ఓఆర్‌ఆర్‌ను లాంగ్‌ లీజుకిచ్చేద్దాం!

ABN , First Publish Date - 2021-06-13T08:39:47+05:30 IST

ఔటర్‌ రింగ్‌ రోడ్డును లీజుకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఓఆర్‌ఆర్‌ను లాంగ్‌ లీజుకిచ్చేద్దాం!

  • 25-30 ఏళ్లు గుత్తకు ఇచ్చేందుకు కసరత్తు
  • టీఓటీ పద్ధతిలో ఏకకాలంలో లీజుకు..
  • ఒకేసారి 6వేల కోట్ల ఆదాయమే లక్ష్యం
  • నివేదిక అందజేసిన ట్రాన్సాక్షన్‌ అడ్వైజర్లు
  • సర్కార్‌కు హెచ్‌ఎండీఏ డీపీఆర్‌ అందజేత
  • త్వరలోనే తీరనున్న ఔటర్‌ అప్పులు
  • ఆదాయ వనరుగా మార్చుకునే యోచన


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగ్‌ రోడ్డును లీజుకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌(టీఓటీ) పద్ధతిన ఏక కాలంలో ఏదైనా సంస్థకు గుత్తకు ఇచ్చి ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే ఔటర్‌ ఆదాయ, వ్యయ అంచనాలపై ట్రాన్సాక్షన్‌ అడ్వైజర్లను నియమించగా.. వారు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లీజు ద్వారా ఏక మొత్తంలో ఒకేసారి రూ.6వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని వారు నివేదించినట్లు తెలిసింది. అందుకనుగుణంగా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో టీఓటీ పద్ధతి, టెండర్‌ ప్రక్రియ తదితర వివరాలతో డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ 158 కి.మీ ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)ను హెచ్‌ఎండీఏ నిర్మించింది. దీనిపై రోజూ 1.20 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. వీటి నుంచి టోల్‌ వసూలు చేయడానికి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 2019 ఫిబ్రవరిలో ఓ సంస్థను ఏర్పాటు చేశారు.


 ఆ సంస్థ టోల్‌ వసూళ్లు, నిర్వహణ భారాన్ని భరించి నెలకు రూ.24.29 కోట్లు హెచ్‌ఎండీఏకు చెల్లిస్తోంది. ఔటర్‌పై టోల్‌తో ఇతర రూపాల్లో భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అది కాలక్రమంలో పెరుగుతూనే ఉంటుంది. ఈ ఆదాయాన్ని చూపి ఓఆర్‌ఆర్‌ నిర్వహణను పూర్తిగా ఏదైనా సంస్థకు లీజుకిచ్చేసి, ఒకేసారి ఆదాయాన్ని రాబట్టేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రూపొందించింది. ఓఆర్‌ఆర్‌ను టీఓటీ పద్ధతిలో 25-30 ఏళ్ల వరకు లీజుకిస్తారు. టెండర్‌ దక్కించుకున్న సంస్థ టోల్‌ వసూలు, రహదారుల మరమ్మతు, ఐదేళ్లకోసారి బీటీ రోడ్ల నిర్మాణం తదితర పనులు చేయాల్సి ఉంటుంది. దీంతో హెచ్‌ఎండీఏకు నిర్వహణ భారం కూడా తొలగిపోతుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లీజు కాలానికి నిర్ణయించిన మొత్తం నగదును ఒప్పందం ప్రకారం ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. ఈ లీజు ద్వారా సమకూరే నిధులతో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పలు ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అనుసరిస్తున్న నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ).. జాతీయ రహదారులను లీజుకిచ్చి, ఒకేసారి ఆదాయాన్ని పొందుతోంది.


రూ.6వేల కోట్ల ఆదాయమే లక్ష్యం

ఔటర్‌ను లీజుకివ్వడం ద్వారా వచ్చే ఆదాయ, వ్యయాలపై నివేదిక కోసం ట్రాన్సాక్షన్‌ అడ్వైజర్లుగా లీ అసోసియేట్స్‌ సౌత్‌ ఏషియా, క్రిసిల్‌ అనే సంస్థలను గతంలో హెచ్‌ఎండీఏ నియమించింది. భవిష్యత్‌లో ఔటర్‌పై ట్రాఫిక్‌ పెరుగుదల, టోల్‌ పెంపులు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆయా సంస్థలు హెచ్‌ఎండీఏకు నివేదికను అందజేశాయి. దీని ఆధారంగా హెచ్‌ఎండీఏ డీపీఆర్‌ను రూపొందించింది. యేటా ఔటర్‌పై వస్తున్న ఆదాయం, ఖర్చులను ఆధారంగా చేసుకుని 30 ఏళ్ల లీజు ద్వారా రూ.6 వేల కోట్ల వరకు ఆదాయం పొందవచ్చని హెచ్‌ఎండీఏ ఇంజినీర్లు నివేదించినట్లు తెలిసింది.


త్వరలోనే తీరనున్న ఔటర్‌ అప్పులు..

జైకా నిధులతో హెచ్‌ఎండీఏ ఓఆర్‌ఆర్‌ను నిర్మించింది. ఈ రుణం తీర్చేందుకు యేటా రూ.312కోట్ల వరకు హెచ్‌ఎండీఏ చెల్లిస్తోంది. వచ్చే ఏడాది డిసెంబరు వరకు ఈ అప్పు దాదాపు తీరిపోతుంది. అయితే ఓఆర్‌ఆర్‌ను లీజుకిచ్చి, ఆదాయం పొందాలని నాలుగేళ్ల నుంచే హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తోంది. అప్పటి కమిషనర్‌ చిరంజీవులు నేతృత్వంలో ఔటర్‌ను లీజుకిచ్చేందుకు గ్లోబల్‌ సంస్థలను రంగంలోకి దించేందుకు కసరత్తు చేశారు. అయితే ట్రాన్సాక్షన్‌ అడ్వైజింగ్‌ కమిటీ నివేదిక, డీపీఆర్‌ రూపకల్పన, విదేశాల్లో అధ్యయనం తదితర అంశాల వల్ల ఆలస్యమైంది. 

Updated Date - 2021-06-13T08:39:47+05:30 IST