Abn logo
Mar 17 2021 @ 15:33PM

రాముడు దుర్గామాత భక్తుడు: మమతా బెనర్జీ

కోల్‌కతా: భారతీయ జనతా పార్టీ నేతలు ‘జై శ్రీరాం’ అని మాత్రమే అంటారని, వారు ‘జై సియా రాం’ అని అనరని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ప్రజలెవరూ ధర్మాన్ని పాటించే అవకాశం ఉండదని ఆమె ఆరోపించారు. బుధవారం జర్‌గ్రాంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘భారతీయ జనతా పార్టీకి ఓటేయకండి. ఒకవేళ ఆ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మీ ధర్మాన్ని మీరు పాటించలేరు. బీజేపీ అధికారంలోకి వస్తే జై శ్రీరాం అని మాత్రమే చెప్పాల్సి వస్తుంది, జై సియా రాం అని చెప్పేందుకు అవకాశం ఉండదు. బీజేపీ నేతలు కూడా జై శ్రీరాం అని మాత్రమే అంటారు’’ అని ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మమత అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘‘రాముడు దుర్గామాత భక్తుడు. తరుచూ దుర్గామాతకు రాముడు పూజలు చేసేవాడు. రాముడి కంటే దుర్గా మాత పెద్ద దైవం’’ అని అన్నారు.


మార్చి 15 నుంచి ఏప్రిల్ 17 వరకు ఎనిమిది విడతల్లో జరగనున్న బెంగాల్ ఎన్నికల పోలింగ్ ఫలితాలు మే 2న విడుదల కానున్నాయి.