బడా కంపెనీలకు పాఠాలు చెబుతాడు

ABN , First Publish Date - 2021-06-09T05:34:18+05:30 IST

ఖాకీ డ్రెస్సు... నుదుటున విభూది బొట్టు... పద్ధతిగా ముస్తాబై ఆటోలో కూర్చొంటాడు. వెనక కాదు... ముందు సీటులో! సొంత వ్యాపారం ఒకటి పెట్టాలనుకున్నాడు.

బడా కంపెనీలకు పాఠాలు చెబుతాడు

ఖాకీ డ్రెస్సు... నుదుటున విభూది బొట్టు... 

పద్ధతిగా ముస్తాబై ఆటోలో కూర్చొంటాడు. 

వెనక కాదు... ముందు సీటులో! సొంత వ్యాపారం ఒకటి పెట్టాలనుకున్నాడు. అంత సొమ్ము లేక నాన్న... అన్నయ్యలు నడిచిన మార్గాన్నే ఎంచుకున్నాడు. అవడానికి ఆటోడ్రైవరే!

చదివింది పన్నెండో తరగతి లోపే!

కానీ ‘కస్టమర్లను ఎలా ఆకట్టుకోవాలో’ బడా కార్పొరేట్‌ కంపెనీలకు పాఠాలు చెబుతాడు. 

పేరు అన్నాదురై... ఉండేది చెన్నై.

‘ఆటో అన్న’గా సుపరిచితుడైన అతడి జర్నీ ఇది... 


అన్నాదురై... దేని గురించైనా అనర్గళంగా మాట్లాడేస్తాడు... స్టార్టప్స్‌, కొత్త ఆవిష్కరణలు, వైరల్‌ మార్కెటింగ్‌ చిట్కాలు, ఫైనాన్షియల్‌ న్యూస్‌ డైలీలు, ఆఖరికి స్టీఫెన్‌ హాకింగ్స్‌ ‘బ్రీఫ్‌ ఆన్సర్స్‌ టు ది బిగ్‌ క్వశ్చన్స్‌’ ఏదైనా సరే! తన ఆటో ఎక్కినవారు అవాక్కయ్యేలా చేయడం అతడికి అలవాటే! అంతేకాదు... కస్టమర్లను ఎలా చూసుకోవాలో, ఎలా గౌరవించాలో అతడి కంటే ఎక్కువగా ఏ కార్పరేట్‌ కంపెనీకీ తెలియదు. ఇది ఎవరో చెప్పిన మాటలు కాదు... పెద్ద పెద్ద కార్పొరేట్లు ఇచ్చిన కితాబు. అన్నాదురై ఏమిటో తెలియాలంటే అతడి ఆటో ఎక్కాలి. 


ప్రయాణం ఆనందమయం... 

పైకి చూడ్డానికి సాధారణ ఆటో... పసుపు, ఆకుపచ్చ రంగుల కాంబినేషన్‌లో! ఒక్కసారి లోపలికి అడుగు పెడితే అది ఊహలకందని మరో ప్రపంచం. రకరకాల మ్యాగజైన్లు, పుస్తకాలు, ల్యాప్‌టాప్‌, ట్యాబ్స్‌, మినీ టెలివిజన్‌, స్నాక్స్‌, చల్లని పానీయాలు... అందులో అన్నీ ఉంటాయి. ఇది కరోనాకు ముందు మెనూ! తరువాత వ్యక్తిగత పరిశుభ్రత కోసం మాస్క్‌లు, శానిటైజర్లు కూడా వచ్చి చేరాయి. బడికి వెళ్లే విద్యార్థి నుంచి రిటైర్‌ అయిన వృద్ధుల వరకు అందరూ ఉపయోగించుకొనేలా, ప్రయాణించినంతసేపు బోర్‌ కొట్టకుండా ఆస్వాదించేలా తన ఆటోను డిజైన్‌ చేశాడు. అలాగని అదనపు చార్జీలు ఏమీ బాదడు. ఇవన్నీ ఉచితం! కార్పొరేట్‌ భాషలో చెప్పాలంటే కాంప్లిమెంటరీ! కస్టమర్లను ఆకట్టుకోవడానికి... అంతే! 


