Abn logo
Apr 18 2021 @ 00:33AM

భద్రాచల రాముడు దశరథ తనయుడు కాడా?

మహాభక్తుడు  కంచెర్ల గోపన్న (రామదాసు)  నాలుగున్నర శతాబ్దాల క్రితం భద్రాచలంలో నిర్మించిన శ్రీ సీతా రామచంద్రస్వామి  కోవెలలో ఇటీవల  జరుగుతున్న కొన్ని పరిణామాలు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది  కళ్యాణంలో పేరు, గోత్రం ప్రవరలు మార్చటం. ఎందుకిలా జరుగుతోంది? 


రాముడు భద్రుడికి దర్శనమిచ్చినప్పుడు నాలుగు చేతులతో శంఖ చక్రాలతో సీతామాతను తొడపై కూర్చో పెట్టుకొని అవతరించారు కనుక ఆయన రామనారాయణుడు, అర్చామూర్తి, దశరథ తనయుడు కాడని దేవాలయ అర్చకులు వాదిస్తున్నారు. ఆయనకు తల్లి, తండ్రి ఆయనే అంటూ విభవ వాసుదేవ శర్మ పుత్రాయ అని చెబుతున్నారు. కళ్యాణ ప్రక్రియలో గత 10 సంవత్సరాలుగా రామనారాయణ వరాయః అని , అమ్మ వారు జనకుని కూతురు కాదు అంటూ క్షీరార్ణవ శర్మ పుత్రీం సీతామహాలక్ష్మీం అని చెబుతున్నారు. శుభలేఖ మీద సీతారామ కళ్యాణమని ఉంటుంది, కానీ వివాహ ప్రక్రియలో ఎక్కడా దశరథుడి పేరు, జనకుడి పేరు వాడటం లేదు.


అయితే స్వామివారు  భద్రునికి దర్శనమిచ్చినప్పుడు ‘ నమస్తే దేవదేవేశ శంఖ చక్ర గధాధర ధనుర్భాణ ధరానంత రామచంద్ర నమోస్తుతే’ అని స్తోత్రం చేశాడు అంటూ ప్రతివాదులు అర్చకుల వాదనలను తోసిపుచ్చుతున్నారు.


వ్యాస భగవానుడు కూడా దీనినే ధ్రువపరుస్తూ ‘శ్రీరామ వచ్ఛుభం సుందరం రూపమాసాద్య’ అని పేర్కొన్నారు , క్షేత్ర మహాత్యంలో ‘శ్రీ రామ చంద్ర ఉవాచ’ అని చెప్పారు. భద్రాచల క్షేత్ర మహాత్యంలో రామ,- రామచంద్ర, - సీతారామ, - రఘోత్తమ, - రాఘవ అనే సంబోధనలు ఉన్నాయి కళ్యాణ రామ, ఓంకార రామ, రామనారాయణ, వైకుంఠరామ విశిష్ట నామాలుగా ఉన్నాయి.


రామదాసు పోకల దమ్మక్క నిర్మించిన తాటాకు పాకలో మొదటిసారి స్వామివారి విగ్రహాన్ని చూసి గుడి నిర్మించారు. దానికి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయమని పేరు పెట్టారు. ఈ రోజుకీ  దేవాదాయ శాఖ రికార్డులలో అలాగే ఉంది. ఆయన స్వామివారిని దశరథ తనయుడిగా భావించి దాశరథీ శతకం అంటూ నూరుకు పై బడిన పద్యాలు రాశాడు. అందులో ఆయన స్వామివారు వైకుంఠం నుంచి వచ్చిన విష్ణువేనని అని,  అమ్మవారు శ్రీ రమయే సీతగా అవతరించిందని స్పష్టంగా రాశాడు. పూర్తి అవగాహన తోటే అక్కడ ఉన్న విగ్రహాన్ని దశరథ తనయుడైన రామచంద్రునిగా కొలిచాడు.


రామదాసు స్వామివారిని ఇక్ష్వాకుల తిలకుడిగా, భావించి కలికితురాయి చేయించారు,  జైలులో చిత్రహింసలు పెడుతుంటే బాధతో నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ  అని బతిమిలాడాడు. నీ తండ్రి దశరథుడు చేయించెనా, నీ మామ జనకుడు చేయించెనా, కులుకుతూ తిరిగేవు రామచంద్రా అని ప్రశ్నించాడు.  చింతాకు పతకము చేయిస్తి నీకు సీతమ్మ తల్లీ అని పాడాడు.


