Abn logo
Apr 3 2020 @ 00:33AM

ఇదే స్ఫూర్తితో కట్టడి కొనసాగిద్దాం!

ఇంతవరకూ మనం ఏ సమష్టి బాధ్యతతో కరోనా కట్టడికి ప్రయత్నించామో, అదే స్ఫూర్తిని రానున్న రెండు వారాలూ కొనసాగిద్దాం. కరోనా కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, స్పర్శకు స్పందించదు. తాకితే చికిత్స ఉండదు. కాబట్టి, గృహనిర్బంధాన్ని హోమ్ హాలిడేగా మలచుకుందాం. కలసి ప్రతిఘటిద్దాం, కరోనాను జయిద్దాం.


దేవుడి ముందు, చట్టంముందు, న్యాయం ముందు అందరూ సమానులో కాదో తెలియదు గానీ, కరోనా ముందు మాత్రం అందరూ సమానులే అనే సత్యం మనం గ్రహించాము. మందు మాకులేవీ లేని ఈ మహమ్మారికి గృహనిర్బంధమే ఏకైక విరుగుడనీ గ్రహించాము. జాతీయస్థాయిలో విధించబడిన లాక్‌డౌన్‌ను వారం రోజులపాటు ఇళ్ళల్లో గడుపుతూ దాటాము. ఇంకా రెండు వారాలు ఇదే స్ఫూర్తితో, ఇంతే పట్టుదలతో ఈ స్వీయనిర్బంధాన్ని అందరం పాటించాలి.


రానున్న రెండు వారాలూ మనకి మరింత పరీక్షగా మారవచ్చు. మనం ఆహార అలవాట్లు మితంగా చేసుకోవాలి. సాత్విక భోజనం అలవాటు చేసుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకొని అత్యవసర సరుకులు బయటి నుంచి తెచ్చినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం గానీ లేదా స్నానం చేయడం గానీ మేలు. పుస్తకాలు చదవడం, టీవీ వినోదం, నెట్ లో పిల్లల చదువులు, హోమ్ వర్క్, కొంత వ్యాయామం, మ్యూజిక్ వినడం, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురు గ్రంథం సాహిబ్ చదవడం లేదా వినడం ద్వారా బోర్ కొట్టకపోవడమే గాక సమయం సద్వినియోగం అవుతుంది. అలానే కరోనా తర్వాత ఏ వ్యాపారాలు తగ్గుతాయి, ఏయే కొత్త అవకాశాలు ఎక్కువ వస్తవి అని ఫ్యామిలీ బోర్డ్ రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. మీ అభిరుచులను అమలు చేసుకోవడం లాంటి పనులతో ఒక టైం షెడ్యూల్ వేసుకుంటే మంచిది. మగవాళ్లు, పిల్లలు ఇంటి పనుల్లో పాల్గొంటే మంచిది. పిల్లలకు, మగ


వాళ్లకు వంట నేర్చుకునే అవకాశం మళ్లీ రాదు. సోషల్ మీడియాలో మీ క్రియేటివిటీ చూపించడానికి ఇది మంచి అవకాశం. ఒక టైం షెడ్యూల్ ప్రకారం చేతులు కడుక్కోవాలి. బయటి వెళ్తే మాస్కుల కంటే చేతులకు గ్లవ్స్ ఎక్కువ అవసరం. మీ పరిసర ప్రాంతాలలో పేదరికంలో ఉన్నవారికి సహాయపడితే మంచిది. అపార్టుమెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, అలాగే గ్రామాలు తమంతటతాము ఒక కరోనా పర్యవేక్షణ బృందాన్ని తయారు చేసుకుంటే మంచిది. ఒంటరిగా ఉన్నవాళ్లకు, వృద్ధులకు, చాలా పేదరికంలో ఉన్నవారికి అండగా ఉంటే వాళ్లకూ ఒక భరోసా వస్తది. 


ప్రతి రాజకీయ పార్టీకి గ్రామం, బస్తీ నుంచి మొదలుకొని రాష్ట్ర రాజధాని వరకు ఒక వ్యవస్థ ఉంటది. గ్రామ, బస్తీ కమిటీలు, సర్పంచుల నుంచి సీఎం వరకు ఒక నిర్దిష్టమైన వ్యవస్థ ఉంటది. ఇవి మరింత చురుకుగా క్షేత్ర స్థాయిలో పని చేయాలి. గ్రామం, వార్డులు, డివిజన్ వారీగా సామాజిక నిర్బంధం, అత్యవసర వస్తువుల పంపిణీ, అత్యవసర సేవల అందుబాటు జరగాలి. హోమ్ క్వారెంటైన్ ఉన్నవారి పర్యవేక్షణ, నిరుపేదలకు అండదండలు, ప్రభుత్వ నియమాలు అమలు చేసేవిధంగా అవగాహన కలిగించటం జరగాలి. స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో ప్రజలకు అనుసంధానం ఏర్పడితే వాళ్ళల్లో ఒక మానసిక భరోసా కలుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో రాజకీయ నాయకులు వారి విఐపి కల్చర్ పక్కనపెట్టి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే పర్యటిస్తూ, మాస్కులు, గ్లవ్స్ వేసుకుని పని చేయాలి. అప్పుడు వారిని చూసే ప్రజలు కూడా ఈ చర్యల్ని ఆదర్శంగా తీసుకుంటారు. హైదరాబాద్ లో 150 డివిజన్లలో ఉన్న కార్పొరేటర్లు గానీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని ఆశించే అభ్యర్థులు గానీ ప్రజలకు సేవ చేయడానికి ఇదొక మంచి అవకాశం. మీ ఫోన్ నెంబర్ మీ పరిధిలోని ప్రజలకు అందుబాటులోకి తెండి. అత్యవసరం ఉన్నప్పుడు ఆదుకోండి. మేము ఉన్నా ము అని ప్రజలకు ఒక భరోసా కల్పించండి. గ్యాస్, కరెంటు, వాటర్ సమస్యలు ఉన్నప్పుడు వారికి అందుబాటులో ఉండండి.


