జగన్‌ బెయిల్‌ రద్దు కావాలని న్యాయదేవతను ప్రార్థిద్దాం

ABN , First Publish Date - 2021-07-31T08:38:28+05:30 IST

‘ముుఖ్యమంత్రి జగన్‌ బెయిల్‌ రద్దు కేసుపై ఆగస్టు 25న సీబీఐ కోర్టు ఇవ్వనున్న తీర్పుతో నా పిటిషన్‌కు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉంది

జగన్‌ బెయిల్‌ రద్దు కావాలని న్యాయదేవతను ప్రార్థిద్దాం

ప్రతికూల తీర్పు వస్తే హైకోర్టుకు ఆ తర్వాత ఇంకా పైకోర్టుకు వెళ్తా 

విజయసాయి బెయిల్‌ రద్దుపైనా పిటిషన్‌ 

శాసన మండలి రద్దుకు కృషి చేస్తా : రఘురామ 


న్యూఢిల్లీ, జూలై 30(ఆంధ్రజ్యోతి): ‘ముుఖ్యమంత్రి జగన్‌ బెయిల్‌ రద్దు కేసుపై ఆగస్టు 25న సీబీఐ కోర్టు ఇవ్వనున్న తీర్పుతో నా పిటిషన్‌కు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉంది. అప్పటివరకు న్యాయమే గెలవాలంటూ న్యాయదేవతను ప్రార్థిద్దాం’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడారు. బెయిల్‌ షరతులను జగన్‌రెడ్డి ఏ విధంగా ఉల్లంఘించారో అనేక ఆధారాలతో కళ్లకు కట్టినట్లు కోర్టుకు సమర్పించామని చెప్పారు. ‘ఒకవేళ పొరపాటున నా నమ్మకానికి భిన్నంగా తీర్పు ప్రతికూలంగా వస్తే, హైకోర్టుకు వెళ్తా. అక్కడా న్యాయం జరగకపోతే ఆ పైకోర్టుకి వెళ్తా’ అని ఆయన చెప్పారు. ఏ-1 నిందితుడు జగన్‌రెడ్డికి తోడుగా ఉండేందుకు విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయమని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేస్తానని చెప్పారు. ఏపీలో రాజ్యాంగ విరుద్ధంగా, జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ ప్రీ ప్రైమరీ నుంచే పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలని నిర్ణయించడం బాధాకరమని రఘురామ అన్నారు.  మాతృభాషను చులకన చేస్తున్నారని, రాష్ట్రంలో అసలేం జరుగుతోందని ప్రశ్నించారు. జగన్‌ ఆశయ సాధన  కోసం శాసనమండలి రద్దుకు కృషి చేస్తానన్నారు. ఇందుకోసం కేంద్ర న్యాయశాఖ మంత్రులను కలుస్తానన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. మర్యాద పూర్వకంగానే మంత్రిని కలిశానని, ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులన్నీ వివరించినట్లు తెలిపారు.

Updated Date - 2021-07-31T08:38:28+05:30 IST