అంతా ఆయనే చేశారు!!

ABN , First Publish Date - 2020-05-27T09:01:28+05:30 IST

ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరగడానికి, 12 మంది ప్రాణాలు పోవడానికి అసలు కారణం విశాఖపట్నంలోని ఫ్యాక్టరీస్‌ విభాగమేనని ప్రభుత్వం నియమించిన కమిటీ అభిప్రాయపడింది. ఆ విషయాన్నే తన నివేదికలో

అంతా ఆయనే చేశారు!!

  • ఎల్జీ ప్రమాదానికి డీసీఐదే బాధ్యత
  • ఆయనకే ఫ్యాక్టరీస్‌ విభాగం వత్తాసు
  • పాలిమర్స్‌లో మూడేళ్లుగా తనిఖీల్లేవు
  • చాలా ప్రైవేటు కంపెనీల్లో డ్రిల్‌ లేదు
  • ఆరు నెలల్లో 40 మంది చనిపోయారు
  • ఇప్పటికైనా కదలకపోతే తీవ్రనష్టాలు
  • తేల్చిచెప్పిన ఫ్యాక్టరీస్‌ కమిటీ నివేదిక


విశాఖపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి): ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరగడానికి, 12 మంది ప్రాణాలు పోవడానికి అసలు కారణం విశాఖపట్నంలోని ఫ్యాక్టరీస్‌ విభాగమేనని ప్రభుత్వం నియమించిన కమిటీ అభిప్రాయపడింది. ఆ విషయాన్నే తన నివేదికలో విస్పష్టంగా పేర్కొంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ అధ్యక్షతన ఏర్పాటైన హై పవర్‌ కమిటీకి ఈ నివేదికను రెండురోజుల క్రితమే అందజేసింది. ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదానికి కారణాలు ఏమిటి?, అసలు అక్కడ ఏమి జరిగింది? తదితర అంశాలపై విచారణ చేయడానికి ప్రభుత్వం ఆరు కమిటీలను వేసింది. అందులో ఫ్యాక్టరీస్‌ విభాగం రాష్ట్ర ఉన్నతాధికారులతో కూడా ఓ కమిటీ ఉంది. ప్రమాదం జరిగిన తరువాత వారు ఇక్కడికి వచ్చి అనేక అంశాలపై దృష్టి సారించారు. లోపాలను గుర్తించారు. వాటికి తగిన ఆధారాలను సేకరించారు. అన్నింటినీ గుదిగుచ్చి నివేదికలో పొందుపరిచారు.


ఆయన అజ్ఞానం వల్లే...

ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరగడానికి డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ (డీసీఐ) విశాఖపట్నం అధికారి కేబీఎస్‌ ప్రసాద్‌ నిర్లక్ష్యమే కారణమని కమిటీ నిగ్గు తేల్చింది. పరిశ్రమల్లో రసాయన ప్రమాదాల నివారణకు కలెక్టర్‌ అధ్యక్షతన డిస్ట్రిక్ట్‌ క్రైసిస్‌ గ్రూప్‌ని (డీసీజీ) ఏర్పాటుచేశారు. దానికి డీసీఐ ప్రసాద్‌ సభ్య కార్యదర్శి. ఆయన నిర్లక్ష్యాన్ని ఫ్యాక్టరీస్‌ విభాగం అధికారులే దాచిపెడుతున్నారని కమిటీ ఆరోపించింది. ఇంకా.. 1) రసాయన పరిశ్రమలతోపాటు ఇతర పరిశ్రమల్లోను ఏటా మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలి. ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలి? ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి? అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. గత పదేళ్లలో ఒక్కసారి కూడా ఎల్జీ పాలిమర్స్‌.. వెంకటాపురంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించలేదు. విశాఖపట్నంలో ప్రభుత్వ సంస్థలైన హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, నేవీ వంటివి మాక్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తుండగా, కోరమండల్‌ ఇంటర్నేషనల్‌, ఆంధ్రా పెట్రో కెమికల్స్‌, ఎల్జీ పాలిమర్స్‌ వంటివి ఆ పని చేయడం లేదు. 2)  ఆఫ్‌సైట్‌ ఎమర్జెన్సీ ప్లాన్‌ని ‘డీసీఐ’ తయారుచేయాలి. కంపెనీలో ప్రమాదం వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాన్ని గుర్తించాలి. ప్రజల్ని ఎలా తరలించాలో ఆ ప్లాన్‌లో పొందుపరచాలి. దానిని  ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి యాంటీడోట్స్‌ గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత డీసీఐదే. 3) స్టైరిన్‌ విషవాయువు పీల్చడం వల్ల బాధితులకు దీర్ఘకాలంలో కార్సినోజెనిక్‌ (కేన్సర్‌) వస్తుంది. ఆస్పత్రులకు తరలించేటప్పుడు యాంటీడోట్స్‌ ఉపయోగించలేదు.


తూతూ మంత్రం... చాలాసార్లు అదీ లేదు..

