బౌద్ధం... స్వేచ్ఛాకేతనం!

ABN , First Publish Date - 2020-08-14T05:30:00+05:30 IST

ఒక మనిషిని మరొక మనిషిని దోచుకుతినడాన్నీ, ఒకడు మరొకనిపై పెత్తనం చెలాయించడాన్నీ, మనిషి స్వేచ్ఛను హరించి బానిసత్వంలో నెట్టడాన్నీ, కులం, మతం, ప్రాంతం, జాతి పేర్లతో ఒకరు మరొకరిని హీనంగా చూడడాన్నీ బుద్ధుడు అంగీకరించలేదు...

బౌద్ధం... స్వేచ్ఛాకేతనం!

ఒక మనిషిని మరొక మనిషిని దోచుకుతినడాన్నీ, ఒకడు మరొకనిపై పెత్తనం చెలాయించడాన్నీ, మనిషి స్వేచ్ఛను హరించి బానిసత్వంలో నెట్టడాన్నీ, కులం, మతం, ప్రాంతం, జాతి పేర్లతో ఒకరు మరొకరిని హీనంగా చూడడాన్నీ బుద్ధుడు అంగీకరించలేదు. భౌతిక భానిసత్వమైనా, ఆధ్యాత్మిక బానిసత్వమైనా... ఏ బానిసత్వాన్నీ బౌద్ధం ఆమోదించదు. అందుకే  బౌద్ధాన్ని ‘స్వేచ్ఛాకేతనం’గా పిలుస్తారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వం పునాదుల మీద బౌద్ధ సంఘ నిర్మాణం జరిగింది. బౌద్ధ సంఘానికి నియమాలే ఆధారం. ఏ వ్యక్తి పేరు మీదా ప్రపంచంలో ఇప్పటివరకూ ఒక్క బౌద్ధ సంఘం కూడా లేదు. బౌద్ధంలో నియమాలే ఉంటాయి తప్పితే నియంతలు ఉండరు. బుద్ధుడు తన బౌద్ధ సంఘాన్ని అంత గొప్ప ప్రజాస్వామ్య సౌధంగా తీర్చిదిద్దాడు. ఎన్నిక విధానాన్నీ, రహస్య ఓటింగ్‌ పద్ధతినీ బుద్ధుడే ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు.


వ్యక్తి అయినా, సంఘం అయినా, సమాజం అయినా స్వేచ్ఛతోనే నడవాలి. స్వార్థం, ద్వేషం, హింస, దోపిడి, దౌర్జన్యం... వీటన్నిటికీ నియంతృత్వ వైఖరే కారణం. ఆ నియంతృత్వం చివరకు దుఃఖ కారణం కూడా.

బుద్ధుని కాలంలో గణతంత్ర రాజ్యాలు, ఏకకేంద్ర నియంతృత్వ రాజ్యాలు ఉండేవి. బుద్ధుడు అనేకసార్లు గణతంత్ర రాజ్యాల ఔన్నత్యాన్ని కొనియాడాడు. వాటిలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వం నెలకొని ఉండడమే దానికి కారణం. తన కళ్ళముందే గణతంత్ర రాజ్యాలు కుప్పకూలిపోతూ ఉంటే ఆయన బాధపడ్డాడు. వాటిని కాపాడడానికి తన వంతు కృషి చేశాడు. మనుషులు మాత్రమే కాదు... ఈ ప్రపంచంలో ప్రతి జీవీ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలతో బతకాలని ఆయన ఆకాంక్షించాడు.

బుద్ధుడు తన చివరిరోజుల్లో కొన్నాళ్ళు లిచ్ఛవీ గణతంత్ర రాజ్య రాజధాని వైశాలిలో ఉన్నాడు. అప్పటికి ఆయన వయసు ఎనభై ఏళ్ళు. అప్పుడప్పుడు అనారోగ్యం ఇబ్బంది పెడుతూనే ఉంది. వైశాలిలో ఉండగా మరోసారి అనారోగ్యం కలిగింది. విరేచనాలు పట్టుకున్నాయి. భరించలేని కడుపునొప్పి వచ్చింది. మందులు వాడాడు. ధ్యానసాధనలో నొప్పిని భరించాడు. ఇక తాను ఎంతోకాలం జీవించలేనని గ్రహించాడు. భిక్షువులను పిలిచి -


‘‘వెంటనే ప్రయాణం ఏర్పాటు చేయండి. మల్ల గణరాజ్యానికి వెళ్దాం’’ అన్నాడు.

