దారుణ యాప్‌లు

ABN , First Publish Date - 2020-12-17T07:56:37+05:30 IST

‘స్నాప్‌ ఇట్‌’ అనే యాప్‌ ద్వారా తీసుకున్న రుణం.. సిద్దిపేట జిల్లాలోని ఓ ఏఈవో ఆత్మహత్యకు కారణమైంది. జిల్లాలోని నంగునూరుమండలం రాజగోపాల్‌పేటకు చెందిన కిర్ని భూపాని కూతురు కిర్ని

దారుణ  యాప్‌లు

ప్రాణం తీసిన లోన్‌ యాప్‌.. సిద్దిపేటలో ఏఈవో ఆత్మహత్య

తీసుకున్న రుణం చెల్లించలేదంటూ

వాట్సాప్‌ గ్రూపుల్లో ఆమె ఫొటో షేరింగ్‌

అవమానం తట్టుకోలేక బలవన్మరణం

గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఇబ్బడిముబ్బడిగా

ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌లు.. యువతకు వల

36 శాతం దాకా బాదుడు వడ్డీతో అప్పు

చెల్లింపు కొద్దిగా ఆలస్యమైతే బెదిరింపులు

యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసేటప్పుడే కాంటాక్ట్‌లిస్ట్‌,

ఫొటోల యాక్సె్‌సకు అనుమతిచ్చేలా సెట్టింగ్స్‌

రుణం చెల్లించనివారి కాంటాక్ట్‌లిస్ట్‌ నుంచి

నంబర్లు, మొబైల్‌లోని అన్ని ఫొటోల సేకరణ

వారిని కించపరిచేలా వాట్సాప్‌ గ్రూపుల సృష్టి

ఆ గ్రూపుల్లో వారి బంధువులను చేర్చి రచ్చ

మనస్తాపంతో బాధితుల తీవ్ర నిర్ణయాలు 

ఐదు యాప్‌లను తొలగించిన గూగుల్‌ 

చాలావరకూ చైనీస్‌ యాప్‌లే: సైబర్‌ నిపుణులు


అప్పటికప్పుడు (ఇన్‌స్టంట్‌) లోన్‌ ఇస్తామంటూ యువతకు ఎర వేస్తున్న లోన్‌ యాప్‌లు.. ఆ రుణం చెల్లించడంలో కొద్దిగా ఆలస్యమైతే చాలు.. దారుణంగా వ్యవహరిస్తున్నాయి! రుణగ్రహీతలను డిఫాల్టర్లుగా, ఫ్రాడ్‌గా చిత్రీకరిస్తూ వాట్సాప్‌ గ్రూపులు సృష్టించి.. ఆ గ్రూపుల్లో వారి బంధువులు, స్నేహితులనే చేర్చి అవమానిస్తున్నాయి!! దీంతో పలువురు.. మనస్తాపానికి గురై, అవమాన భారం తట్టుకోలేక తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదేకోవలో ‘స్నాప్‌ ఇట్‌’ అనే లోన్‌ యాప్‌ అప్పు ఇచ్చి, ఏజెంట్ల ద్వారా వేధించడంతో.. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలానికి చెందిన వ్యవసాయ శాఖ ఏఈవో మౌనిక ఆత్మహత్య చేసుకున్నారు! రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి లోన్‌ యాప్‌ల బారిన పడి విలవిలలాడుతున్నవారి సంఖ్య వేలల్లో.. దేశవ్యాప్తంగా కోట్లల్లో ఉందంటే అతిశయోక్తి కాదు!! ఇంకా ఆందోళనకరమైన విషయమేంటంటే.. ఇలాంటి యాప్‌ల్లో చాలా వరకూ చైనాకు చెందినవే! అక్కడి సర్వర్ల నుంచి నడుస్తున్నవే!!


