విధ్వంసానికి దారితీసిన మెరుపు ధర్నా

ABN , First Publish Date - 2021-11-24T09:31:18+05:30 IST

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో హైడ్రామా నెలకొంది. గ్రేటర్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించడం లేదంటూ అసంతృప్తిగా ఉన్న బీజేపీ కార్పొరేటర్లు చేసిన మెరుపు ధర్నా తీవ్ర విధ్వంసానికి దారితీసింది.

విధ్వంసానికి దారితీసిన మెరుపు ధర్నా

  • జీహెచ్‌ఎంసీ ఆఫీసులో బీజేపీ కార్పొరేటర్ల వీరంగం
  • తాళం పగులగొట్టి మేయర్‌ చాంబర్‌లోకి..
  • ఫర్నీచర్‌, పూలకుండీలు, అద్దాలు ధ్వంసం
  • జీహెచ్‌ఎంసీ లోగోకు నల్లరంగు పూసి నిరసన
  • మేయర్‌ హటావో.. జీహెచ్‌ఎంసీ బచావో స్టిక్కర్లు
  • జీహెచ్‌ఎంసీ ఫిర్యాదు.. కార్పొరేటర్ల అరెస్టు
  • దురుద్దేశంతోనే దాడి: మేయర్‌ విజయలక్ష్మి
  • ప్రభుత్వమే నడిపిస్తే ఎన్నికలు ఎందుకు? 
  • మునిసిపల్‌ మంత్రి చెప్పినట్లు పనిచేస్తే 
  • పాలకవర్గం ఎందుకు?: బండి సంజయ్‌, డీకే అరుణ


హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో హైడ్రామా నెలకొంది. గ్రేటర్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించడం లేదంటూ అసంతృప్తిగా ఉన్న బీజేపీ కార్పొరేటర్లు చేసిన మెరుపు ధర్నా తీవ్ర విధ్వంసానికి దారితీసింది. మంగళవారం పార్టీ కార్యకర్తలను వెంటబెట్టుకొని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్‌ చాంబర్‌లోకి చొచ్చుకెళ్లిన బీజేపీ కార్పొరేటర్లు అక్కడ విధ్వంసం సృష్టించారు. చాంబర్‌ ఎదుట ఉన్న  పూల మొక్కల కుండీలు, కార్యదర్శి కార్యాలయం వద్ద అద్దాలు, మేయర్‌ చాంబర్‌లోని టేబుల్‌ను ధ్వంసం చేశారు. మేయర్‌ కార్యాలయం వద్ద ఉన్న జీహెచ్‌ఎంసీ లొగో, బోర్డుకు నల్ల రంగు పూశారు. మేయర్‌ పేరుతో ఉన్న బోర్డుకు ‘మేయర్‌ హఠావో.. జీహెచ్‌ఎంసీ బచావో’ అన్న స్టిక్కర్లను అంటించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పేర్లతో ఉన్న బోర్డులు తొలగించారు. జెండా కర్రలతో పొడిచి ఫాల్‌ సీలింగ్‌నూ ధ్వంసం చేశారు. మేయర్‌ చాంబర్‌ తలుపు తాళం పగులగొట్టి లోనికి వెళ్లారు. అంతకుముందు కమిషనర్‌ ప్రవేశ ద్వారం వద్ద పూల కుండీలనూ పగులగొట్టారు. ఉదయం 10:30-11 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. పాలకమండలి కొలువుదీరి పది నెలలైనా కౌన్సిల్‌ మీటింగ్‌ నిర్వహించడం లేదంటూ బీజేపీ కొంత కాలంగా మండిపడుతోంది. 


ఉదయం 9:40 సమయంలో అనుచరులతో కలిసి బీజేపీ కార్పొరేటర్లు కొందరు ఒక్కొక్కరుగా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. 10:30 సమయంలో వాహనాలు పార్కింగ్‌ చేసే గేటు నుంచి అంతా గుంపుగా వస్తూనే జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి మేయర్‌ ప్రవేశించే ద్వారం వద్ద భవనం పైకి రాళ్లు రువ్వారు. మేయర్‌  చాంబర్‌ వద్దకు దూసుకెళ్లి విధ్వంసం సృష్టించారు. బీజేపీ వాళ్లు వస్తున్నారని ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు కమిషనర్‌ ప్రవేశ ద్వారం వద్ద మోహరించారు. మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కార్యాలయంలో లేకపోవడంతో అటు వైపు బీజేపీ కార్పొరేటర్లు వెళ్లరని భావించి.. మేయర్‌ ప్రవేశ ద్వారం వద్ద తక్కువ మంది పోలీసులున్నారు. దీనిని గమనించిన కార్పొరేటర్లు, కార్యకర్తలు ఆ గేటు నుంచి లోనికి వెళ్లి విధ్వంసం సృష్టించారు. కార్పొరేటర్లను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని గోషామహల్‌, రాంగోపాల్‌పేట పోలీ్‌సస్టేషన్లకు తరలించారు. జీహెచ్‌ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


