రుణ చెల్లింపులపై మరో 3 నెలలు మారటోరియం

ABN , First Publish Date - 2020-05-23T07:33:20+05:30 IST

కరోనాతో దెబ్బతిన్న రుణ గ్రహీతలను ఆదుకునేందుకు ఆర్‌బీఐ మరిన్ని చర్యలు ప్రకటించింది. కాల పరిమితి (టర్మ్‌) రుణాల నెలవారీ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ)పై మరో మూడు నెలల పాటు మారటోరియం...

రుణ చెల్లింపులపై మరో 3 నెలలు మారటోరియం

  • ఆగస్టు వరకు గడువు
  • వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలకూ వర్తింపు


ముంబై: కరోనాతో దెబ్బతిన్న రుణ గ్రహీతలను ఆదుకునేందుకు ఆర్‌బీఐ మరిన్ని చర్యలు ప్రకటించింది. కాల పరిమితి (టర్మ్‌) రుణాల నెలవారీ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ)పై మరో మూడు నెలల పాటు మారటోరియం పొడిగించింది. దీంతో కంపెనీలు, వ్యాపార సంస్థలతో పాటు గృహ, వాహన రుణాలు తీసుకున్న వ్యక్తులకు ఈఎంఐల చెల్లింపులకు ఆరు నెలల వరకు అంటే ఈ ఏడాది ఆగస్టు వరకు ఊరట లభించింది.


కొత్త టర్మ్‌ రుణాలుగా మార్పు: ఈ ఆరు నెలల ఈఎం ఐ బకాయిలను బ్యాంకులు కొత్త టర్మ్‌ రుణాలుగా మార్చేందుకూ అనుమతి ఇచ్చింది. వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే టర్మ్‌ రుణాలుగా మార్చినా వర్కింగ్‌ క్యాపిటల్‌ ఈఎంఐను కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం (2020-21)లోపే చెల్లించాలని స్పష్టం చేసింది.

గృహరుణాలు: గృహ రుణాల ఈఎంఐ చెల్లింపులకీ ఆరు నెలలు విరామం ఇచ్చింది. అయితే ఈ ఈఎంఐలు వసూలు చేసుకునేందుకు ఆర్‌బీఐ.. బ్యాంకులకు మూడు ఆప్షన్లు ఇచ్చింది. అవేమిటంటే..

  1. మారటోరియం గడువు ముగిసిన వెంటనే ఆరు నెలల వడ్డీని ఒకేసారి వసూలు చేసుకోవడం. లేదా..
  2. ఆరు నెలల వడ్డీని మిగిలిన బాకీకి కలిపి, మిగతా రుణ గడువులో అధిక ఈఎంఐల రూపంలో వసూలు చేసుకోవడం. లేదా..
  3. ఆరు నెలల వడ్డీ బకాయిలను మిగతా రుణానికి కలిపి, రుణ చెల్లింపు కాల పరిమితి పెంచి.. ప్రస్తుత ఈఎంఐనే వసూలు చేసుకోవడం


ఉదాహరణ : ఒక వ్యక్తి 8 శాతం వడ్డీ రేటుతో 20 సంవత్సరాల్లో చెల్లించేలా రూ.30 లక్షల గృహ రుణం తీసుకున్నాడనుకుందాం. ఈ రుణంపై అతడు ప్రతి నెలా రూ.25,093 చొప్పున ఈఎంఐ చెల్లించాలి. 

పైన పేర్కొన్న రెండో ఆప్షన్‌ వినియోగించుకునే రుణ గ్రహీతల ఈఎంఐ చెల్లింపుల భారం నెలకు రూ.1,000పైనే పెరుగుతుంది. అదే ఈఎంఐతో రుణ చెల్లింపు గడువు పెం చుకుంటే.. అదనంగా రెండు నుంచి నాలుగు నెలల పాటు ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది.


రుణ చెల్లింపు గడువు ఐదేళ్లు ఉంటే?

ఆరు నెలల ఈఎంఐ మారటోరియం గడువు ముగిసే సరి కి చెల్లించాల్సిన వడ్డీ బకాయి రూ.49,500. మారటోరియం ముగిశాక రుణ గ్రహీత అధిక ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకుంటే, అతడి నెలవారీ ఈఎంఐ భారం రూ.1,004 పెరుగుతుంది. అదే ఈఎంఐతో రుణ చెల్లింపు గడువు పెంచుకుంటే మరో రెండు నెలల పాటు ఈఎంఐలు చెల్లించాలి.


రుణ చెల్లింపు గడువు పదేళ్లు ఉంటే?

మారటోరియం గడువు ముగిసే సరికి చెల్లించాల్సిన వడ్డీ భారం రూ.82,728. ఈ పదేళ్లలోనే అధిక ఈఎంఐ ద్వారా మిగతా రుణం చెల్లించాలనుకుంటే ఈఎంఐ రూ.1,004 పెరి గి రూ.26,097 అవుతుంది. అదే ఈఎంఐతో రుణ చెల్లింపు గడువు పెంచుకుంటే, మరో మూడు నెలల పాటు ఈఎంఐలు చెల్లిస్తే సరిపోతుంది.

ఎవరికి మేలు: లాక్‌డౌన్‌తో చాలా మంది ఆర్థిక పరిస్థితి క్షీణించింది. కొందరికి ఉద్యోగాలు పోయాయి లేదా జీతాలు తగ్గిపోయాయి. స్వయం ఉపాధిలో ఉన్న వారికైతే ఆదాయాలు నిల్‌. ఇలాంటి వ్యక్తులు మాత్రమే ఈ మారటోరియం ఉపయోగించుకోవాలి. ఆర్థికంగా ఏ ఇబ్బందీ లేదనుకుంటే మాత్రం, క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లించడమే మేలు. 


Updated Date - 2020-05-23T07:33:20+05:30 IST