శ్రీమన్నారాయణుడు వాడే ధనస్సు పేరు శారంగము , శ్రీ రాముని విల్లు కోదండం , అలాగే అర్జునుడిది గాండీవం.  ‘పలుకే బంగారమాయనా కోదండపాణీ’ అంటూ  రామదాసు పాడాడు. భద్రాచలం కళ్యాణ మండపం పైన ఉన్న శిల్పంలో చతుర్భుజుడైన శ్రీ రామ కళ్యాణాన్ని దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయిలతో చూస్తున్నట్టు చెక్కించాడు .


కళ్యాణంలో వాడటానికి చేయించిన మంగళ సూత్రానికి రామదాసు మూడు తాళిబొట్లు  చేయించాడు. ఒకటి దశరథుని తరఫున, ఒకటి జనకుని తరఫున, ఒకటి భక్తులందరి తరఫున అలా చేయించాడని చెబుతారు. రాముడు  దశరథ తనయుడు కాకుంటే వారి పేర్ల మీద అలా ఎందుకు చేయించాడు? తన తండ్రి వచ్చాకే తన వివాహం అని దశరథుని కోసం ఆగిన సుగుణశీలి  శ్రీరాముడు.  రామకళ్యాణంలో దశరథుని పేరు , ప్రవరలు చెప్పకపోవడం ఎంతో దురదృష్టకరం, పాతకం. శ్రీ రాముడు పుట్టిన నవమి నాడు కళ్యాణం చేస్తూ, దీనితో  ఆ రామచంద్రునికి సంబంధం లేదంటే ఏం చెయ్యాలి? ఎవరిని అడగాలి?


శుభలేఖ మీద ఆహ్వానం సీతారామ కళ్యాణమని ఉంటుంది. వివాహ ప్రక్రియలో రామనారాయణ, మహాలక్ష్మి అని తండ్రులు, ప్రవరలు మారిపోతాయి. ఎవరైనా అడిగితే వైష్ణవ దేవాలయంలో స్మార్తులకేమి పని అంటూ ఎదురు దాడి చేస్తున్నారు. పాంచరాత్ర ఆగమం కోసం జియ్యర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రింటు చేయించిన మహోత్సవవిధి పుస్తకం లోని రాముడు, సీతల ప్రవరలే వాడండి అంటే ఇక్కడి స్వామి అర్చామూర్తి, నాలుగు చేతులు శంఖచక్రాలతో ఉన్నాడు కాబట్టి దశరథుని  తనయుడు కాదు కాబట్టి వాడమంటారు. పది సంవత్సరాల కిందట తీసిన వీడియోలో రామచంద్రస్వామినే వరాయ అని స్పష్టంగా ఉన్నది. కొద్దిరోజుల నుంచి నిత్యకళ్యాణంలో కూడా రామనారాయణ అనే చెబుతున్నారని తెలిసింది. అక్కడ ఉన్న అర్చామూర్తిని రాతి విగ్రహంగా భావిస్తే బాధ లేదు. కానీ అక్కడ ఉన్నది దేవదేవుడైన శ్రీ రామచంద్రమూర్తిగా భావించిన వాళ్ళకు ఇది అపచారమనిపిస్తుంది.


వరదరామదాసు గారి హుకుం ఎందుకు చూడకూడదు?  రాజా తూము నరసింహ దాసు ప్రకటించిన దశవిధ సేవలు, నైవేద్యాలు ఎందుకు జరపడం లేదు? ఈ సంవత్సరం కళ్యాణం ఎవరు చేస్తారో, ఎవరి బాధ్యత ఏదో ముందే ప్రకటన చేశారు?కనీసం ఈ శ్రీ రామనవమికి అయినా భద్రాచల దేవాలయంలో జరిగే కళ్యాణంలో సీతారాములకు, దశరథ జనకులకు స్థానం లభించాలని భక్తుల కోరిక. పేర్లు, గోత్రం ప్రవరలు మార్చిన వ్యవహారంలో కొన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి దేవాదాయ మంత్రి, ప్రభుత్వ సలహాదారు, కమిషనర్‌లకు ఎంతో మంది, ఎన్నో సార్లు విన్నవించినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ముఖ్యమంత్రి దృష్టికి దీనిని ఎందుకు తీసుకువెళ్లడం లేదు? ఆయన దృష్టికి వెళితే పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాముణ్ణి దైవంగా భావించే లక్షలాది మంది భక్తులు భద్రాద్రి రామాలయంలో జరుగుతున్న కళ్యాణ వ్యవహారంపై నినదిస్తేనైనా ముఖ్యమంత్రి దీనిపై దృష్టిపెడతారేమో!

జమలాపురపు శ్రీనివాస్

Advertisement
Advertisement
Advertisement