Abn logo
May 19 2021 @ 00:04AM

స్టాలిన్‌ను చూడండి

మొన్న ఆదివారం నాడు చెన్నైలో ఒక విశేషం జరిగింది. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ వార్తా చానెళ్ల సంపాదక ప్రతినిధులతో సమావేశమై, కొవిడ్‌ను ఎదుర్కొనడంలో సహకరించవలసిందిగా కోరారు. కొన్ని సందర్భాలలో పాలకులు పత్రికలను, ఇతర సమాచార సాధనాలను విశ్వాసంలోకి తీసుకుని సంప్రదించేవారని, సహకారం కోరేవారని ఇప్పటి తరానికి తెలిసే అవకాశం లేదు.


ఏడు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా పత్రికా సమావేశం నిర్వహించని ప్రధానమంత్రి ఉన్న దేశం మనది. తనకు వ్యతిరేకంగా ఒక రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేశాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎబిన్ ఆంధ్రజ్యోతితో సహా రెండు వార్తా చానెళ్లపై రాజద్రోహం కేసు పెట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. ఈ రెండు రాష్ట్రప్రభుత్వాలూ ఆంధ్రజ్యోతితో సహా తమపై విమర్శనాత్మక కథనాలు ప్రచురిస్తున్నాయని, ప్రతిపక్షాలకు కూడా పత్రికల్లో స్థానం ఇస్తున్నాయని కినుకతో ప్రకటనల జారీలో తీవ్రమైన వివక్ష చూపిస్తున్నాయి. ఒక సంక్షోభ కాలంలో మీడియాను విశ్వాసంలోకి తీసుకోవడం కొన్ని దశాబ్దాల కిందటి మాట. ఇప్పుడు, కేసులు, వేధింపులు, వివక్షలు ఇవి మాత్రమే స్వతంత్రంగా వ్యవహరించే పత్రికలకు, వార్తాచానెళ్లకు దక్కేవి. 


సుదీర్ఘ నిరీక్షణ తరువాత, పాలనలోను రాజకీయంలోనూ గణనీయమైన అనుభవం గడించిన తరువాత తమిళనాడు ఎన్నికలలో ఎం.కె స్టాలిన్ గెలిచారు. అనేక దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలలో రెండు శిఖరాలుగా ఉంటూ వచ్చిన కరుణానిధి, జయలలిత లేకుండా జరిగిన ఎన్నికల పోరులో, ద్రవిడ రాజకీయాల వారసత్వాన్ని ఎంతో కొంత ప్రకటించగలిగి స్టాలిన్ విజయం సాధించారు. డిఎంకె గెలిచింది కానీ, అన్నా డిఎంకె పూర్తిగా నీరసించలేదు. బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే, అధికారం కోల్పోయిన ఆ పార్టీ ప్రస్తుతం నాయకత్వం లేమితో బాధపడుతోంది. వారు ఓటమి నుంచి తేరుకుని, తమను తాము సమీకృతం చేసుకునే లోపు, తన ముద్రను బలంగా వేయాలని స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే, అమ్మ కేంటీన్లను జయలలిత బొమ్మలతోనే కొనసాగించడం నుంచి కొవిడ్ సలహామండలిలో అన్నా డిఎంకెకు చెందిన మాజీ ఆరోగ్యమంత్రిని కూడా సభ్యుడిగా నియమించడం దాకా ప్రశంసలు పొందాయి.


అన్నా డిఎంకె శ్రేణులలో తమ మీద ఉన్న వ్యతిరేకతను తొలగించుకుని, తన పార్టీని బలమైన ద్రవిడ పార్టీగా తీర్చిదిద్దాలని డిఎంకె నాయకత్వం అనుకోవడం సహజం. అయితే, స్టాలిన్ సరళిలో కేవలం రాజకీయ చతురత మాత్రమే కాక, పెద్దమనిషి తరహా కూడా కనిపిస్తున్నది. మంత్రులకు శాఖల కేటాయింపులు, అధికారుల ఎంపిక అన్నీ ఆయన సత్పరిపాలన ఇవ్వాలనుకుంటున్నారన్న సూచనలు ఇస్తున్నాయి. బలమైన ప్రత్యర్థి నేత ఎవరూలేని శూన్యంలో, పెత్తందారీతనాన్ని ప్రదర్శించడం కాక, అందరినీ కలుపుకొని పోవడం అనే వ్యూహం ఆదర్శవంతమైనది. 


