విద్యార్థులకు పాఠాలెలా?

ABN , First Publish Date - 2021-01-21T07:30:12+05:30 IST

‘‘రాష్ట్రంలోని 35 కేంద్రీయ విద్యాలయాల్లో 128 ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేయకపోవడంతో విద్యాబోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి’’ ..రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌

విద్యార్థులకు పాఠాలెలా?

రాష్ట్ర విద్యా సంస్థల్లో బోధన సిబ్బంది కొరత

పాఠశాల విద్యలోనే 25వేల పోస్టులు ఖాళీ

విశ్వవిద్యాలయాల్లో సగానికి పైగా ఖాళీలే

జూనియర్‌ కాలేజీల్లో 1565.. 

డిగ్రీ కాలేజీల్లో 900

గెస్ట్‌ లెక్చరర్ల నియామకమూ లేదు

పాలిటెక్నిక్‌లలో 50 శాతం ఖాళీ


హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలోని 35 కేంద్రీయ విద్యాలయాల్లో 128 ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేయకపోవడంతో విద్యాబోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి’’ ..రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ ఇటీవలే కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌కు రాసిన లేఖలో పేర్కొన్న విషయాలివి. నిబంధనల ప్రకారం ప్రతి విద్యాసంస్థలో 35 మంది బోధన సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం 31 మంది చొప్పున ఉన్నారు. ఈ లెక్కన ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో నలుగురు మాత్రమే తక్కువగా ఉన్నట్టు. కానీ.. రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఇంటర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, సాంకేతిక విద్య,బీఈడీ, డీఈడీ, ఐటీఐ.. ఇలా ప్రతి విద్యాసంస్థనూ పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఖాళీలున్నాయి. అనేక కళాశాలల్లో సగం మంది సిబ్బంది కూడా లేరు. రాష్ట్ర విద్యాసంస్థలతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉన్న కేంద్రీయ విద్యాలయాల గురించి మాట్లాడుతున్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ ఒకసారి రాష్ట్ర విద్యాసంస్థల్లో ఖాళీలపైనా దృష్టి సారించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీలను పరిశీలిస్తే.. 


పాఠశాల విద్యలో...

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 25 వేలకు పైగా ఖాళీలున్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటినుంచో కోరుతున్నా వారి విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. తెలంగాణ ఆవిర్భవించాక 2017లో ఇచ్చిందే ఏకైక నోటిఫికేషన్‌. అందులో టీఆర్టీ ద్వారా 8792 పోస్టులు భర్తీ చేశారు. ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌లు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు.. ఇలా పాఠశాల విద్యలో అన్ని స్థాయుల్లో వేలాది సంఖ్యలో ఖాళీలున్నాయి. ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 13 వేల మందిని విద్యావాలంటీర్లుగా నియమించారు. 


జూనియర్‌ కాలేజీల్లో..

రాష్ట్రవ్యాప్తంగా 404 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలుండగా.. మొత్తం 5800 సిబ్బంది అవసరం. ఇందులో రెగ్యులర్‌ 800 మంది మాత్రమే ఉండగా.. కాంట్రాక్ట్‌, ఎంటీఎస్‌ 3500 వరకు ఉన్నారు. 1565 గెస్ట్‌ లెక్చరర్లు ఉండగా.. ఈసారి వారిని పునరుద్ధరించలేదు. అనేక గ్రామీణ కాలేజీల్లో ఎక్కువగా ఉండేది గెస్ట్‌ ఫ్యాకల్టీనే. వీరు లేకపోవడంతో ఈసారి ఇంటర్‌ బోధనపై ప్రభావం పడనుంది.


కోర్సులు సరే.. నియామకాలేవీ? 

ఈసారి అన్ని డిగ్రీ కాలేజీల్లో చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబిసీఎ్‌స)ను ఘనంగా అమలుచేసిన ప్రభుత్వం అందుకు తగ్గట్టు బోధనా సిబ్బందిని నియమించడంలో మాత్రం విఫలమైంది. సంప్రదాయ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు ఈసారి అనేకమంది కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సును ఎంచుకున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో కంప్యూటర్‌ సైన్స్‌ ఫ్యాకల్టీ ఉండాల్సి ఉంది. కాని 123 ప్రభుత్వ కాలేజీలకు కేవలం 10 మంది రెగ్యులర్‌ మాత్రమే ఉండగా.. కొన్నిచోట్ల మాత్రం కాంట్రాక్ట్‌ ఫ్యాకల్టీని తీసుకున్నారు. అలాగే ఈసారి కొత్తగా బీఎస్సీ (డేటా సైన్స్‌) కోర్సును ప్రవేశపెట్టగా.. ఈ కోర్సును బోధించేందుకు అసలు ఫ్యాకల్టీనే లేకపోవడం గమనార్హం. డిగ్రీ కాలేజీల్లో చివరిసారిగా 2013లో ఉద్యోగాల భర్తీ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 123 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుండగా.. 9 యూనివర్సిటీ కాలేజీలు, 41 ప్రైవేటు ఎయిడెడ్‌ కాలేజీలు ఉన్నాయి. అన్ని కాలేజీల్లో కలిపి 3 వేల మంది బోధన సిబ్బంది ఉండాల్సి ఉండగా.. 1200 రెగ్యులర్‌, 900 మంది కాంట్రాక్ట్‌తో కలిపి 2100 మంది ఉన్నారు. మరో 900 మందిని గెస్ట్‌ లెక్చరర్లుగా తీసుకునేవారు. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో పనిచేసేందుకు రెగ్యులర్‌ ఫ్యాకల్టీ ఆసక్తి చూపించకపోవడంతో అత్యధికులు కాంట్రాక్ట్‌, గెస్ట్‌ ఫ్యాకల్టీలే ఉంటారు. ఈసారి వీరిని ఇంకా నియమించకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీలపై ప్రభావం పడనుంది. 