మూడు నెలలకోసారి మీటింగ్‌ 

ఫిబ్రవరి 11, 2021న గ్రేటర్‌ పాలకమండలి కొలువుదీరింది. జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ ప్రకారం ప్రతి మూడు నెలలకోమారు కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలి. తేదీ, సమయాన్ని మేయర్‌ నిర్ణయించాల్సి ఉంటుంది. సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు పది నెలలు కావస్తుండగా ప్రత్యక్షంగా కౌన్సిల్‌ సమావేశం జరగలేదు. దీనిపై ఇప్పటికే పలుమార్లు బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. రెండుసార్లు ప్రయత్నించినా మేయర్‌ కలవకపోవడంతో కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఓ సారి అపాయింట్‌మెంట్‌ ఇచ్చినా కూడా ఆమె, జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి రాలేదు. మరోసారి అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన విజయలక్ష్మి.. తన క్యాంపు కార్యాలయానికి రావాలని వారికి సూచించారు. అక్కడికి వెళ్లని బీజేపీ కార్పొరేటర్లు.. జీహెచ్‌ఎంసీ ఆఫీ్‌సలో కలుస్తామని స్పష్టం చేశారు. గడువు ముగిసి రెండు నెలలైనా మీటింగ్‌ పెట్టలేదనే ఆగ్రహంతో బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. ‘మాతో మేయర్‌ సమావేశం నిర్వహించి ఉంటే ఇదంతా జరిగేది కాదు’ అని బీజేపీ కార్పొరేటర్‌ ఒకరు పేర్కొన్నారు. 


మా ఆఫీసు వద్ద జరగలేదు: లోకేశ్‌కుమార్‌

ప్రధాన కార్యాలయంలో ఇంత విధ్వంసం జరుగగా కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తనకేం పట్టనట్టు వ్యవహరించారు. కమిషనర్‌ ప్రవేశ ద్వారం వద్దా మొక్కల కుండీలు ధ్వంసమయ్యాయి. ప్రజా ఆస్తులు ధ్వంసమైనందున న్యాయపరంగా చర్యలు తీసుకుంటారా? అన్న విలేకరుల ప్రశ్నకు ‘నా కార్యాలయం వద్ద ఏం జరుగలేదు. మేయర్‌ ఆఫీస్‌ వద్ద పగులగొట్టారట వాళ్లు చూసుకుంటారు’ అని లోకేశ్‌ కుమార్‌ సమాధానమిచ్చారు.  


అపాయింట్‌మెంట్‌ ఇచ్చినా రాలేదు

బీజేపీ కార్పొరేటర్లు, వారి అనుచరులు జీహెచ్‌ఎంసీ కార్యాలయం పై దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేయడం హేయమైన చర్య.  ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలు పరిష్కరించుకోవాలి, కానీ ప్రజా ఆస్తులపై దాడి చేయడం సబబు కాదు. మేయర్‌ క్యాంప్‌ కార్యాలయం 24 గంటలూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే పనిచేస్తుంది. వరదలు వచ్చినప్పుడు నేను స్వయంగా లోతట్టు ప్రాంతాలకు వెళ్లి అధికారులను, ప్రజాప్రతినిధులను సమాయత్త పరిచి సహాయ చర్యలు చేపట్టా. కొవిడ్‌ నిబంధనల వల్ల వర్చువల్‌ పద్ధతిలో సర్వసభ్య సమావేశం నిర్వహించాం. ఎమ్మెల్సీ కోడ్‌ ఉన్నప్పుడు మీటింగ్‌ జరుగదని తెలిసీ.. బీజేపీ వాళ్లు దురుద్దేశంతో దాడి చేశారు. దాడి సహించరానిది. కార్పొరేటర్లు ఇలా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం కలిగించాల్సిన ప్రజా ప్రతినిధులు ఇలా ప్రవర్తించడం దురదృష్టకరం. 

-విజయలక్ష్మి, మేయర్‌

Updated Date - 2021-11-24T09:31:18+05:30 IST