రాత్రికి రాత్రి సెలబ్రిటీ... 

సరిగ్గా ఏడేళ్ల కిందట అన్నాదురై పేరు మారుమోగిపోయింది. రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయాడు. ఆ నోటా ఈ నోటా అన్నాదురై గురించి తెలుసుకున్న ఓ పెద్ద కార్పొరేట్‌ కంపెనీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి తన అనుభవాలను చెప్పాలని ఆహ్వానించింది. కిక్కిరిసిన హాలు... ఎదురుగా తలపండిన వ్యాపారస్తులు... వేదికనెక్కి అన్నాదురై తన ఆటో ఎక్కిన ప్యాసింజర్లను ఎలా చూసుకొంటాడో, ఇంకా ఏమేం చేయాలనుకొంటున్నాడో విడమరిచి చెప్పాడు. ఆ రోజు నుంచి అతడు ఎందరికో సుపరిచితుడయ్యాడు. కస్టమర్లను ఆకర్షించడమే కాదు, వారి మనసు గెలుచుకోవడం ఎలాగో ‘వొడాఫోన్‌, హ్యుండయ్‌, టయోటా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వంటి పెద్ద పెద్ద సంస్థలు, ఐఐటీ, ఐఎస్‌బీ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో పాఠాలు చెప్పాడు. 


డిగ్రీ కూడా లేదు... 

తమిళనాడులోని తంజావూర్‌ జిల్లా పెరవురాని అన్నాదురై సొంత ఊరు. అతడికి నాలుగేళ్లప్పుడు వాళ్ల కుటుంబం చెన్నైకి వచ్చి స్థిరపడింది. అన్నాదురై తండ్రి, అన్నయ్యలు ఆటో డ్రైవర్లు. కానీ తను వారిలా జీవించానుకోలేదు. వ్యాపారవేత్త కావాలనుకున్నాడు. దానివల్ల తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులను తరిమేయవచ్చనుకున్నాడు. కానీ... ‘‘అవే ఆర్థిక ఇబ్బందులు నా లక్ష్యానికి అడ్డుకట్ట వేశాయి. ఫీజు కూడా కట్టలేక పన్నెండో తరగతిలోనే చదువు మానేసి, పనికి వెళ్లాల్సి వచ్చింది. ఎవర్నో నిందించే కంటే నేను చేస్తున్న వృత్తిలోనే నా కలను నెరవేర్చుకొనే మార్గాలు అన్వేషించాను. ముందుగా ఆటో వెనక సీట్లో న్యూస్‌ పేపర్లు పెట్టాను. తరువాత ఒక్కొక్కటిగా సేవలు పెంచుకొంటూ పోయాను’’ అంటాడు అన్నాదురై. 


అతడికి కస్టమరే కింగ్‌... 

ఈ యువ ఆటోడ్రైవర్‌ నమ్మిన సిద్ధాంతం ఇది. ఏ వ్యాపారానికైనా అంతిమ లక్ష్యం కస్టమర్‌ను సంతోషపెట్టి, సంతృప్తి పరచడమేనంటాడు. అందుకే వారికి బోర్‌ కొట్టకుండానే కాదు, ఆకలేస్తే శ్నాక్స్‌, జ్యూస్‌లు, అవసరానికి వైఫై కనెక్షన్‌ అందుబాటులో ఉంచుతాడు. మాట కలుపుతాడు. ఎన్నో విషయాలపై చర్చిస్తాడు. ‘‘కస్టమర్ల మనసు గెలుచుకోవడం ఎలా అని ఆలోచించడం మొదలుపెట్టినప్పటి నుంచి వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకున్నాను. నా ఆటో ఎక్కేవారి అభిప్రాయాలు తీసుకొంటూ, అందులో నాకు సాధ్యమైన సౌకర్యాలు కల్పిస్తున్నాను. చాలామంది ఎంతో గౌరవంగా మాట్లాడతారు’’ అంటున్న అన్నా కస్టమర్లతో ఎకానమీ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ వరకు అన్నీ ముచ్చటిస్తాడు. 