సిద్దిపేట క్రైం/నంగునూరు, పటాన్‌చెరు రూరల్‌, డిసెంబరు 16: ‘స్నాప్‌ ఇట్‌’ అనే యాప్‌ ద్వారా తీసుకున్న రుణం.. సిద్దిపేట జిల్లాలోని ఓ ఏఈవో ఆత్మహత్యకు కారణమైంది. జిల్లాలోని నంగునూరుమండలం రాజగోపాల్‌పేటకు చెందిన కిర్ని భూపాని కూతురు కిర్ని మౌనిక(23) 2018 మేలో అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏఈవోగా ఉద్యోగం సాధించారు. నంగునూరుమండలంలోని ఖాత, కొండంరాజుపల్లి, ఘనాపూర్‌ గ్రామాల్లో ఆమె విధులు నిర్వహిస్తూ, కుటుంబ సభ్యులతో కలిసి సిద్దిపేట పట్టణంలోని భారత్‌నగర్‌లో ఉంటున్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం కొన్నాళ్ల కిందట ఆమె ‘స్నాప్‌ ఇట్‌’ యాప్‌ ద్వారా లోన్‌ తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత వాయిదాలు చెల్లించలేకపోవడంతో సదరు యాప్‌ వారు ఆమెను డిఫాల్టర్‌గా గుర్తించి.. ఆమె ఫొటో, మొబైల్‌ నంబర్‌, పేరుతో కూడిన ప్రొఫైల్‌ను వాట్సాప్‌ గ్రూప్‌ల్లో షేర్‌ చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక సోమవారం రాత్రి పురుగుల మందు తాగారు.


గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మౌనిక మృతి చెందారు. మౌనిక ఆత్మహత్యకు కారణమైన స్నాప్‌ ఇట్‌ యాప్‌కు సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట వన్‌ టౌన్‌ పోలీసుస్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఏఈవో మౌనిక ఒక్కరే కాదు.. ఇలాంటి ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ల వలకు చిక్కి బాధపడుతున్నవారు రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అత్యవసరంగా డబ్బు కావాల్సినవారుఇలాంటి యాప్‌ల వలకు చిక్కి.. ఆ తర్వాత తమ శక్తికి మించిన మూల్యాన్ని చెల్లిస్తున్నారు. చెల్లించలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రాంతంలో ఈ తరహా యాప్‌ల బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 


ఇదీ మోడెస్‌ ఆపరెండీ..

రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనలకు విరుద్ధంగా నడిచే ఇలాంటి ఇన్‌స్టెంట్‌ లోన్‌ యాప్‌లన్నిటిదీ ఒకటే పద్థతి. యాప్‌ ద్వారా సులభంగా రుణాలు ఇస్తామంటూ వినియోగదారులను ఆకర్షిస్తారు. ‘0.98 శాతం వడ్డీకే రుణాలు’ అంటూ ఊరిస్తారు. అయితే.. ఆ వడ్డీ ఒకరోజుకు కట్టాల్సిందనే విషయాన్ని ఎక్కడా చెప్పరు. ఆ ఆకర్షణకు ఎవరైనా లొంగితే దొరికిపోయినట్టే. సదరు యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకునే సమయంలో.. కాంటాక్ట్‌లిస్ట్‌, ఫొటోల ఫోల్డర్ల యాక్సె్‌సకు అనుమతి ఇవ్వాలని అడుగుతారు. లోన్‌ కావాలంటే అనుమతి ఇవ్వడం తప్పనిసరి. అప్పు అత్యవసరం కావడంతో రుణగ్రహీతలు అన్ని పర్మిషన్లూ ఇస్తూ పోతారు. దీంతో, వారి మొబైల్‌లో ఉన్న ఫోన్‌ నంబర్లు, ఫొటోలను యాక్సెస్‌ చేయడానికి యాప్‌ నిర్వాహకులకు అవకాశం చిక్కుతుంది. అన్ని అనుమతులూ ఇచ్చి, సెల్ఫీ ఫొటో పంపి, పాన్‌, ఆధార్‌ కార్డుల వివరాలు సమర్పించాక 36ు దాకా వడ్డీ బాదుడుతో రుణం మంజూరు చేస్తారు. ఆ సమయంలో ప్రాసెసింగ్‌ ఫీజు, వడ్డీ తదితరాల పేరిట కొంత మొత్తాన్ని కట్‌ చేసుకుని మిగతా మొత్తాన్ని రుణంగా వినియోగదారుల బ్యాంకులో వేస్తారు. ఎలాంటి ష్యూరిటీ అవసరం లేకపోవడం, క్రెడిట్‌ స్కోరుతో సంబంధం లేకుండా అప్పు వచ్చే అవకాశం ఉండడంతో.. సిబిల్‌ స్కోరు లేనివారు, సిబిల్‌ ఉన్నా చెల్లింపుల చరిత్ర సరిగ్గా లేనివారు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యాప్‌ల బారిన పడుతున్నారు. వాటి ద్వారా రుణాలు తీసుకున్నాక చెల్లించాల్సిన గడువుకు ఒక్కరోజు ఆలస్యమైనా ఓవర్‌ డ్యూ చార్జీ వేస్తారు. ఇక వేధింపులు మొదలవుతాయి. తడవతడవకూ ఫోన్‌ కాల్స్‌ చేస్తారు. ఎస్సెమ్మె్‌సలు పంపిస్తారు. ఫోన్‌ ఎత్తితే.. బండబూతులు తిడుతూ మానసికంగా హింసించడం మొదలుపెడతారు. ఆ బాధ భరించలేక ఫోన్‌ ఎత్తడం మానేసినా.. చెల్లించాల్సిన గడువు దాటి ఎక్కువ రోజులైనా.. వారి వేధింపుల్లో రెండో అంకం మొదలవుతుంది. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకునేటప్పుడు తీసుకున్న అనుమతులతో.. రుణగ్రహీతల  కాంటాక్ట్‌లి్‌స్టలోని ఫోన్‌ నంబర్లు సేకరించి వారి స్నేహితులకు, బంధువులకు ఫోన్లు చేయడం మొదలుపెడతారు. ‘మీవాడు లోన్‌ తీసుకున్నాడు. చెల్లించట్లేదు. మీ నంబర్‌ రిఫరెన్స్‌గా ఇచ్చాడు.’ అంటూ మర్యాదగా మాట్లాడడం మొదలుపెట్టి.. ‘ఆ లోన్‌ మీరు కడతారా లేక కోర్టుకు లాగమంటారా’ అని బెదిరిస్తారు. అవతలి వ్యక్తులు గట్టిగా మాట్లాడితే.. బూతుల్లోకి దిగుతారు. రుణగ్రహీతల ఫొటోలను.. వారి కుటుంబసభ్యులతో కలిసి ఉన్న ఫొటోలు దొరికితే వాటిని డిస్‌ప్లే పిక్చర్‌గా పెట్టి వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేస్తారు. అందులో రుణగ్రహీతల బంధువులు, స్నేహితులను సభ్యులుగా చేరుస్తారు. ‘వీడు ఫ్రాడ్‌.. డిఫాల్టర్‌.. అప్పు చెల్లించలేదు’ అనో.. ‘వీడు అమ్మాయిల బ్రోకర్‌’ అనో ముద్ర వేస్తారు. ‘బ్యాంకుల్లో రుణాలు ఎగ్గొట్టి తిరుగుతున్నాడు. పోలీసులకు పట్టించండి’ అని మెసేజ్‌లు పెడతారు. రుణం తీసుకున్నది అమ్మాయిలైతే.. వారి వేధింపులు వేరే రకంగా ఉంటాయి. నగ్నంగా వీడియో కాల్స్‌ చేయాలని లేదంటే కేసులు పెడతామని బెదిరిస్తారు. చెన్నైలో ఇటీవలే ఒక మహిళను లోన్‌ యాప్‌ ఏజెంట్‌ ఒకడు ఇలాగే బెదిరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గత నెలలో ఒక మహిళ ఇలాగే లోన్‌ యాప్‌ ఏజెంట్ల ఒత్తిడి భరించలేక ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

ఎంత చెల్లించినా..

ఈ తరహా మోసానికి గురైన పటాన్‌చెరు యువకుడు పవన్‌కుమార్‌ తీవ్ర మానసిక క్షోభకు గురవ్వడంతో అతని తండ్రి.. రూ.1.40 లక్షలు యాప్‌ ఏజెంట్లకు చెల్లించాడు. అయినా ఇంకా కట్టాలంటూ వేధిస్తుండడంతో ఆయన ‘ఆంధ్రజ్యోతి’ని ఆశ్రయించి తమ కష్టం చెప్పుకొన్నారు.  ఇదే తరహాలో.. పటాన్‌చెరు గోనెమ్మబస్తీకి చెందిన మరో యువకుడు తాను చిన్నపాటి రుణం తీసుకుని తిరిగి చెల్లించేశానని, అయినా తనకు వేధింపులు వస్తున్నాయని తెలిపాడు. పటాన్‌చెరు పోలీ్‌సస్టేషన్‌తో పాటు సైబర్‌ క్రైమ్‌లో కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్లినా.. వారు స్పందించలేదని బాధితుడు వాపోయాడు. ఇప్పటికైనా పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించి బాధితులకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు. 

