Abn logo
Aug 11 2020 @ 03:58AM

శ్రీకృష్ణుడు.. ఒక సంపూర్ణ తత్వం

భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానంలో ప్రముఖమైన బిందువు శ్రీకృష్ణుడి వద్ద ఉంటుంది. ఎన్నో గొప్ప సిద్ధాంతాలను సులభంగా జీర్ణం చేసుకోగల జ్ఞానాన్ని కృష్ణుడు మనకు అందించాడు. శ్రీకృష్ణుడి ద్వారా వ్యక్తమైన భాగవతతత్వం భగవద్గీత కదా భారతీయ తాత్వికతకు ఆత్మనిచ్చింది! అందుకే కృష్ణుడు జగద్గురువుల్లో ఒకడు.


వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్‌

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌


అనడంలో ఉద్దేశం ఇదే. శ్రీకృష్ణుడు గురువు మాత్రమే కాదు. గొప్ప రాజనీతిజ్ఞుడు, తత్త్వవేత్త, రక్షకుడు, శిక్షకుడు. అన్ని నియమాలనూ ఆచరింపజేయగలడు, ఉల్లంఘించగలడు. తన కీర్తి ప్రతిష్ఠలను, అపఖ్యాతులను లెక్కించకుండా ధర్మాధర్మ విచక్షణను ఆచరించగల సమర్థుడు. యుద్ధంతో భారతదేశాన్ని ఐకమత్యం వైపు మొదటిసారి అడుగులు వేయించిన అసమాన వ్యూహకర్త. విశిష్టమైన మానవశక్తిగా.. శ్రీమన్నారాయణుడి ఎనిమిదవ అవతారంగా.. దేవకీవసుదేవుల పుణ్యఫలంగా శ్రావణ బహుళ అష్టమి నాడు జన్మించిన శ్రీకృష్ణుడు పుట్టు బందీ. కానీ మానవాళికి భవసాగరం నుంచి బంధ విముక్తి కలిగించే ఆత్మజ్ఞానాన్ని అందించాడు. విషపూరితమైన పూతన చనుబాలు గ్రోలిన శ్రీకృష్ణుడే.. పోతన ద్వారా భాగవతామృతాన్ని మనకు అందించాడు.


నంద గోవ్రజంలో ఉన్నప్పుడు శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసుర, బకాసురాది రాక్షసులను ఎదుర్కొన్న గోపాలుడు.. రాక్షస స్వభావాలను ఎలా జయించాలో మనకు నేర్పించాడు. కాళీయ మర్దనం ద్వారా.. అహంకారంతో ప్రవర్తించేవారి మదం ఎలా అణచాలో తెలియజెప్పాడు. దుష్టుడైన మేనమామ కంసుని వధించి.. దుర్మార్గపు బంధుత్వాన్ని, దుష్ట బంధాలను వదిలించుకోవాలని సూచించాడు. అడుగడుగునా తనను నమ్మిన పాండవులను రక్షించి ‘నమ్మకం’ అనే విలువకు పట్టంగట్టాడు. దుష్టులైన దుర్యోధనాదులను ఎదిరించి పశుబలంపై తిరగబడి ధర్మస్థాపన చేయాలని చెప్పాడు. రక్తసంబంధ వ్యామోహంలో కొట్టుకుపోతున్న అర్జునుడికి తత్వబోధ చేసి గీతామృతాన్ని పంచాడు. అర్జునుడి మాధ్యమంగా లోకానికి గొప్ప తత్వధారను అందించాడు.


భూ సంబంధమైన వాసనలు లేని నిర్విరామ ఆనందభావానికి మరొక పేరు.. శ్రీకృష్ణుడు. ఆయన రూపం ఆనంద స్వరూపం. మోహన రూపం. అది అతీంద్రియం. అలాంటి స్వరూపాన్ని ఆరాధించే పర్వం శ్రీకృష్ణాష్టమి. శ్రీకృష్ణ జయంతి వ్రతాన్ని గురించి భవిష్య పురాణంలో శ్రీకృష్ణుడే స్వయంగా ధర్మరాజుకు తెలిపాడు. జన్మాష్టమినాడు శ్రీకృష్ణునితో పాటు చంద్రునికి అర్ఘ్యం వదలాలి. బంగారు, వెండి లోహాలతో పన్నెండు అంగుళాల చంద్రబింబాన్ని పూజించి అర్ఘ్యం ఇవ్వాలి. లేనివారు యథాశక్తి పూజ చేయాలి. ఇలా చేస్తే మనోవాంఛలు నెరవేరుతాయని భవిష్యోత్తర పురాణం తెల్పింది. అలాగే కృష్ణాష్టమినాడు పగలు ఉపవసించి, భాగవత దశమ స్కందం, భగవద్గీత పఠించాలి. సాయంత్రం పీఠాన్ని అలంకరించి దానిపై ముగ్గులు వేసి, కలశంపెట్టి, అందులో తమ స్థోమత కొద్దీ రత్నాలు, పంచపల్లవాలు నింపి, కలశాన్ని ఎర్రటి వస్త్రంతో అలంకరించి శ్రీకృష్ణ ప్రతిమను దానిపై ఉంచి పూజించాలి. కృష్ణాష్టమి నాడు చేసే ప్రతి పూజ, ఆరాధన.. అంతా కృష్ణతత్వాన్ని గ్రహించేందుకు వినియోగించాలి.

డా. పి.భాస్కరయోగి

Advertisement
Advertisement
Advertisement