క్యాష్‌బ్యాక్‌... లక్కీ డిప్‌...  

అతటి దృష్టిలో ఆటో రైడ్‌ అంటే కేవలం ప్యాసింజర్లను ఒక చోట నుంచి మరోచోటికి చేరవేయడమొక్కటే కాదు. అంతకంటే ఎక్కువ. ‘‘నగరంలో తరచూ ట్రాఫిక్‌ జామ్స్‌ ఉంటాయి. మాటి మాటికీ బండికి బ్రేక్‌లు పడుతుంటే ప్యాసింజర్‌ చికాకు పడతాడు. అలాంటి వారి కోసమే వైఫై. ఓసారి ఓ కస్టమర్‌ సమయానికి ల్యాప్‌టాప్‌ లేక ఇబ్బంది పడ్డాడు. తరువాతి రోజు నుంచి అది నా ఆటోలో ఉంది. అలాగే స్వైపింగ్‌ మిషన్‌ కూడా! ఇలా గ్యాడ్జెట్స్‌ పెట్టడం నాకూ కలిసొచ్చింది.




ఆటోలో గ్యాడ్జెట్స్‌ పెట్టడం నాకూ కలిసొచ్చింది. ఆటో ఎక్కినవారు చాలామంది నాతో సెల్ఫీలు దిగారు. అవి సామాజిక మాధ్యమాల్లో తిరిగి తిరిగి నన్ను పాపులర్‌ చేశాయి. ఫలితంగా బిజినెస్‌ బాగా పెరిగింది. కార్పొరేట్‌ కంపెనీల్లో పాఠాలు చెప్పే స్థాయికి తీసుకువెళ్లింది. ఇప్పుడు నా ఆటో కోసమే వేచి చూసేవారు, నా పాఠాలు వినాలనుకొనేవారు ఎంతో మంది ఉన్నారు. అది చాలు నాకు. 


ఆటో ఎక్కినవారు చాలామంది నాతో సెల్ఫీలు దిగారు. అవి సామాజిక మాధ్యమాల్లో తిరిగి తిరిగి నన్ను పాపులర్‌ చేశాయి. ఫలితంగా బిజినెస్‌ బాగా పెరిగింది. కార్పొరేట్‌ కంపెనీల్లో పాఠాలు చెప్పే స్థాయికి తీసుకువెళ్లింది. ఇప్పుడు నా ఆటో కోసమే వేచి చూసేవారు, నా పాఠాలు వినాలనుకొనేవారు ఎంతో మంది ఉన్నారు. అది చాలు నాకు’’ అంటున్న అన్నాదురై రెగ్యులర్‌గా తన ఆటో ఎక్కేవారికి లక్కీ డిప్‌లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు కూడా ఇస్తున్నాడు. విదేశీయుల కోసం ఎయిర్‌పోర్ట్‌ నుంచి అడ్వాన్స్‌ బుకింగ్‌ కూడా పెట్టాడు. అతడి సగటు నెల ఆదాయం రూ.1.18 లక్షలు. అందులో రూ.19 వేలు కస్టమర్లను సంతోషపెట్టే అదనపు సేవలకు ఖర్చవుతాయి. ఇక మహిళ, బాలల దినోత్సవం వంటి ప్రత్యేక రోజుల్లో రైడ్స్‌ ఉచితం. టీచర్లకైతే ఏరోజైనా ఉచితమే! ‘‘ఎందుకంటే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు... అందర్నీ తయారు చేసేది గురువులే కదా! వాళ్లంటే నాకు గౌరవం’’ అంటున్న అన్నాదురైలో వ్యాపార దృక్పథమే కాదు... సామాజిక స్పృహ కూడా ఉంది. అందుకే అతడికి అభినందనలకు, అవార్డులకు కొదవలేదు. 

Updated Date - 2021-06-09T05:34:18+05:30 IST