పంచాయతీల్లో సత్తా చాటుదాం

ABN , First Publish Date - 2021-01-26T09:00:12+05:30 IST

‘‘రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి. ఇరు పార్టీల సమన్వయంతో వీలైనన్ని చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టి గెలవాలి’’ అని జనసేన, బీజేపీ నిర్ణయించాయి.

పంచాయతీల్లో సత్తా చాటుదాం

వీలైనన్ని చోట్ల అభ్యర్థులను నిలుపుదాం

‘స్థానిక’ ఎన్నికలపై జనసేన, బీజేపీ నిర్ణయం


అమరావతి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి. ఇరు పార్టీల సమన్వయంతో వీలైనన్ని చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టి గెలవాలి’’ అని జనసేన, బీజేపీ నిర్ణయించాయి. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఖరారు, స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై హైదరాబాద్‌లో ఇరుపార్టీల నేతల సమావేశం అయ్యారు. ఎన్నికల కమిషనర్‌పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిని సమావేశంలో నేతలు గర్హించారు. ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పరిస్థితులు చూడలేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అన్నారు. విషయాన్ని బీజేపీ అగ్రనాయకుల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల విషయంలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లాలని నేతలు నిర్ణయించారు. సాధ్యమైన చోట్ల ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టాలని అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికలపై మరోసారి ఇరుపార్టీల నేతలు చర్చించాలని నిర్ణయించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలనే అంశంపై కూడా ఇరుపార్టీల నేతలు చర్చించారు. ప్రచారానికి బీజేపి అగ్రనాయకత్వాన్ని ఆహ్వానించడం వంటి విషయాలపై ఒక నిర్ణయానికి వచ్చారు. సమావేశంలో జనసేన అధినేత పవన్‌, పీఏసీ చైర్మన్‌ మనోహర్‌, బీజేపీ ఆ పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు, ఏపీ వ్యవహరాల ఇన్‌చార్జి మురళీధరన్‌, పురందేశ్వరీ, సునీల్‌ దేవధర్‌, మధుకర్‌ పాల్గొన్నారు.


కాపు ప్రతినిధులతో త్వరలో భేటీ: పవన్‌

కాపు కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు రిజర్వేషన్‌ అంశాలపై కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో చర్చిస్తానని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కాపు సంక్షేమ ప్రతినిధులతో కలిసి చర్చించాలని జేఏసీ అధ్యక్షులు, మాజీ హోం మంత్రి చేగొండి హరి రామ జోగయ్య తనను ఒక లేఖ ద్వారా కోరినట్లు తెలిపారు. ఆయన విజ్ఞప్తి మేరకు త్వరలోనే ప్రతినిధుల బృందాన్ని కలుస్తానని చెప్పారు. 72 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులందరికి జనసేన తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలను పవన్‌  తెలియజేశారు. 

Updated Date - 2021-01-26T09:00:12+05:30 IST