ఐదు యాప్‌ల తొలగింపు..

గూగుల్‌ నిబంధనల ప్రకారం.. ఆర్థిక వ్యవహారాలు, సేవలు నిర్వహించే ఏ యాప్‌ అయినా అది ఆ దేశ, స్థానిక చట్టాలకు లోబడి ఉండాలి. వ్యాలీడ్‌ ఈమెయిల్‌ ఐడీ, కాంటాక్ట్‌ వివరాలు కలిగి ఉండాలి. కానీ, చట్టవిరుద్ధంగా నడిచే ఈ యాప్‌లకు అలాంటివేవీ ఉండవు. అంతేకాదు.. రుణాన్ని 60 రోజుల్లోపు తీర్చాలని డిమాండ్‌ చేసే యాప్‌లను గూగుల్‌ నిబంధనల ప్రకారం ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తారు. ఈ క్రమంలోనే.. పలువురు బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు గూగుల్‌ ఇటీవలే ఓకే క్యాష్‌, గోక్యాష్‌, ఫ్లిప్‌ క్యాష్‌, ఈక్యాష్‌, స్నాప్‌ఇట్‌ లోన్‌ యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. విషాదమేంటంటే.. అవన్నీ వేరేవేరే రూపాల్లో మళ్లీ ప్లేస్టోర్‌లోకి వచ్చి చేరినట్టు సమాచారం.


===================

డ్రాగన్‌ యాప్‌లే..

రుణాలిచ్చి వేధింపులకు పాల్పడుతున్న యాప్‌ల్లో అత్యధికం చైనావేనని.. అక్కడి సర్వర్ల నుంచి నడుస్తున్నవేనని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. బబుల్‌ లోన్‌, లిక్విడ్‌ క్యాష్‌, క్యాష్‌ బీ, రూపీ బజార్‌, రూపీ ఫ్యాక్టరీ, పైసా లోన్‌, స్నాప్‌ఇట్‌ లోన్‌, ఇన్‌ నీడ్‌, రూపీ ప్లస్‌, పాన్‌ లోన్‌, క్యాష్‌ పోర్ట్‌, వౌ పైసా, గోల్డ్‌ బౌల్‌, ఓకే క్యాష్‌, ఉధార్‌ లోన్‌, గోక్యాష్‌, క్యాష్‌ అడ్వాన్స్‌, ఐఈజీ క్యాష్‌.. ఇలా ఎన్నో యాప్‌లున్నాయి.   వీటిలో ఏ యాప్‌ గురించి తెలుసుకుందామన్నా, సంప్రదిద్దామన్నా వాటికి సంబంధించిన వెబ్‌సైట్లు, కాంటాక్ట్‌ వివరాల్లాంటివి ఏవీ దొరకవు. ‘‘అవన్నీ చైనాకు చెందిన ఒకే వైట్‌ లేబుల్‌ యాప్‌ను, సర్వర్‌ను వినియోగించే యాప్‌లు. ఒక్కటి కూడా భారతదేశానిది కాదు’’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని సైబర్‌ నిపుణుడొకరు తెలిపారు. వైట్‌లేబుల్‌ యాప్స్‌ అంటే.. ఒకే కంపెనీ వేర్వేరు క్లైంట్ల కోసం ఒకే తరహాలో రూపొందించి ఇచ్చే యాప్‌లు. వాటి మూల (బేస్‌) సాఫ్ట్‌వేర్‌ ఒకటే ఉంటుంది. అందులో కొన్ని చిన్నచిన్న మార్పులు చేసి పలువురికి విక్రయిస్తారని ఆయన వివరించారు. ఈ యాప్‌లన్నీ తయారుచేసిచ్చిన వైట్‌లేబుల్‌ ప్రొవైడర్‌ సర్వర్లన్నీ చైనాకు చెందిన అలీబాబా కంపెనీ క్లౌడ్‌లో ఉన్నట్టు తన పరిశోధనలో తేలిందని ఆయన వెల్లడించారు. మనదేశంలో ఆన్‌లైన్‌లోగానీ, నేరుగా గానీ అప్పు ఇవ్వాలంటే ఆ అర్హత ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులకు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు మాత్రమే ఉంది. ఆర్బీఐ గుర్తింపు లేనివారు అప్పులు ఇవ్వడమంటే అది చట్టవిరుద్ధమే. 

Updated Date - 2020-12-17T07:56:37+05:30 IST