కొవిడ్ నియంత్రణకు సంబంధించిన చర్యలకు స్టాలిన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. రాగానే పూర్తి లాక్‌డౌన్ విధించారు. మందుల అందుబాటు, ఆక్సిజన్ కొరత వంటి విషయాలను కేంద్రానికి నివేదించారు. బ్లాక్ మార్కెటీర్లపై చర్యలు ప్రకటించారు. కొవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. వైద్యులకు, ఇతర ఆరోగ్య సిబ్బందికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సహాయ చర్యలు తీసుకుంటున్నారు. టీకాల సేకరణకు టెండర్ల ప్రకటన చేశారు. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి, టీకాల ఉత్పత్తికి సంబంధించి, ప్రభుత్వ కార్పొరేషన్‌తో సంయుక్తంగా కనీసం 50 కోట్ల పెట్టుబడితో వచ్చే కంపెనీలకు ఆహ్వానం పలికారు. వీటిలో అనేకం పోయిన ఏడాదే తీసుకుని ఉండవలసిన చర్యలు. కేంద్రంతో సహా ఇప్పుడిప్పుడే కొరతలను, లోపాలను గుర్తించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. కానీ, నిర్ణయాలు తీసుకునే వేగాన్ని ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి. ఆస్పత్రులలో ఆక్సిజన్ కేంద్రాల గురించి, కొత్త వైద్యకళాశాలల గురించి, ‍‍ఔషధాల ఉపకేంద్రాల గురించి ఒకరోజు ముందే నిర్ణయాలు ప్రకటించారు. రానున్న రోజులలో వీటిలో ఏవి ఎంత వేగంగా జరుగుతాయో గమనించడం ఆసక్తిదాయకంగా ఉంటుంది. 


కేంద్రంతో పోరాటం విషయంలో డిఎంకె కూడా కాలక్రమంగా వరస మార్చుకుంటూ వస్తున్న మాట నిజమే కానీ, ఉన్న ప్రాంతీయ పార్టీలలో ఇంకా ఫెడరలిస్టు వాదం అంతో ఇంతో మిగుల్చుకున్న పార్టీ అదే. కేంద్రప్రభుత్వానికి బలమైన ఎదురుదెబ్బ తగిలింది మమతా బెనర్జీ విజయం వల్లనే కావచ్చును కానీ, దాని కంటె స్టాలిన్, పినరాయి విజయన్ విజయాలే సైద్ధాంతికమైనవని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త కంచె ఐలయ్య ఈ మధ్య వ్యాఖ్యానించారు. కేంద్రంతో, బిజెపి కూటమితో కరుణానిధి కంటె స్టాలిన్ మరింతగా సర్దుబాటు వైఖరి ప్రదర్శించవచ్చునని పరిశీలకులు ఊహాగానాలు చేశారు. కానీ, బిజెపిపై గట్టి వ్యతిరేక ప్రచారంతోనే తాను విజయం సాధించానని స్టాలిన్‌కు తెలుసు. బిజెపి పొత్తు లేకపోతే తమ పరిస్థితి మెరుగుగా ఉండేదని అన్నా డిఎంకె బాహాటంగానే బాధపడుతోంది. తమిళ సమాజం తమ ప్రత్యేకతలను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కొవిడ్ విషయంలో ప్రధానమంత్రితో విడియో సమావేశంలో పాల్గొని, అవసరాలను వివరించిన స్టాలిన్, సోమవారం నాడు కేంద్ర విద్యాశాఖ మంత్రితో సమావేశాన్ని బహిష్కరించారు. రాష్ట్ర విద్యామంత్రిని పిలవకుండా, కేవలం విద్యాశాఖ కార్యదర్శి, ఇతర శాఖాధికారులతో కేంద్ర మంత్రి నేరుగా సంభాషించడం తమకు సమ్మతం కాదని చెబుతూ, తమ ప్రభుత్వం అందులో పాల్గొనదని తమిళనాడు ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. 


ఫెడరల్ ఫ్రంట్ నెలకొల్పాలని, ఢిల్లీలో చక్రం తిప్పాలని ఆలోచనలు ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి– మమతా బెనర్జీ సాహసాన్ని, స్టాలిన్ క్రియాశీలమైన పరిపాలనను ఆశ్చర్యంగానే గమనిస్తూ ఉండవచ్చు. గత ఏడు సంవత్సరాలుగా కేంద్రంతో సామరస్యంగా ఉండడానికే ప్రయత్నిస్తున్న తన వెంట అటువంటి నాయకులందరూ సమీకృతులవుతారని ఆయన ఎందుకు అనుకున్నారో తెలియదు. ప్రజలు మాత్రం పొరుగు ముఖ్యమంత్రుల మంచి చెడ్డలను తమ నాయకుల గుణగణాలతో పోల్చిచూసుకుంటున్నారు.

Advertisement