1) డీసీఐ ప్రతి ఏటా పరిశ్రమలను తనిఖీ చేయాలి.  కేబీఎస్‌ ప్రసాద్‌ విశాఖపట్నంలో డీసీఐగా బాధ్యతలు స్వీకరించినప్పటి (2016) నుంచి ఎల్జీ పాలిమర్స్‌లో తనిఖీలు సరిగ్గా జరగలేదు. ఇక్కడ ఇంకో నిబంధన కూడా ఉంది. ఒక ఏడాది స్థానిక జిల్లా అధికారి తనిఖీ చేస్తే, మరుసటి ఏడాది ర్యాండమ్‌గా పొరుగు జిల్లా అధికారి తనిఖీ చేయాలి. 2016లో విశాఖ డీసీఐ ప్రసాద్‌ తనిఖీ చేశారు. అయితే తాను ఏమి లోపాలు గుర్తించారనే నివేదికను సెంట్రల్‌ ఇన్‌స్పెక్షన్‌ సిస్టమ్‌కు అందించలేదు. అలా ఎందుకు ఇవ్వలేదని ఆయనను పై అధికారి అయిన జాయింట్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా ప్రశ్నించలేదు.  2) 2017లో శ్రీకాకుళం డీసీఐ జీవీఎస్‌ నారాయణను ఎల్జీ పాలిమర్స్‌ను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆయన తనిఖీయే చేయలేదు. దీనిని కూడా విశాఖపట్నం జాయింట్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రశ్నించలేదు. 3) 2018లో విజయనగరం డీసీఐ సీహెచ్‌ శైలేంద్రకుమార్‌ను ఎల్జీ పాలిమర్స్‌ తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆయన కూడా తనిఖీ చేయలేదు. దీనిపై విశాఖ జాయింట్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ పల్లెత్తు మాట అనలేదు. మూడేళ్లలో ఒకసారి మాత్రమే తనిఖీ చేశారు. ఆ నివేదిక కూడా ఇవ్వలేదు. 4) 2019లో మళ్లీ విశాఖ డీసీఐ ప్రసాద్‌కే తనిఖీ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఆయన ఈసారి తన తనిఖీని రెండు నుంచి మూడు గంటల్లోనే ముగించారు. తనిఖీ నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని ఆ శాఖాధికారులే వెల్లడించారు. ఏదైనా సౌకర్యం కల్పించాల్సి ఉండి, అది లేకపోతే, దానిని కల్పించడంలో ‘విఫలమయ్యారు’ అని రాయాల్సి ఉండగా, కల్పించాల్సి ఉందని మాత్రమే పేర్కొన్నారని, అది సరైన విధానం కాదని తేల్చారు. పైగా అలాంటి నిర్లక్ష్యాలపై కంపెనీని ప్రాసిక్యూట్‌ చేసే అవకాశం డీసీఐకి ఉంది.  5) సంస్థలో కాంపిటెంట్‌ సూపర్‌వైజర్‌ ఉండాలి. ముంబై సెంట్రల్‌ ల్యాబ్‌ ఇనిస్టిట్యూట్‌ సర్టిఫై చేసిన వ్యక్తే ఆ బాధ్యతల్లో ఉండాలి. కానీ లేరు. 6) ఇండస్ట్రియల్‌ హైజీన్‌లో నిష్ణాతులైన మెడికల్‌ ఆఫీసర్‌ ఉండాలి. ఆయనే యాంటీడోట్స్‌ జాగ్రత్త చేయాలి. అవసరమైనప్పుడు ఉపయోగించాలి. అది కూడా అమలు చేయలేదు.


ప్యాకేజీలపై శ్రద్ధ ప్రాణాలపై లేదు..: ఎల్జీ పాలిమర్స్‌లో అనుకోకుండా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారని, అసలైన కారణం తెలుసుకోవడం లేదని కమిటీ పేర్కొంది. ఫ్యాక్టరీస్‌, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక విభాగాల నుంచి సరైన తనిఖీ విధానాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కమిటీ తేల్చింది. వాళ్లంతా ఏమి జరుగుతుందో చెబుతున్నారే తప్ప, బాధ్యతగల అధికారులుగా పనిచేయలేదని వ్యాఖ్యానించింది. వీరికి ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులతోపాటు ఆ ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ఉందని, కానీ అందుతున్న ‘ప్యాకేజీ’లతో వాటిని విస్మరించారని ఆరోపించింది. కమిటీ తన నివేదికలో కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఎల్జీ పాలిమర్స్‌ కంటే ముందు విశాఖ జిల్లాలో గత ఆరు నెలల్లో చాలా ప్రమాదాలు జరిగాయని పేర్కొంది. ఏసియన్‌ పెయింట్స్‌, అభిజిత్‌ ఫెర్రో అల్లాయిస్‌, అజికో బయోఫోర్‌, విజయశ్రీ ఆర్గానిక్స్‌, స్మైలెక్స్‌ ఫార్మా ప్రమాదాల్లో 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. వీటిపై విచారణ చేయడానికి ప్రభుత్వ నిఘా విభాగాలకు ఇదే సరైన సమయమని సూచించింది. 


కెమికల్‌ నాలెడ్జీయే లేదు..

కేబీఎస్‌ ప్రసాద్‌ను నాలుగేళ్ల కిందట విశాఖపట్నం డీసీఐగా నియమించారు. జీవో నంబరు 189, ఈఎ్‌ఫఈఎస్‌ అండ్‌ టీ (ఎఫ్‌అండ్‌బీ) 25.7.1991కి వ్యతిరేకంగా ఆయనను నియమించారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రెసిడెన్షియల్‌ నిబంధనల ప్రకారం కూడా ఆయన నియామకం సరికాదని తెలిపింది. రసాయన పరిశ్రమలను ఎలా నడపాలో ఆయనకు అనుభవం లేదని వివరించింది. ఎమర్జెన్సీ ప్లాన్‌లు రూపొందించడం, మాక్‌డ్రిల్స్‌ నిర్వహించడం వంటివి ఆయనకు తెలియవని, అందుకే ఆ పనులు చేయలేకపోయారని ఆరోపించింది. డైరెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, కార్మిక శాఖను మేనేజ్‌ చేసుకొని విశాఖపట్నంలో పోస్టింగ్‌ వేయించుకున్నారని పేర్కొంది.

Updated Date - 2020-05-27T09:01:28+05:30 IST