ఆ మరునాడే వారి ప్రయాణం సాగింది. కాలినడకన నెమ్మదిగా బయలుదేరి వైశాలి నగరాన్ని దాటారు. నగరం పొలిమేరలో ఆగి, వెనక్కు తిరగి వైశాలి వైపు పదేపదే చూశాడు బుద్ధుడు. నియంతృత్వ రాజ్యాల మధ్య నిలబడి తన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను కాపాడుకుంటున్న గణరాజ్య రాజధాని అది.

‘‘ఇక వైశాలిని తిరిగి చూడకలేకపోవచ్చు’’ అన్నాడు బుద్ధుడు. ఆ స్వేచ్ఛా సౌధాన్ని అది కనిపించేంతవరకూ చూస్తూ చూస్తూ వెళ్ళిపోయాడు. నడిచే శక్తి లేకపోయినా వేగంగా నడిచాడు. త్వరగా వెళ్ళి మల్లుల రాజ్యానికి చేరాలన్నది ఆయన ఆలోచన. ఆ నగరంలోనే తుదిశ్వాస విడవాలన్నది ఆయన ప్రగాఢ ఆకాంక్ష. 

అలా బయలుదేరిన తరువాత దారిలో చుందుడు పెట్టిన పుట్టకొక్కు ఇగురు (సుకర మర్దవ) తిన్నాక బుద్ధుడి ఆరోగ్యం మరింత క్షీణించింది. నడవలేకపోయాడు. భిక్షువులు డోలీ కట్టి బుద్ధుణ్ణి వేగంగా మల్ల రాజధాని కుశీనగరం పొలిమేరలకు చేర్చారు. అక్కడ ఆపమన్నాడు. రెండు సాల వృక్షాల నీడల మధ్య పడక ఏర్పాటు చేయమన్నాడు (బుద్ధుడు పుట్టింది కూడా సాలవృక్షం కిందనే). ఆ రోజు రాత్రి అక్కడే తథాగతుడు మహాపరినిర్వాణం పొందాడు. స్వేచ్ఛా, స్వాతంత్రాలకు బుద్ధుడు ఎంత విలువనిచ్చాడో దీన్ని బట్టి అర్థమవుతుంది.

‘‘మీరు మన భారత రాజ్యాంగంలో పొందుపరచిన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వం అనేవి ఫ్రెంచి విప్లవం నుంచి స్వీకరించారా?’’ అనే ప్రశ్నకు బోధిసత్వ డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ బదులిస్తూ - ‘‘లేదు. వాటిని బౌద్ధం నుంచి స్వీకరించాను’’ అన్నారు.

బౌద్ధం ఒక స్వేచ్ఛాకేతనం! బుద్ధుడు ఒక స్వాతంత్య్ర శిఖరం. బుద్ధ హృదయం ఒక సౌభ్రాతృత్వ నికేతనం!


స్వాతంత్య్రమే శ్వాసగా...

సిద్దార్థుడి (బుద్ధుడి) చిన్నతనంలో అతని స్నేహితుడు దేవదత్తుడు ఒక హంసను బాణంతో కొట్టాడు. బుద్ధుడు దానికి కట్లుకట్టి, వైద్యం చేసి, రక్షించాడు. ఆ హంస నాదంటే నాది అనుకుంటారు ఇద్దరూ.

‘ప్రాణం తీసిన వాడిది కాదు. ప్రాణం పోసినవాడిదే హంస!’ అని రాజ్య పరిషత్తు తీర్పు చెప్పింది.. అలా ఆ హంస సిద్దార్థుడికి దక్కింది. సిద్దార్థుడు దాన్ని తన మందిరానికి తీసుకువెళ్ళాడు. దానికి పూర్తిగా నయం అయ్యేవరకూ ఒక పంజరంలో ఉంచాడు.

‘‘ఈ హంస బాగుంది! దీన్ని ఇలాగే ఉంచు. మనం రోజూ ఆడుకుందాం’’ అన్నారు తోటి పిల్లలు.

‘‘లేదు. అలా ఉంచడం దాన్ని హింసించడమే! దాని స్వేచ్ఛను హరించడమే!’’ అని చెప్పాడు సిద్దార్థుడు. ఆ హంస గాయాలన్నీ పూర్తిగా మానిన తరువాత, దాన్ని ఆకాశంలోకి ఎగురవేశాడు. 

పరతంత్రాన్ని పీడగా, స్వాతంత్ర్యాన్ని శ్వాసగా భావించిన మహనీయుడిగా బుద్ధుడు ఈ సంఘటనలో మనకు దర్శనమిస్తాడు. 

- బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2020-08-14T05:30:00+05:30 IST