విదేశాల నుంచి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులది అత్యం త కీలకమైన బాధ్యత. విదేశాల నుంచి వచ్చిన ఇరవై వేల కుటుంబాలు బాధ్యతగా ఉంటే, తెలంగాణ రాష్ట్రంలోని కోటి కుటుంబాలు క్షేమంగా ఉంటవి. రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థ మీ మీదనే ఆధారపడి ఉంటది. జబ్బు లక్షణాలు ఉన్నా లేకున్నా 14 రోజుల వరకు, కొన్ని సందర్భాల్లో 21 రోజుల వరకు మీరు కరోనా వైరస్ ఇతరులకు అంటించే అవకాశం ఉంటది. అందుకే ఇంటికి పరిమితం కండి. కుటుంబ సభ్యులతోనూ దూరం పాటించండి. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉంటది.


నిత్యావసర సరుకులు అందరికీ అందేటట్లు చూడటంలో ప్రభుత్వం మరింత చురుగ్గా వ్యవహరించాలి. ముఖ్యంగా అత్యంత పేదవర్గం, వలస కార్మికులు, ఇళ్లు లేనివారు, యాచకులు ప్రభుత్వానికి ముఖ్య ప్రాధాన్యత కావాలి. స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు, ఇతర కార్పొరేట్ సంస్థల సేవలు వినియోగించుకునేలా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. విధుల వికేంద్రీకరణ ప్రస్తుత అవసరం. ప్రభుత్వం కరోనా సహాయం కోసం ప్రజలకు ఒక యాప్, హాట్ లైన్, వెబ్‌సైట్ అందుబాటులోకి తేవాలి. ఎమర్జెన్సీ మెడికేర్, అంబులెన్స్ వ్యవస్థ, వృద్ధులకు సంబంధించిన సేవలు అవసరం. వైద్య సిబ్బంది పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న ఇంటి ఓనర్లు లేదా కాలనీలకు చట్టపరమైన అవగాహన కల్పించాలి. పరిస్థితి విషమిస్తే వైద్య బృందాలకు సమీప హోటల్స్ వసతి కల్పిస్తే సత్ఫలితాలు ఇస్తది.


ఈ పరిస్థితుల్లో మీడియా మంచి పాత్ర పోషిస్తోంది. విషాద సమయంలో కూడా మనం పంపే మెసేజ్ వినోదభరితంగా, వినూత్నంగా ఉంటే మరింత మంచిది. సెలబ్రిటీలు తమ పనులు తాము చేసుకుంటున్నట్లు వీడియోలు, కుటుంబ సభ్యులందరూ కలిసి ఇంట్లో వర్క్ షేర్ చేసుకుంటున్న దృశ్యాలు, ఇంట్లో పిల్లలు కరోనా గురించి చేసే స్కిట్లు ప్రచారం చేయడం మంచిది. కరోనా నుంచి బయటపడినవారి అనుభవాలు, దృశ్యాలు మీడియా మాధ్యమం ద్వారా ప్రజలకు చేరితే మంచిది. టీవీలలో మీడియా సంస్థలు మంచి ప్రోగ్రామ్స్, సినిమాలు, దేశభక్తి సినిమాలు, అంటువ్యాధి ఆధారిత సినిమాలు, సంఘటిత పోరాట సినిమాలు ప్రచారం చేస్తే, వినోదంతో పాటు ఒక సంఘటిత బాధ్యతకు స్ఫూర్తినిస్తుంది.


ఈ వారం పాటు మనం ఏ సమష్టి బాధ్యతతో కరోనా కట్టడికి ప్రయత్నించామో, అదే స్ఫూర్తిని రానున్న రెండు వారాలూ కొనసాగిద్దాం. ఇందుకలదు అందులేదని సందేహం వలదు ఎందెందు వెదికిన అందందు కరోనా కలదు. కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, స్పర్శకు స్పందించదు. తాకితే చికిత్స ఉండదు. కాబట్టి గృహనిర్బంధాన్ని హోమ్ హాలిడేగా మలచుకుందాం. కలసి ప్రతిఘటిద్దాం, కరోనాను జయిద్దాం.

డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, 

మాజీ ఎం.పి., భోనగిరి

Advertisement
Advertisement
Advertisement