పాలిటెక్నిక్‌ కాలేజీల్లో..

సాంకేతిక విద్యలో కీలకమైన పాలిటెక్నిక్‌ కాలేజీల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 54 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలున్నాయి. ఒక్కో కాలేజీలో కనీసం 5 బ్రాంచ్‌లు ఉన్నాయి. ప్రతి బ్రాంచ్‌లోనూ ఐదుగురు లెక్చరర్లు, ఒక సీనియర్‌ లెక్చరర్‌, ఒక విభాగాధిపతి చొప్పున (5+1+1=7) మొత్తం ఏడుగురు ఉండాలి. కానీ 48 కాలేజీల్లో ఉండాల్సిన సిబ్బందిలో సగం కంటే తక్కువగా ఉన్నారు. 2009-10లో రాష్ట్రంలో కొత్తగా 13 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలు మంజూరు చేయగా వాటిలో అనేక కాలేజీల్లో ఇంతవరకూ పోస్టులే మంజూరు చేయలేదు. దీంతో తాత్కాలిక ప్రాతిపదికన ఒప్పంద కార్మికులతో నెట్టుకొస్తున్నారు. గ్రామీణ, జిల్లా కేంద్రాల్లో పనిచేసేవారిలో అత్యధికులు పదోన్నతులు, డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌కు రావడంతో ఖాళీలు సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఉదాహరణకు.. వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఏడుగురు సిబ్బందికిగాను ఐదుగురే ఉండేవారు. అక్కడి హెచ్‌వోడీహైదరాబాద్‌కు డిప్యూటేషన్‌పై రాగా, ఒక లెక్చరర్‌ బదిలీపై రాజధానికి వచ్చారు. మరో లెక్చరర్‌ ఒక ప్రజాప్రతినిధికి పీఏగా వెళ్లారు. దీంతో అక్కడ ఇప్పుడు ఇద్దరు సిబ్బంది మాత్రమే మిగిలారు. ఇదొక్కటే కాదు అనేక కాలేజీల్లో ఇలాంటి సమస్యలే ఉన్నాయి. ఫిబ్రవరి-1 నుంచి తరగతులు ప్రారంభమైతే అనేక పాలిటెక్నిక్‌ కాలేజీల్లో సిబ్బంది కొరతే సమస్యగా మారనుంది. అన్ని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో సివిల్‌ విభాగంలో 70 శాతం ఖాళీలున్నాయి. ఇందులో చివరిసారిగా 2012-13లో  నియామకాలు జరిగాయి. 


వర్సిటీల్లో సగానికి పైగా..

రాష్ట్రవ్యాప్తంగా 10 విశ్వవిద్యాలయాలకు గత రెండేళ్లుగా ఉపకులపతుల పోస్టులు ఖాళీగా ఉండగా.. ఇన్‌చార్జులుగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను నియమించారు. ఇక బోధన సిబ్బంది లేకపోవడంతో విద్య గాడితప్పుతోంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఓయూలో అనేక డిపార్ట్‌మెంట్లలో బోధన సిబ్బంది సగం మంది కూడా లేరు. క్యాంప్‌సలో కీలకమైన ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌ విభాగాల్లో ఉండాల్సిన సిబ్బందిలో మూడోవంతు కూడా లేరు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఐదేళ్ల క్రితం 415 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి లభించినా.. ఇంతవరకూ నియామకాల్లేవు. ఓయూలో మొత్తం 3వేలకు పైగా ఖాళీలున్నాయి. కాకతీయ వర్సిటీలో ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు 403 ఉండాలి. కానీ, 108 మాత్రమే ఉన్నాయి. మొత్తం వర్సిటీలో 73 శాతం ఖాళీలున్నాయి. తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, జేఎన్‌టీయూ, అంబేడ్కర్‌, జేఎన్‌ఏఎ్‌ఫఏయూ.. ఇలా ఏ వర్సిటీ చూసినా సగానికి పైగా ఖాళీలున్నాయి. వర్సిటీల్లో 1061 పోస్టుల భర్తీకి మూడేళ్ల క్రితం నోటిఫికేషన్‌ ఇచ్చినా ఇంతవరకూ జరగలేదు.

Updated Date - 2021-01-21T07:30:12+05:30 IST