌/సత్తుపల్లి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): నిజాలను నిర్భయంగా రాసే ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై అభాండాలు వేస్తున్న నమస్తే తెలంగాణ పత్రిక కాదని, టీఆర్‌ఎస్‌ కరపత్రమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కరోనా లెక్కల్లో వాస్తవాలను వెలికి తీసేందుకు ప్రయత్నించిన ‘ఆంధ్రజ్యోతి’పై టీఆర్‌ఎస్‌ పత్రిక అడ్డగోలు కథనం ప్రచురించడంపై పలువురు నేతలు ‘నమస్తే తెలంగాణ’ను ప్రశ్నిస్తున్నారు. మంగళవారం జీవన్‌రెడ్డి జగిత్యాలలో ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. కరోనా పరీక్షలు, పాజిటివ్‌ కేసుల సంఖ్యను తక్కువగా చూపించడంతో ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ వాస్తవాలను వెలికితీస్తే నిజాలు బయటపడ్డాయని గుర్తుచేశారు. నమస్తే తెలంగాణ ఆ పని చేయదని, ఇతరులు చేస్తే ఓర్వదన్నారు. ప్రభుత్వం కరోనా మరణాలను దాస్తుందన్నారు. ప్రజల మనోభావాలకు ఆంధ్రజ్యోతి ఓ వేదికనే నమ్మకం కలిగిందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ చెప్పారు.  


లెక్కలకు, వాస్తవాలకు పొంతనేదీ: నారాయణ

ప్రభుత్వం రోజువారీగా చూపిస్తున్న లెక్కలకు, వాస్తవాలకు ఎక్కడా పొంతన ఉండడం లేద ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. కరోనా మృతుల సంఖ్యకు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’ రాసిన కథనం హైకోర్టులో ప్రస్తావనకు రావడంపై ఆయన మాట్లాడారు. కరోనా మరణాలకు సంబంధించి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. కరోనా లెక్కలపై ప్రభుత్వం చెబుతున్న వివరాలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన లేదని, వాస్తవ పరిస్థితిని ‘ఆంధ్రజ్యోతి’ కళ్లకు కట్టిందని పొంగులేటి అన్నారు. కరోనా మరణాలకు సంబంధించి ప్రభుత్వం తన బాధ్యతను గుర్తించేలా హైకోర్టు ప్రస్తావనలు ఉన్నాయని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. 


సీఎంకు నవ్వులాటగా ఉంది

ప్రజల ఆరోగ్యమంటే సీఎం కేసీఆర్‌కు నవ్వులాటగా ఉంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైర్‌సపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి సీఎం కేసీఆర్‌ అనాలోచిత విధానాలే కారణం. ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వం భవిష్యత్‌లో ప్రజల ప్రాణాలను ఎలా కాపాడుతుంది. రాష్ట్రంలో వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి.- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క


‘ఆంధ్రజ్యోతి’కి అభినందనలు

కరోనా విషయంలో వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొచ్చిన ఆంధ్రజ్యోతికి ప్రత్యేక అభినందనలు. ఆంధ్రజ్యోతి కథనానికి ప్రభుత్వ అధికారిక పత్రిక జవాబులాగా రాసింది. అందులోని లోపాలు, వాస్తవ సంఖ్యలో తేడాలు, ఆటోలు, కార్లను అంబులెన్స్‌లుగా చూపెట్టిన విషయాలను కూడా మంగళవారం ఆంధ్రజ్యోతి మరోసారి ఎత్తిచూపింది. ఈ కథనంతోనైనా ప్రభుత్వంలో మార్పు రావాలి. - కోదండరాం, టీజేఎస్‌ అధ్యక్షుడు.

Updated Date - 2020-07-29T08:11:20+05:30 IST