IPL 2021: మిస్సవుతున్న ప్రముఖ ఆటగాళ్లు వీరే!
ABN , First Publish Date - 2021-08-22T22:28:00+05:30 IST
కరోనా రెండో దశ విజృంభణ కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లో వచ్చే నెల 19 నుంచి యూఏఈలో
యూఏఈ: కరోనా రెండో దశ విజృంభణ కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లు వచ్చే నెల 19 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే జరిగిన మ్యాచుల్లో కొన్ని జట్లు అద్వితీయ ప్రదర్శన కనబరచగా మరికొన్ని ఒకటి రెండు విజయాలకే పరిమితమయ్యాయి. దీంతో రెండో దశ మ్యాచ్‌లు రంజుగా జరిగే వీలుంది. ఇప్పటికే కొన్ని జట్లు యూఏఈ చేరుకున్నాయి.
మరికొన్ని త్వరలోనే అక్కడ ల్యాండ్ కాబోతున్నాయి. రెండో దశ మ్యాచుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తలమునకలుగా ఉన్నాయి. అయితే, కొన్ని ఫ్రాంచైజీలకు మాత్రం రెండో దశ మ్యాచ్‌లు తలనొప్పిగా మారాయి. వివిధ కారణాల వల్ల కొందరు ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీలకు హ్యాండివ్వగా, మరికొందరు మాత్రం తమ జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అందుబాటులో ఉండడం లేదు. ఇంకొందరు గాయాల కారణంగా దూరం కావడంతో వారి స్థానాలను భర్తీ చేసుకోవడం ఫ్రాంచైజీలకు తలకుమించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రెండో దశకు దూరమవుతున్న ప్రముఖ ఆటగాళ్లెవరో ఓ లుక్కేద్దాం!
పాట్ కమిన్స్
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్పీడ్‌స్టర్ వ్యక్తిగత కారణాలతో రెండో దశ మ్యాచుల్లో ఆడడం లేదు. కమిన్స్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బేనని భావిస్తున్నారు.
జోస్ బట్లర్
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడైన జోస్ బట్లర్ యూఏఈలో కాలు మోపడం లేదు. బట్లర్ భార్య త్వరలోనే రెండో బిడ్డకు జన్మనిస్తుండడంతో బట్లర్ ఆమెతోపాటే ఉండడనున్నాడు. ఈ కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు.
ఆడం జంపా
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లెగ్ స్పిన్నర్ అయిన ఆడం జంపా కూడా ఐపీఎల్ పార్ట్-2లో పాలుపంచుకోవడం లేదు. ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ జట్టులో జంపా సభ్యుడు కావడంతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
కేన్ రిచర్డ్‌సన్
జంపా సహచర ఆటగాడు అయిన కేన్ రిచర్డ్‌సన్ కూడా ఐపీఎల్‌లో ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రిచర్డ్స్‌సన్ కూడా టీ20 ప్రపంచకప్ ప్లాన్స్‌లో ఉండడంతోనే ఇండియన్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు.
రైలీ మెరెడిత్
ఆస్ట్రేలియా యువ స్పీడ్‌స్టర్ అయిన రైలీ.. ఐపీఎల్‌లో పంజాబ్‌కు ఆడుతున్నాడు. గాయం కారణంగా అతడు ఐపీఎల్‌లో ఆడబోవడం లేదు.
జే రిచర్డ్‌సన్
ఆసీస్ ఫాస్ట్ బౌలర్ అయిన జే రిచర్డ్‌సన్ కూడా ఐపీఎల్‌లో ఆడడం లేదు. రిచర్డ్‌సన్ కూడా పంజాబ్ కింగ్స్‌కే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
డేనియల్ శామ్స్
ఆస్ట్రేలియా ఆటగాడు డేనియల్ శామ్స్ మానసిక పరమైన సమస్యల కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. డేనియల్ శామ్స్.. విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఫిన్ అలెన్
ఈ న్యూజిలాండ్ ఆటగాడు ఈ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జత కట్టాడు. అయితే, జాతీయ జట్టు బాధ్యతల కారణంగా యూఏఈ లీగ్‌కు దూరమయ్యాడు.
జోఫ్రా అర్చర్
ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ అయిన జోఫ్రా అర్చర్ గాయం కారణంగా ఐపీఎల్ రెండో దశకు దూరమయ్యాడు.